Cannes Film Festival: అట్టహాసంగా కాన్స్‌ చిత్రోత్సవాలు ఆరంభం

18 May, 2022 08:23 IST|Sakshi
ఊర్వశి రౌతేలా, జ్యూరీ సభ్యులతో దీపికా పదుకోన్‌

75వ కాన్స్‌ చలన చిత్రోత్సవాలు ఫ్రాన్స్‌ దేశంలోని కాన్స్‌ నగరంలో మంగళవారం సాయంత్రం అట్టహాసంగా ఆరంభమయ్యాయి. ఈసారి వేడుకల్లో మన దేశం నుంచి ఏఆర్‌ రెహమాన్, శేఖర్‌ కపూర్, మాధవన్, నవాజుద్దిన్‌ సిద్ధిఖి, తమన్నా, నయనతార, పూజా హెగ్డే, ఊర్వశి రౌతేలా.. ఇలా పలువురు తారలు పాల్గొంటున్న విషయం తెలిసిందే.

కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తో కలిసి నటులు నవాజుద్దిన్, మాధవన్, దర్శకుడు– నటుడు  శేఖర్‌ కపూర్, సంగీతదర్శకుడు రిక్కీ కేజ్, సీబీఎఫ్‌సి (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌) చైర్‌ పర్సన్‌ ప్రసూన్‌ జోషి, సీబీఎఫ్‌సి సభ్యురాలు వాణీ త్రిపాఠి తదితరులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

ఇక గతంలో తాను ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఉత్పత్తులను ప్రమోట్‌ చేయడానికి కాన్స్‌ చిత్రోత్సవాల్లో పాల్గొన్నారు దీపికా పదుకోన్‌. ఈసారి చిత్రోత్సవాల్లో ఆమె జ్యూరీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.


రిక్కీ కేజ్, వాణీ త్రిపాఠి, మాధవన్, ప్రసూన్‌ జోషి, అనురాగ్‌ ఠాగూర్, నవాజుద్దిన్‌ సిద్ధిఖి, శేఖర్‌ కపూర్‌ 

ఫ్రెంచ్‌ నటుడు విన్సెంట్‌ లిండన్‌ అధ్యక్షతన దీపికాతో పాటు ఎనిమిది మంది నటీనటులు, దర్శకులు ఈ జ్యూరీలో ఉంటారు. తొలి రోజు వేడుకల్లో పువ్వుల చొక్కా, లేత ఆకుపచ్చు రంగు ప్యాంటులో అప్పుడే విరిసిన మల్లెపువ్వులా అగుపించారు దీపికా పదుకోన్‌. వజ్రాలు పొదిగిన లక్నో రోజ్‌ డైమండ్‌ నెక్లెస్, చిన్ని చెవి దుద్దులతో చిరునవ్వులు చిందిస్తూ తళుకులీనారు. చిత్రోత్సవాల్లో భాగంగా జ్యూరీతో కలిసి మీడియా ముందుకు వచ్చారు. మోడ్రన్‌ డ్రెస్, చీరలో మార్కులు కొట్టేశారు. ఈ నెల 28 వరకూ ఈ చిత్రోత్సవాలు జరుగుతాయి. 

మరిన్ని వార్తలు