Captain Review: వింత జీవులతో సైనికుల పోరాటం.. ‘కెప్టెన్‌’ ఎలా ఉందంటే?

8 Sep, 2022 14:42 IST|Sakshi
Rating:  

టైటిల్‌ : కెప్టెన్‌
నటీనటులు : ఆర్య, ఐశ్యర్య లక్ష్మీ, సిమ్రాన్‌, హరీశ్‌ ఉత్తమన్‌, కావ్యశెట్టి తదితరులు
నిర్మాణ సంస్థ: ది షో పీపుల్, థింక్ స్టూడియోస్, ఎస్ఎన్ఎస్ ప్రొడ‌క్ష‌న్స్‌ 
తెలుగులో విడుదల: శ్రేష్ఠ్ మూవీస్
దర్శకత్వం: శక్తి సౌందర్‌ రాజన్  
సంగీతం : డి ఇమాన్ 
సినిమాటోగ్రఫీ: ఎస్ యువ
విడుదల తేది: సెప్టెంబర్‌8,2022

కథేంటంటే..
భారత్‌లోని ఈశాన్య అటవీ ప్రాంంతంలో, సెక్టార్‌ 42కి చెందిన అటవీ ప్రాంతంలో కొన్నేళ్లుగా పౌర, సైనిక కార్యకలాపాలు లేవు. ఆ ప్రదేశానికి వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి రావడం లేదు. వారికి వారే షూట్‌ చేసుకొని చనిపోతున్నారు. దీంతో ఈ మిస్టరీని తెలుసుకోవడానికి భారత ఆర్మీకి చెందిన కెప్టెన్‌ విజయ్‌ కుమార్‌(ఆర్య) బ్యాచ్‌ని రంగంతోకి దించుతుంది. కెప్టెన్‌ విజయ్‌కి ఏ ఆపరేషన్‌ అయినా విజయవంతంగా పూర్తి చేస్తాడనే పేరుంది. తన టీమ్‌తో కలిసి స్పెషల్‌ ఆపరేషన్స్‌ చేపడుతుంటాడు. అందుకే ఈ డేంజరస్‌ ఆపరేషన్‌ని కెప్టెన్‌ విజయ్‌కి అప్పగిస్తుంది ప్రభుత్వం. విజయ్‌ తన బృందంతో కలిసి సెక్టార్‌ 42 ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ మినటార్స్‌(వింత జీవులు) ఉన్నాయని, వాటివల్లే అక్కడికి వెళ్లిన వాళ్లు ప్రాణాలతో తిగిరి రావడంలేదని విజయ్‌ గుర్తిస్తాడు. మరి విజయ్‌ తన ప్రాణాలను పణంగా పెట్టి వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అసలు  ఆ వింత జీవులు ఏంటి? సైనికులు తమకు తాము షూట్ చేసుకునేలా మినటార్స్‌ ఏం చేస్తున్నాయి? సైంటిస్ట్ కీర్తి(సిమ్రాన్‌) చేసే పరిశోధన ఏంటి? చివరకు కెప్టెన్‌ విజయ్‌ మినటార్స్‌ని అంతం చేశాడా? లేదా? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే.. 
‘​కెప్టెన్‌’ ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచి సినిమాపై అసక్తి పెరిగింది. వింత జీవులతో ఇండియన్‌ ఆర్మీ ఫైట్‌ చేయడం అనే కొత్త పాయింట్‌తో సినిమా తెరకెక్కడంతో అందరికి దృష్టి ‘కెప్టెన్‌’పై పడింది. అయితే కాన్సెప్ట్‌ కొత్తగా ఉన్నా.. దానికి తగ్గ కథ, కథనం లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్‌. దర్శకుడు శక్తి సౌందర్‌ రాజన్‌ హాలీవుడ్‌ చిత్రాలను చూసి కథను రాసుకున్నట్లు తెలుస్తోంది.

మ్యాన్‌ వర్సస్‌ క్రియేచర్‌ జానర్‌లో ఈ సినిమా సాగుతుంది. అందులో అయినా ఏదైనా కొత్తదనం ఉందా అంటే అదీ లేదు. సెక్టార్‌ 42లో వింత జీవులు ఉంటాయి వాటితో కెప్టెన్‌ విజయ్‌ యుద్దం చేయాలి అనేది ఫస్టాఫ్‌ పాయింట్‌ అయితే.. ఎలా చేశాడనేది సెకండాఫ్‌. దీనికి కథను అల్లడానికి ఫస్టాఫ్‌లో అసవరమైన సీన్స్‌ అన్ని బలవంతంగా చొప్పించాడు దర్శకుడు. ఆ సీన్స్‌ కూడా ఆకట్టుకున్నట్లు ఉంటుందా అంటే అదీ లేదు.

ఇక సినిమాలో లాజిక్‌ లేని సన్నివేశాలు  చాలా ఉంటాయి. సెక్టార్‌ 42కి వెళ్లిన సైనికులు మరణిస్తారని చూపించిన దర్శకుడు.. వారిని తీసుకురావడానికి వెళ్లిన సైనికులకు ఏమి కాలేదన్నట్టు సన్నివేశాలు రూపొందించడం.. గన్‌తో షూట్‌ చేసే మినటార్స్‌ మరణించడం లేదని తెలిసినా.. మళ్లీ మళ్లీ సైనికులు గన్స్‌ పట్టుకొనే ఆ ప్రదేశానికి వెళ్లడం.. సైంటిస్ట్‌ కీర్తికి కెప్టెన్‌ జవాన్‌ సైన్స్‌ గురించి చెప్పడం.. ఆమె ఆశ్యర్యంగా చూడడం..ఇలా చాలా సన్నివేశాల్లో లాజిక్‌ మిస్సవుతుంది. అదే సమయంలో హీరో మాత్రం ఎందుకు స్పృహ కోల్పోవడం లేదనడానికి మాత్రం సరైన కారణం చెప్పాడు. వీఎఫ్ఎక్స్‌ అంతగా ఆకట్టుకోలేదు. కథకు కీలకమైన క్రీచర్‌ని కూడా సరిగా చూపించలేకపోయారు. మినటార్స్‌తో వచ్చే ఫైట్‌ సీన్స్‌ కూడా అంతగా ఆకట్టుకోలేకపోతాయి. హాలీవుడ్ లో ఈ త‌ర‌హా సినిమాలు చాలానే వచ్చాయి. ఆ చిత్రాలను చూడని ప్రేక్షకులకు ‘కెప్టెన్‌’ కాస్త కొత్తగా కనిపిస్తాడు. 

ఎవరెలా చేశారంటే..
కెప్టెన్‌ విజయ్‌ కుమార్‌ పాత్రకు ఆర్య న్యాయం చేశాడు. ఉన్నంతలో యాక్షన్స్‌ సీన్స్‌ని కూడా అదరగొట్టేశాడు. అతని టీమ్‌లోని సభ్యులు కూడా చక్కటి నటనను కనబరిచారు. ఐశ్వ‌ర్య లక్ష్మి  రెండు సీన్స్‌, ఓ పాటలో కనిపిస్తుంది అంతే. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. సైంటిస్ట్‌ కీర్తిగా సిమ్రాన్‌ పర్వాలేదనిపించింది. అయితే ఆమె పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దాల్సింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక టెక్నికల్‌ విషయానికొస్తే.. ఎస్‌ యువ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇమాన్‌ నేపథ్య సంగీతం ఆట్టుకునేలా ఉంటుంది. విజువ‌ల్ ఎఫెక్ట్స్ అంతగా ఆకట్టుకోలేకపోతాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. 

Rating:  
(2/5)
మరిన్ని వార్తలు