సంతోష్‌ శివన్‌కు కాన్స్‌ అవార్డు.. తొలి భారతీయుడిగా రికార్డ్‌

25 Feb, 2024 01:01 IST|Sakshi

ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ సంతోష్‌ శివన్‌కు అరుదైన గౌరవం లభించింది. కాన్స్‌ చలన చిత్రోత్సవాల్లో అందించే ప్రతిష్టాత్మకమైన పియర్‌ ఏంజెనీ అవార్డు ఈ ఏడాది సంతోష్‌ శివన్‌ను వరించింది. మే 14 నుంచి మే 25 వరకు 77వ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఫ్రాన్స్‌లో జరగనుంది. మే 24న సంతోష్‌ శివన్‌ అవార్డు అందుకోనున్నారని హాలీవుడ్‌ సమాచారం. కాగా ఈ అవార్డును అందుకోనున్న తొలి భారతీయుడు కూడా సంతోష్‌ శివనే అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక సినిమాటోగ్రఫీ విషయంలో విశిష్ట సేవలు అందించి, రెట్రో ఫోకస్‌ అండ్‌ మోడ్రన్‌ లెన్స్‌ను కనుగొన్న ఫ్రెంచ్‌ శాస్త్రవేత్త  పియర్‌ ఏంజెనీకి నివాళిగా 2013లో ఆయన పేరిట పియర్‌ ఏంజెనీ అవార్డు ఆరంభించారు కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నిర్వహకులు. అప్పట్నుంచి ప్రతి ఏటా ఒక ఛాయాగ్రాహకుడికి ఈ అవార్డుని ప్రదానం చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది సంతోష్‌ శివన్‌ అందుకోనున్నారు. ఇక ఛాయాగ్రాహకుడిగా సంతోష్‌ చేసిన చిత్రాల్లో హిందీ ‘దిల్‌ సే’, ‘ముంబైకర్‌’ (దర్శకుడిగానూ), తెలుగులో ‘స్పైడర్‌’, తమిళంలో ‘తుపాకీ’, మలయాళంలో ‘ఉరుమి’ (దర్శకుడిగానూ),  వంటి పలు చిత్రాలు ఉన్నాయి. కేవలం సినిమాటోగ్రాఫర్‌గానే కాదు.. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా కూడా నిరూపించుకున్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు