Cab Stories: ‘క్యాబ్‌ స్టోరీస్‌’ మూవీ రివ్యూ

30 May, 2021 00:00 IST|Sakshi

రివ్యూ టైమ్‌ – ‘క్యాబ్‌ స్టోరీస్‌’ 

వెబ్‌ సిరీస్‌: ‘క్యాబ్‌ స్టోరీస్‌’;
తారాగణం: దివి, శ్రీహాన్, గిరిధర్, ధన్‌రాజ్‌;
సంగీతం: సాయి కార్తీక్‌;
నిర్మాత: ఎస్‌. కృష్ణ;
రచన – దర్శకత్వం: రాజేశ్‌;
రిలీజ్‌: మే 28; ఓటీటీ: స్పార్క్‌

చిన్న చిన్న సంఘటనల్ని కూడా మంచి కథగా అల్లుకోవచ్చు. అల్లిక బాగుండి, ఆసక్తిగా తెర మీద చెప్పగలిగితే మనసుకు హత్తుకుంటుంది. అలా ఓ క్యాబ్‌ ప్రయాణంతో మొదలై... జరిగిన అనేక సంఘటనల సమాహారాన్ని సిరీస్‌గా తీస్తే?  కానీ, ‘చూపెట్టాల్సిన’ సంఘటననూ, కథనూ... ‘చెప్పాలని’ ప్రయత్నిస్తే ఏమవుతుంది? తాజా వెబ్‌ సిరీస్‌ ‘క్యాబ్‌ స్టోరీస్‌’ ఆసాంతం చూస్తే అర్థమవుతుంది. 


కథేమిటంటే..: హైదరాబాద్‌లో క్యాబ్‌ డ్రైవర్‌ గిరి (గిరిధర్‌). ఓ కస్టమర్‌ను దింపేటప్పుడు అనుకోకుండా అతను వదిలేసిన ఓ డ్రగ్‌ ప్యాకెట్‌ కంట పడుతుంది. అదే సమయంలో ఓ పబ్‌ దగ్గర షాలిని (‘బిగ్‌బాస్‌4’ ఫేమ్‌ దివి) అనే అమ్మాయి ఆ క్యాబ్‌ ఎక్కుతుంది. ఆ డ్రగ్‌ ప్యాకెట్‌ను దాచడానికి ఆ అమ్మాయి హ్యాండ్‌ బ్యాగ్‌లో పెడతాడు. ఆ తరువాత జరిగే పరిణామాలతో ఆ ప్యాకెట్‌ రకరకాల ప్లేసులు మారుతుంది. షాలినిని వాడుకోవాలనుకొనే లవర్‌ సాగర్‌ (శ్రీహాన్‌), షాలిని ఫ్రెండ్‌ (నందిని), క్యాబ్‌ డ్రైవర్‌కు ఫ్రెండైన కానిస్టేబుల్‌ రుద్రనేత్ర (ధన్‌రాజ్‌)  – ఇలా ఇతర పాత్రలూ వస్తాయి. ఆ ప్యాకెట్‌లో డ్రగ్‌ కాకుండా ఇంకేముంది? దాన్ని దక్కించుకోవాలని విలన్లు ఎలా ప్రయత్నించారు? ఏమైందన్నది మిగతా కథ. 


ఎలా చేశారంటే..:  ఈ కథలో ప్రధాన పాత్రధారి, కథ నడవడానికి సూత్రధారి క్యాబ్‌ డైవర్‌. కథలో ఆద్యంతం కనిపించే నిడివి ఎక్కువున్న ఆ పాత్రలో నటుడు గిరిధర్‌ కనిపించారు. జనం గుర్తుంచుకొనే పాత్ర ఆయనకు చాలా రోజులకు దక్కింది. పూర్తి మంచివాడూ కాక, అలాగని పూర్తి చెడ్డవాడూ కాక మధ్యస్థంగా ఉండే ఆ పాత్రలోని కన్‌ ఫ్యూజన్‌ పాత్రధారణలోనూ ప్రతిఫలించింది. ‘బిగ్‌బాస్‌–4’ ఫేమ్‌ దివి మరో ప్రధాన పాత్రధారిణి. ‘మహర్షి’ చిత్రంలో హీరోయిన్‌ పూజాహెగ్డే ఫ్రెండ్‌గా కాసేపు కనిపించిన దివి, తాజా ఫేమ్‌ తరువాత చేసిన పెద్ద రోల్‌ ఇదే. అమాయకంగా ప్రియుణ్ణి నమ్మేసే షాలిని పాత్రలో ఆమె చూడడానికి బాగున్నారు. తొలి పాటలో గ్లామర్‌ దుస్తుల్లో డ్యాన్సూ బాగా చేశారు. అయితే, ఓవరాల్‌గా ఆ పాత్రలో చేయగలిగింది పెద్దగా లేదు. ఒకమ్మాయితో ఎంగేజ్‌మెంట్‌కు సిద్ధమవుతూనే మరోపక్క దివిని ముగ్గులోకి దింపాలని ప్రయత్నించే ప్రేమికుడిగా టీవీ స్టార్‌ శ్రీహాన్‌ కనిపిస్తారు. సినిమాలో కమెడియన్లు ధన్‌ రాజ్, ప్రవీణ్‌ (హెరాసింగ్‌ హెచ్‌.ఆర్‌. మేనేజర్‌), ఒకే సీన్‌లో కనిపించి నవ్వించే అనంత్‌ (సైకియాట్రిస్ట్‌ శర్మ) – ఇలా సుపరిచితులూ చాలా మంది ఉన్నారు. కానీ ఏ పాత్రకూ పూర్తి ప్రాధాన్యం, ఓ పరిపూర్ణత ఉండవు. విలన్‌ పాత్రలనైతే గుర్తుపట్టడం, పెట్టుకోవడం కష్టం.


ఎలా తీశారంటే..: దర్శక, నిర్మాత రామ్‌ గోపాల్‌వర్మ భాగస్వామిగా మొదలైన కొత్త ఓటీటీ ‘స్పార్క్‌’ వరుసగా సినిమాలు, సిరీస్‌ లతో ముందుకొస్తోంది. ఇటీవలే ‘డి కంపెనీ’ తరువాత ఇప్పుడీ ‘క్యాబ్‌ స్టోరీస్‌’ రిలీజ్‌ చేశారు. కథ మొదట్లో, చివరల్లో టైటిల్స్‌ పడుతుండగా వచ్చే ‘కిస్కో పతా హై సాలా...’ పాట విభిన్నమైన చిత్రీకరణతో ఆసక్తి రేపుతుంది. క్యాబ్‌లో కథ మొదలైనప్పుడు బాగున్నా, గతానికీ, వర్తమానానికీ పదే పదే డైలాగుల ప్రయాణం ఒక దశ దాటాక ఆకర్షణ కోల్పోయింది.


క్యాబ్‌ డ్రైవర్‌ మొదట మంచివాడన్నట్టు మొదలుపెట్టి, కాసేపయ్యే సరికి అతనిలోని అతి తెలివి చూపించి, చివరకు వచ్చేసరికి అతనా డ్రగ్‌ ప్యాకెట్‌ మార్పిడి ఎందుకు చేశాడనేది మూడు ముక్కల్లో చెప్పడం – చూసేవాళ్ళకు ఓ పట్టాన ఎక్కదు. అలాగే, మెడికల్‌ షాపు దగ్గర దివి ఉండగానే, డ్రగ్‌ మార్చేయడం సినిమాటిక్‌ కన్వీనియ¯Œ ్సగా సరిపెట్టుకోవాలి. నిర్మాణ విలువలు పరిమితంగానే ఉన్న ఈ సిరీస్‌లో బలమైన లవ్‌ స్టోరీ లేకపోయినా సినిమాటిక్‌గా ఓ పాట పెట్టారు. అలాగే, సీన్‌లో లేని ఉద్విగ్నతను కూడా సంగీతం ద్వారా సృష్టించడానికి సంగీత దర్శకుడు సాయి కార్తీక్‌ శ్రమించారు. 


కిస్కో... పాట చిత్రీకరణలో కెమేరా వర్క్‌ బాగుంది. కథలోనూ అక్కడక్కడ మెరుపులున్నాయి. కానీ, మొత్తం మీద కథారంభంలో క్రియేట్‌ చేసిన ఇంట్రస్ట్‌ని కాస్తా స్లో నేరేషన్, అనవసర సన్నివేశాలు, అవసరం లేని సినిమాటిక్‌ పోకడలతో దర్శక, రచయితలే జారవిడిచారనిపిస్తుంది. నిడివి గంటన్నరే అయినా, చాలాసేపు చూసిన ఫీలింగ్‌ అనిపిస్తుంది. అర్ధోక్తిగా ఈ భాగం ముగించి,  వాల్యూమ్‌2 అని టైటిల్‌ వేయడంతో మరో పార్టు వస్తుందని సిద్ధపడాలి.

బలాలు:
కొన్ని ఆసక్తి రేపే ట్విస్టులు  
నటి దివి స్క్రీన్‌ప్రెజెన్స్‌
ధన్‌రాజ్, ప్రవీణ్, అనంత్‌ లాంటి సుపరిచిత కమెడియన్లు
‘కిస్కో పతాహై...’ సాంగ్‌

బలహీనతలు:
సాగదీత స్లో నేరేషన్‌
పండని లవ్‌ స్టోరీ
ఏ పాత్రకూ సమగ్రత లేకపోవడం
సినిమాటిక్‌ సీన్లు, స్క్రీన్‌ ప్లే

కొసమెరుపు: షార్ట్‌ ఫిల్మ్‌కు ఎక్కువ... సిరీస్‌కు తక్కువ జర్నీ!

– రెంటాల జయదేవ 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు