రెండుసార్లు క్యాన్సర్‌ను జయించిన నటి.. పాపం మళ్లీ విషమించిన ఆరోగ్యం!

4 Nov, 2022 21:26 IST|Sakshi

పొట్టి జుట్టు.. చందమామ లాంటి రూపంతో కనిపించే ఆ ముద్దుగుమ్మ..  మామూలు యోధురాలు కాదు. ప్రాణాంతక క్యాన్సర్‌ను జయించింది. అదీ ఒక్కసారి కాదు.. రెండుసార్లు!. పూర్తిగా కోలుకుని నటనలోకి మళ్లీ అడుగుపెట్టి అభిమానులను అలరిస్తోందనగా.. పిడుగులాంటి వార్త. ఆమె ఆరోగ్యం మరోసారి తిరగబడింది. ఈసారి పరిస్థితి విషమించి ప్రాణాంతక స్థితికి చేరుకుంది. 

ప్రముఖ బెంగాలీ నటి ఐంద్రీలా శర్మ.. చక్కని రూపం, హోమ్లీ క్యారెక్టర్‌లతో ఇంటిల్లిపాదిని అలరిస్తూ విశేష అభిమానుల్ని సంపాదించుకుంది.  జుమూర్‌, భోలే, బాబా పర్‌ కరేగా లాంటి పలు చిత్రాలతో విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. మరోవైపు సీరియల్స్‌లోనూ నటిస్తూ బుల్లితెర గుర్తింపూ దక్కించుకుంది. క్యాన్సర్‌ సోకపోయి ఉంటే ఆమె ఖాతాలో ఇప్పటికే ఎన్నో చిత్రాలు ఉండేవే.  

రెండుసార్లు క్యాన్సర్‌ను జయించిన ఐంద్రీలా శర్మ.. తాజాగా స్ట్రోక్‌ రావడంతో ఆస్పత్రిలో చేరింది. క్రమంగా కోలుకుంటోందని వైద్యులు ప్రకటించడంతో.. ఆమె పరిస్థితి మెరుగుపడుతోందని అంతా భావించారు. అయితే ఆమె ఇంకా కోమాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇంట్రా సెరిబ్రల్ హెమరేజ్ కారణంగా ఆమె శరీరంలో కొంత భాగం పక్షవాతానికి గురైందని వైద్యులు అనుమానిస్తున్నారు. అంతేకాదు.. వెంటిలేటర్‌పై ఆమె పరిస్థితి విషమంగా ఉందని, మెదడులో అక్కడక్కడ రక్తం గడ్డకట్టిందని తెలుస్తోంది. 

దిగ్గజ నటి సుచిత్ర సేన్‌ స్ఫూర్తితో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఐంద్రీలా శర్మ.. చిన్నవయసులోనే ఇలా ప్రాణాంతక స్థితికి చేరకోవడంపై బెంగాలీ ప్రేక్షకులు, ఆమె అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అద్భుతం జరిగి ఆమె కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. 

గతంలో కీమోథెరపీల ద్వారా, సంక్లిష్టమైన సర్జరీల ద్వారా ఆమె క్యాన్సర్‌ నుంచి రెండుసార్లు కోలుకున్నారు. బెంగాలీలో పలు చిత్రాలతో పాటు ఓటీటీ ప్రాజెక్టులతోనూ ఆమె అలరించారు. టీవీ షోలతోనూ అలరించిన ఈ ముద్దుగుమ్మ.. తోటి నటుడు(జుమూర్‌ సీరియల్‌లో లీడ్‌ పెయిర్‌) సవ్యసాచి చౌదరితో డేటింగ్‌ చేస్తోంది. క్యాన్సర్‌ నుంచి కోలుకుని మళ్లీ ఓటీటీ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్న సమయంలో ఇలా ఒక్కసారిగా ఆస్పత్రి పాలైంది.

ఇదీ చదవండి: వీ ఆర్‌ జస్ట్‌ ఫ్రెండ్స్‌: జాన్వీ కపూర్‌

మరిన్ని వార్తలు