Zelensky: కాన్స్‌ ఫిలింఫెస్టివల్‌లో వర్చువల్‌గా ప్రసంగించిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు

18 May, 2022 14:19 IST|Sakshi

Ukraine President Zelensky in Surprise Video At Cannes Film Festival: ప్రతిష్టాత్మక కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వేడుకలు ఫ్రాన్స్‌లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 12 రోజుల పాటు జరిగే ఈ 75వ కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్‌కీ వర్చువల్‌గా ప్రారంభోపన్యాసం చేశారు. వీడియో లింక్ ద్వారా ప్రసంగించిన ఆయన తెరపై కనిపించగానే ఈ వేడుకలో పాల్గొన్న వారంత ఆయనకు స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా జెలెన్స్‌కి మాట్లాడుతూ.. రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉక్రేనియన్లకు సినీ ప్రపంచం అండగా నిలవాలని, సంఘీభావం తెలపాలని కోరారు. సినిమా-వాస్తవికత మధ్య ఉన్న సంబంధంపై సుదీర్ఘంగా మాట్లాడారు.

చదవండి: అట్టహాసంగా కాన్స్‌ చిత్రోత్సవాలు ఆరంభం

అనంతరం 1979లో వచ్చిన ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పాల సినిమా ‘అపోకలిప్స్ నౌ’, 1940లో వచ్చిన చార్లీచాప్లిన్ సినిమా ‘ది గ్రేట్ డిక్టేటర్’పై ఆయన ప్రస్తావించారు. ‘‘ది గ్రేట్ డిక్టేటర్’ సినిమాను ఉటంకిస్తూ.. మనుషుల మధ్య విద్వేషం నశించిపోతుంది. నియంతలు అంతమవుతారు. ప్రజల నుంచి లాక్కున్న అధికారం తిరిగి ప్రజల చేతుల్లోకి వస్తుంది’’ అని జెలెన్‌స్కీ నొక్కి చెప్పారు. మన కాలపు సినిమా నిశ్శబ్దంగా లేదని చాటిచెప్పే మరో కొత్త చార్లీ చాప్లిన్ కావాలని అన్నారు. వారి భవిష్యత్ సినిమాపైనే ఆధారపడి ఉందని చెప్పిన జెలెన్‌స్కీ.. నేడు సినిమా నిశ్శబ్దంగా లేదని, ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అన్నారు.

చదవండి: ‘కంగనా చిత్రాలన్ని ఫ్లాప్‌ అవ్వాలని కోరుకుంటున్నా’

ప్రజల చేతుల్లోంచి లాక్కున్న అధికారం తిరిగి వారికే దక్కుతుందని స్పష్టం చేశారు. జెలెన్‌స్కీ ప్రసంగానికి ప్రతి ఒక్కరు లేచి నిలబడి చప్పట్లతో హర్షధ్వానాలు తెలిపారు. కాగా 12 రోజులపాటు జరగనున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో సెర్గీ లోజ్నిట్సా డాక్యుమెంటరీ ‘ది నేచురల్ హిస్టరీ ఆఫ్ డిస్ట్రక్షన్’ సహా ఉక్రెయిన్‌కు చెందిన పలు సినిమాలను ప్రదర్శిస్తారు. యుద్ధం కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో లిథువేనియన్ చిత్ర నిర్మాత మాంటాస్ క్వేదరవియస్ మృతి చెందారు. మరణానికి ముందు ఆయన చిత్రీకరించిన ఫుటేజీని ఆయన కాబోయే భార్య హన్నా బిలోబ్రోవా కేన్స్‌లో ప్రదర్శించనున్నారు. ఈ ఫెస్టివల్‌లో ఈసారి ఆరు భారతీయ చిత్రాలను ప్రదర్శించనున్నారు.

ఈ జాబితాలో ‘రాకెట్రీ ద నంబీ ఎఫెక్ట్‌’, ‘గోదావరి’, ‘దుయిన్‌’, ‘ఆల్ఫా బీటా గామా’, ‘బూంబా రైడ్‌’, ‘నిరయి తాతకుల్ల మారమ్‌’ చిత్రాలు ఉన్నాయి. భారత్‌కు గౌరవ సభ్య దేశం హోదా దక్కడంతో కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని సెలబ్రిటీల టీమ్‌ ఈ వేడుకలకు హాజరయ్యారు. మాధవన్, రిక్కీ కేజ్, వాణీ త్రిపాఠి, ప్రసూన్ జోషి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, శేఖర్ కపూర్.. ఫస్ట్‌ రోజు రెడ్‌ కార్పెట్‌పై ఫొటోలకు పోజులిచ్చారు. ఇక జ్యురీ సభ్యురాలిగా  దీపికా పడుకోన్‌.. సభ్యసాచి చీరకట్టులో అదరహో అనిపించారు. నటి, ప్రముఖ మోడల్ ఊర్వశి రౌటెలా, మిల్కీ బ్యూటీ తమన్నా డిజైనర్‌ వేర్స్‌లో రెడ్‌కార్పొట్‌పై హొయలు పోయారు.

మరిన్ని వార్తలు