Cannes Film Festival: కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌ రెండో రోజు హైలైట్స్‌

19 May, 2022 07:49 IST|Sakshi

75వ కాన్స్‌ చలన చిత్రోత్సవాలు ఫ్రాన్స్‌లో వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భారతదేశం ‘కంట్రీ ఆఫ్‌ హానర్‌’గా నిలిచింది. కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ నేతృత్వంలో పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. కాన్స్‌ వేదిక సాక్షిగా భారతదేశంలో చిత్రీకరించే విదేశీ చిత్రాలకు నగదు ప్రోత్సాహకాలను ప్రకటించారు అనురాగ్‌ ఠాకూర్‌. తొలి రోజు (మంగళవారం) చిత్రోత్సవాల్లో మన తారలు మెరిశారు. రెండో రోజూ ఇదే జోరు కొనసాగింది. కమల్‌హాసన్‌ ‘విక్రమ్‌’, మాధవన్‌ ‘రాకెట్రీ: ది నంబియార్‌’ చిత్రాల ట్రైలర్స్, సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ దర్శకత్వంలోని ‘లే మస్క్‌’ స్క్రీనింగ్‌కి అర్హత పొందిన విషయం తెలిసిందే. మరిన్ని విశేషాలు ఈ విధంగా...

‘‘మా దగ్గర ఫిలిం ఇండస్ట్రీ లేదు. మా దగ్గర సిని‘మా’ (దేశంలో అమ్మని మా అని కూడా అంటారు కాబట్టి ‘మా’ పదాన్ని ఒత్తి పలుకుతూ)’’ ఉంది అని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. కాన్స్‌ చిత్రోత్సవాల్లో ‘ఇండియన్‌ పెవిలియన్‌’ని ప్రారంభించారు అనురాగ్‌ ఠాకూర్‌. ఈ వేదికపై 53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫీ గోవా 2022) పోస్టర్‌ని ఆవిష్కరించారు. ‘‘భారతదేశంలో చెప్పడానికి చాలా కథలు ఉన్నాయి. ప్రపంచానికి ‘కంటెంట్‌ హబ్‌’గా మారే శక్తి సామర్థ్యాలు ఉన్న దేశం’’ అంటూ కాన్స్‌ చలన చిత్రోత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సందేశాన్ని కాన్స్‌ వేదికపై పంచుకున్నారు.

ఇంకా అనురాగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ – ‘‘గడచిన 20 ఏళ్లల్లో షర్మిలా ఠాగూర్, ఐశ్వర్యా రాయ్, విద్యా బాలన్, శేఖర్‌ కపూర్‌ వంటి ఎందరో కాన్స్‌ ఫెస్టివల్‌లో జ్యూరీ సభ్యులుగా ఉన్నారు. ఈసారి ఆ గౌరవం దీపికా పదుకోన్‌కి దక్కింది. భారతదేశంలో చిత్రీకరించే విదేశీ చిత్రాలను ప్రోత్సహించే దిశగా తీసుకున్న నిర్ణయాలను ఈ వేదికపై ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాను. భారతదేశంలో విదేశీ చిత్రాల ఆడియో–విజువల్‌ కో–ప్రొడక్షన్, షూటింగ్‌ కోసం 260 వేల డాలర్ల (దాదాపు రూ. 2 కోట్లు) పరిమితితో 30 శాతం వరకు నగదు ప్రోత్సాహాన్ని అందిస్తాం. అలాగే దేశంలో జరిపే విదేశీ చిత్రాల షూటింగ్‌కు 15 శాతం లేదా అంతకంటే ఎక్కువ మంది భారతీయ సిబ్బందిని నియమిస్తే 65 వేల డాలర్ల (రూ. 50 లక్షలు) పరిమితితో అదనపు బోనస్‌ ఇస్తాం.

భారతదేశాన్ని ప్రపంచంలోని కంటెంట్‌ హబ్‌గా మార్చడానికి, ఫిల్మ్‌ మేకింగ్, ఫిల్మ్‌ ప్రొడక్షన్, పోస్ట్‌–ప్రొడక్షన్‌ తదితర అంశాలకు భారతదేశాన్ని ప్రపంచానికి గమ్యస్థానంగా మార్చడానికి భారత ప్రభుత్వం చేయగలిగినదంతా చేస్తుంది. జాతీయ ఫిల్మ్‌ హెరిటేజ్‌ మిషన్‌ కింద భారత ప్రభుత్వం ప్రపంచంలోనే అతి పెద్ద ఫిల్మ్‌ రిస్టోరేషన్‌ ప్రాజెక్టును ప్రారంభించింది. దీనివల్ల దేశంలోని పలు భాషలకు చెందిన 2,200 చిత్రాలు తమ పూర్వ వైభవం సంతరించుకుంటాయి.

