కెమెరామ్యాన్‌ జయరాం కన్నుమూత

22 May, 2021 06:12 IST|Sakshi

‘మేజర్‌ చంద్రకాంత్, పెళ్లిసందడి’ తదితర చిత్రాల ఛాయాగ్రాహకుడు వెంగల జయరాం (70) కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడ్డ ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. జయరాం స్వస్థలం వరంగల్‌. దివంగత ఎన్టీఆర్‌ అంటే ఎంతో అభిమానం. 1960లో ‘ఇల్లరికం’ సినిమాను దాదాపు 15 సార్లు చూశారట.. అప్పుడే ఆయనకు సినిమాలపై ఆసక్తి పెరిగింది. టైటిల్స్‌లో ఛాయాగ్రాహకుడు విన్సెంట్‌ సుందరం పేరు చదివేవారు. ఆ తర్వాతి కాలంలో ఆయనకు శిష్యుడు అయ్యారు జయరాం. సినిమా ఇండస్ట్రీలో ఏదో చేయాలనే లక్ష్యంతో 13 ఏళ్ల వయసులో ఇంట్లో చెప్పకుండా పారిపోయి చెన్నై చేరారు. అక్కడ దర్శకుడు గుత్తా రామినీడు సిఫారసుతో ఆంధ్రా క్లబ్‌లో ఓ చిన్న ఉద్యోగం వచ్చింది. జయరాం ఫ్రెండ్‌ వి. అంకిరెడ్డి ఎడిటర్‌.

జయరాంలోని ఆసక్తి గమనించిన రామినీడు ‘పగలు నీ జాబ్‌ చేసుకో.. రాత్రి ఈ వర్క్‌ నేర్చుకో’ అన్నారు. ఆంధ్రా క్లబ్‌లో క్యాషియర్‌ స్థాయికి ఎదిగారు జయరాం. ఆ తర్వాత అవుట్‌ డోర్‌ యూనిట్‌ నుంచి కెమెరా అసిస్టెంట్, ఆ తర్వాత కెమెరామ్యాన్‌ స్థాయికి ఎదిగారాయన. కెమెరామేన్‌గా ఆయన మొదటి సినిమా చిరంజీవి హీరోగా నటించిన ‘చిరంజీవి’. ‘శ్రీ షిర్డీ సాయిబాబా మహాత్మ్యం’ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ‘1921’ అనే మలయాళ సినిమా జయరాంకు అవార్డును తెచ్చిపెట్టింది. తన అభిమాన హీరో ఎన్టీఆర్‌తో ‘మంచికి మరోపేరు, డ్రైవర్‌ రాముడు, వేటగాడు, సింహబలుడు’, ఏయన్నార్, కృష్ణ, మలయాళంలో మమ్ముట్టి, మోహన్‌లాల్‌ తదితర హీరోల చిత్రాలకు చేశారు. మోహన్‌బాబు సొంత బ్యానర్‌లో నిర్మించిన ఎన్నో చిత్రాలకు పనిచేశారు. తెలుగు, మలయాళ ఇండస్ట్రీల్లో పలు అవార్డులు, రివార్డులు అందుకున్నారాయన. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. జయరాం మృతి పట్ల తెలంగాణ ఫిలిం సొసైటీ ఫౌండర్‌ సెక్రటరీ డా. కొణతం కృష్ణ, కార్యవర్గ సభ్యులు రవి, రమేష్‌ వరంగల్‌లో నివాసం ఉంటున్న జయరాం సోదరిని కలిసి సంతాపం వ్యక్తం చేశారు. ఇంకా పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు