నాలుగు గోడల మధ్య నరకాలు నడిచొచ్చిన చోట...

9 Jun, 2022 04:19 IST|Sakshi
ప్రగతిశీల చర్చలకు కేంద్ర బిందువు: ‘కేజ్‌డ్‌’ ; ‘కేజ్‌డ్‌’ లఘుచిత్రం దర్శకురాలు లీజా మాథ్యూ

కొన్ని చిత్రాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయి... కొన్ని చిత్రాల చిత్రజైత్రయాత్ర మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ‘కేజ్‌డ్‌’ అనే లఘుచిత్రం కూడా ఇలాంటిదే! దీనిలో ఎలాంటి కమర్షియల్‌ గిమ్మిక్కులు లేవు... కన్నీటిబొట్లు ఉన్నాయి. వాటిలోకి ఒకసారి తొంగిచూస్తే మన ఊరు,వాడ, ఇల్లు కనిపిస్తాయి.

కరోనా కాలంలో... ముఖ్యంగా లాక్‌డౌన్‌ టైమ్‌లో... ఒక ఊళ్లో ఒక భర్త:
‘చికెన్‌ బిర్యానీ వండిపెట్టమని రెండురోజుల నుంచి చెబుతున్నాను. పుట్టింటి వాళ్లతో మాట్లాడడానికి టైమ్‌ ఉంటుందిగానీ నేను అడిగింది చేసి పెట్టడానికి మాత్రం టైమ్‌ ఉండదు. మగాడికి
 విలువ లేకుండా పోయింది’

మరో ఊళ్లో ఒక భర్త:
ఈయన ఇంట్లో ఉండడం కంటే ఆఫీసులో ఉండడమే ‘కుటుంబ సంక్షేమం’ అనుకుంటారు కుటుంబసభ్యులు. ఈ భర్త చాదస్తాల చౌరస్తా. ‘ఇది ఇల్లా అడవా? ఏంచేస్తున్నావు? ఎక్కడి వస్తువులు అక్కడే పని ఉన్నాయి’ అని గర్జించే ఈ భర్తకి టీవికి ఠీవీగా  ముఖం అప్పగించడం తప్ప చిన్నచిన్న పనులలో కూడా భార్యకు సహాయం చేయడానికి  మనసు రాదు.

ఇంకో ఊళ్లో ఇంకో భర్త:
ఈయనకు ఏమాత్రం టైమ్‌ దొరికినా అత్తింటివాళ్లు బాకీపడ్డ అదనపు కట్నం గురించి అదేపనిగా గుర్తొస్తుంది. అలాంటిది లాక్‌డౌన్‌ పుణ్యమా అని అతడు రోజంతా ఇంట్లోనే ఉన్నాడు. మాటలతోనే ఇంట్లో వరకట్న హింసను సృష్టించాడు.

ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. లాక్‌డౌన్‌ టైమ్‌లో ప్రపంచవ్యాప్తంగా మహిళలు రకరకాల హింసలు ఎదుర్కొన్నారు. ఈ హింసపై ఐక్యరాజ్య సమితి సాధికారికమైన నివేదికను ప్రచురించింది. దీనిని ఆధారం చేసుకొని అమెరికాలో స్థిరపడిన మలయాళీ డైరెక్టర్‌ లీజా మాథ్యూ ‘కేజ్‌డ్‌’ పేరుతో షార్ట్‌ఫిల్మ్‌ రూపొందించింది.

లాక్‌డౌన్‌ టైమ్‌లో అక్షరజ్ఞానం లేని మహిళలతో పాటు బాగా చదువుకున్న మహిళలు, ఇంటిపనులకే పరిమితమైన వారితో పాటు, ఉద్యోగాలు చేస్తున్న మహిళలు ఎదుర్కున్న మానసిక, శారీరక, భావోద్వేగ హింసకు ‘కేజ్‌డ్‌’ అద్దం పడుతుంది.

చిత్రంలో సంద్ర, జయ, విను, క్లైర్‌ ప్రధాన పాత్రలు. ప్రాంతం, దేశంతో సంబంధం లేకుండా ప్రపంచంలోని వివిధ రకాల హింస బాధితులకు వీరు ప్రతీకలు. నిజానికి వీరు చిత్రం కోసం బాధితుల అవతారం ఎత్తిన వారు కాదు. నిజజీవితంలోనూ బాధితులే. సంద్ర, జయ, విను, క్లైర్‌ పాత్రలు పోషించిన సచిన్మై మేనన్, దివ్య సంతోష్, శిల్పఅరుణ్‌ విజయ్, రిలే పూల్‌లు భిన్నరకాల హింస బాధితులే. రిలే పూల్‌ విషయానికి వస్తే నిజజీవితంలోనూ ట్రాన్స్‌జండరే.

‘యువ అమెరికన్‌లపై హింస జరిగితే, తేరుకొని తిరిగిపోరాడతారు. మనదేశంలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ముఖ్యంగా గృహహింసకు సంబంధించిన కేసుల్లో చాలామంది మౌనంగా ఉంటున్నారు. మానసికహింస భౌతికహింస కంటే తక్కువేమీ కాదు’ అంటుంది లీజా మాథ్యూ.
కొట్టాయం (కేరళ)కు చెందిన లీజా మాథ్యూ గత పదిసంవత్సరాలుగా అమెరికాలో స్థిరపడింది.

పద్దెనిమిది నిమిషాల నిడివి గల ‘కేజ్‌డ్‌’  మానసిక హింస నుంచి లైంగిక హింస వరకు మహిళలు ఎదుర్కొన్న రకరకాల హింసలను బయటపెడుతుంది. మొన్న మొన్నటి ముంబై ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌తో సహా లండన్‌ ఇండీ షార్ట్‌ఫిల్మ్‌ ఫెస్టివల్, నయాగరా ఫాల్స్‌ షార్ట్‌ ఫెస్టివల్, టొరంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌... ఎన్నో చిత్రోత్సవాలలో ప్రదర్శితమై రకరకాల ప్రగతిశీల చర్చలకు కేంద్ర బిందువుగా నిలిచింది.

 

మరిన్ని వార్తలు