భారతదేశం స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లు జరుపుకుంటున్నందున ఈ సంవత్సరం ప్రత్యేకమైనది. ఇది 75వ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ కావడం విశేషం. ఈ చిత్రోత్సవాల్లో భారతదేశం ‘గౌరవనీయమైన దేశం’గా అర్హత పొందింది కాబట్టి ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. ఈ 75వ కాన్స్‌ ఉత్సవాల్లో సృజనాత్మకతను, ప్రతిభను సెలబ్రేట్‌ చేసుకోవడానికి భారతదేశం, ఫ్రాన్స్‌ కలిశాయి’’ అన్నారు. అనురాగ్‌ ఠాకూర్‌తో కలసి ప్రముఖ నటుడు కమల్‌ హాసన్, ప్రముఖ దర్శక–నటుడు శేఖర్‌ కపూర్, సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ తదితరులు రెడ్‌ కార్పెట్‌పై నడిచారు.

30 ఏళ్ల తర్వాత కాన్స్‌కి టామ్‌ క్రూజ్‌
హాలీవుడ్‌ నటుడు టామ్‌ క్రూజ్‌ 1992లో కాన్స్‌ చిత్రోత్సవాల్లో పాల్గొన్నారు. 30 ఏళ్ల తర్వాత ఈ వేడుకలకు హాజరయ్యారాయన. టామ్‌ క్రూజ్‌ నటించిన ‘టాప్‌ గన్‌: మేవరిక్‌’ చిత్రం కాన్స్‌ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కానుంది. 1986లో విడుదలైన ‘టాప్‌ గన్‌’కి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. తొలి భాగంలోనూ టామ్‌ క్రూజ్‌ హీరోగా నటించారు.

స్టార్స్‌ స్టెప్పేస్తే...
కాన్స్‌లో ‘ఇండియన్‌ పెవిలియన్‌’ ప్రారంభోత్సవంలో జానపద కళాకారుడు, సంగీత దర్శకుడు మామే ఖాన్‌ పాట పాడగా దీపికా పదుకోన్, తమన్నా, పూజా హెగ్డే, ఊర్వశీ రౌతేలా స్టెప్పులేశారు. 

కాన్స్‌ చిత్రోత్సవాలకు వెళ్ళాలనే నా కల నెరవేరింది. అనురాగ్‌ ఠాకూర్‌గారి వల్లే ఇది సాధ్యపడింది. విశేషం ఏంటంటే.. ఏదైనా బ్రాండ్‌ని ప్రమోట్‌ చేయడానికి నేనిక్కడికి రాలేదు. మన దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి వచ్చాను. భారతీయ నటిగా దేశాన్ని సెలబ్రేట్‌ చేయడానికి వచ్చాను. 
–  పూజా హెగ్డే

భారతదేశం చాలా ఏళ్లుగా ప్రపంచ చలనచిత్ర పరిశ్రమకు ఎంతో చేస్తూ వస్తోంది. దేశం స్వాతంత్య్రం పొందిన 75వ సంవత్సరంలో భారతదేశంతో కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ భాగస్వామి కావడం నిజంగా అద్భుతం.
– తమన్నా

ఇండియా శిఖర సమాన ప్రయాణం మొదలైంది. ఇది ప్రారంభమే... భారతదేశం ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేకుండా, కాన్స్‌ చలన చిత్రోత్సవమే భారతదేశానికి వచ్చే రోజు వస్తుంది.
- దీపికా పదుకోన్‌

A post shared by Global Pageant Buzz (@globalpageantbuzz)

A post shared by Pooja Hegde (@hegdepooja)

చదవండి 👇

ఆది పినిశెట్టి పెళ్లి వేడుకల్లో టాలీవుడ్‌ హీరోల డ్యాన్స్‌

సీరియల్‌ నటి వివాహం.. నెట్టింట వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు