C Kalyan-Dil Raju: నిర్మాతల మధ్య భేదాభిప్రాయాలు లేవు: సి. కల్యాణ్‌

5 Aug, 2022 07:39 IST|Sakshi

C Kalyan Dil Raju Comments After Telugu Film Chamber Of Commerce Meeting: సినిమా షూటింగ్‌లు బంద్‌ అయిన నేపథ్యంలో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి గురవారం (ఆగస్టు 4) భేటీ అయింది. ఈ  సమావేశంలో పలు అంశాలను చర్చించారు. అనంతరం తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కల్యాణ్‌ మాట్లాడుతూ.. ‘‘సినిమా షూటింగ్‌ల బంద్‌ విషయంలో నిర్మాతల మధ్య భేదాభిప్రాయాలు లేవు. సమస్యల పరిష్కారం కోసమే చిత్రీకరణలు ఆపాం. సమస్యల పరిష్కారం కోసం షూటింగ్‌ల బంద్‌ని ఒక మహాయజ్ఞంలాగా ప్రారంభించాం. అయితే బయట అందరూ ఏవేవో చెబుతుంటారు.. వాటిని నిర్మాతలు పట్టించుకోవద్దు. అందరం కలిసికట్టుగా ఉందాం. సమస్యలు పరిష్కరించుకుందాం. ఫిల్మ్‌ ఛాంబర్‌ జనరల్‌ సెక్రటరీ, కౌన్సిల్‌ జనరల్‌ సెక్రటరీల ఆధ్వర్యంలో పనులు డివైడ్‌ చేసుకొని ముందుకు వెళుతున్నాం. త్వరలోనే సమస్యలు పరిష్కారం అవుతాయి’’ అని తెలిపారు. 

‘‘ప్రస్తుతం నెలకొన్న సమస్యలపై ఫిలిం ఛాంబర్‌ ఆధ్వర్యంలో నాలుగు కమిటీలు వేసి, చర్చిస్తున్నాం. వాటిలో సినిమాలు రిలీజ్‌ అయిన ఎన్ని వారాలకు ఓటీటీకి వెళితే ఇండస్ట్రీకి మంచిది అని చర్చించేందుకు ఓ కమిటీ వేసుకున్నాం. థియేటర్స్‌లో వీపీఎఫ్‌ చార్జీలు, పర్సెంటేజ్‌లు ఎలా ఉండాలన్నదానిపై మరో కమిటీ వేశాం. ఫెడరేషన్‌ వేజెస్, వర్కింగ్‌ కండిషన్స్‌పై కూడా ఓ కమిటీ వేశాం. ప్రొడక్షన్‌లో వృథా ఖర్చు తగ్గింపు, వర్కింగ్‌ కండీషన్స్‌, షూటింగ్‌ ఎన్ని గంటలు చేయాలనేదానిపై చర్చించేందుకూ మరో కమిటీ వేశాం. మా అందరికీ నెలల తరబడి షూటింగ్స్‌ ఆపాలన్న ఉద్దేశం లేదు. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం’’ అని నిర్మాత దిల్‌ రాజు పేర్కొన్నారు. 

తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ''కొవిడ్‌ పాండమిక్‌ తరువాత సినిమా పరిశ్రమ వర్కింగ్‌ కండిషన్‌లో చాలా మార్పులు వచ్చాయి. దానివల్ల ప్రొడ్యూసర్స్ కు ఎక్కువ నష్టం వచ్చింది. కాబట్టి తెలుగు ఫిలిం ఛాంబర్ తరుపున నిర్మాతలకు పూర్తి మద్దతు ఇస్తున్నాం. కానీ మీడియాలో మాత్రం చాలా వేరే విధంగా రాస్తున్నారు. కాబట్టి ఛాంబర్ తరుపున ఏదైతే బులెటిన్‌ ఇస్తామో అదే రాయండి'' అని తెలిపారు. 

మండలి కార్యదర్శి శ్రీ. టి. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ .. ''ఇవాళ ప్రేక్షకులు థియేటర్‌కు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇలాంటి తరుణంలో పరిశ్రమను ఓక తాటిపై ఇండస్ట్రీ ను కాపాడుకోవాలనే ఉద్దేశ్యం తో ఓటీటీకి సినిమా ఎప్పుడు ఇవ్వాలి? సామాన్యుడు థియేటర్ కు రప్పించడానికి టికెట్ రేట్స్ ను రీదనేబుల్‌గా తగ్గించలానే విషయాలపై కృషి చేస్తున్నాం. ఆ తరువాత వర్కర్స్‌ వేజేస్‌ విషయమై ఫెడరేషన్‌ తోను, కాస్ట్ ప్రొడక్షన్‌ విషయమై దర్శకులు మీటింగుల్లోనూ, ఆర్టిస్టుల సహకారం కొరకు మా అసోసియేషన్ తోను, సంప్రదింపులు చేస్తున్నాం. గతంలో ఎన్టీరామారావు గారు, అక్కినేని నాగేశ్వర్ రావు గారు లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకునే రోజుల్లోనే రూ. 10 వేలు తీసుకొని తెలుగు చలన చిత్ర పరిశ్రమను కాపాడారు. రెండోది డిజిటల్‌ ఛార్జీలు నిర్మాతలకు చాలా భారంగా ఉంది. ఈ సమస్య నుంచి బయటపడాలి. పర్సంటేజ్‌ సిస్టమ్‌లో చిన్న సినిమాకు, ఒక పర్సంటేజ్‌ అని, పెద్ద సినిమాకు ఒక పర్సంటేజ్‌ అని ఎక్జిబిటర్స్‌ అడుగుతున్నారు. 

ఈ సమ్యసలన్నీ చర్చించడం కోసం సినిమాల షూటింగ్‌లు వాయిదా వేయడం జరిగింది. దీన్ని మీరు స్ట్రైక్ అనొద్దు. బంద్ అనొద్దు. ఇండస్ట్రీకు పూర్వ వైభోవం తీసుకొని రావడానికి మేము అందరం పని చేస్తున్నాము. దయచేసి మీడియా వారికీ ఒక చిన్న విన్నపం గిల్డ్ మీటింగ్ అని రాయకండి, కేవలం తెలుగు ఫిలిం ఛాంబర్ మాత్రమే పేరెంట్ బాడీ, కాబట్టి మీటింగులు అన్ని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. కాబట్టి ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కలిసికట్టుగా పని చేస్తూ.. ఎవ్వరిని ఇబ్బంది పెట్టడము, నష్టపరచడము మా ఉద్దేశ్యము కాదు. కరోనా లాంటి కష్ట కాలంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ని ఆదరించిన ప్రతి ప్రేక్షకుడికి శతధా ధన్యవాదాలు. వాళ్ల ఆదరణ మూలంగా ప్రపంచంలోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గొప్పగా ఉందని చెప్పుకొంటున్నాం. అలాంటి ప్రేక్షకులకు పాదాభివందనం చేస్తున్నాము. అలాంటి ప్రేక్షకులకు టికెట్ రేట్స్ భారంగా ఉండకూడదని టికెట్ రేట్స్ తగ్గిస్తున్నాము. ఈ సమావేశం తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, మా అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్, ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్ లతోను సంప్రదింపులు జరుగుతాయి'' అని తెలిపారు. 
 

మరిన్ని వార్తలు