Ananta Sriram: హిందూ మనోభావాలను దెబ్బతీసేలా..

8 Aug, 2021 11:46 IST|Sakshi

Complaint Against Ananta Sriram: ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎన్నో సూపర్‌ హిట్‌ పాటలకు ఆయన లిరిక్స్‌ అందించారు. అయితే తాజాగా ఆయన రాసిన ఓ పాట వివాదాస్పదం అవుతుంది. దేవుడిని కించపరిచేలా పాటను రచించారంటూ అనంత శ్రీరామ్‌పై  బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..నాగశౌర్య, రీతూ వర్మలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం వరుడు కావలెను.

ఈ సినిమాలోని ‘దిగు దిగు నాగ’ అనే పాట ఇటీవలె విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాట హిందువు మనోభావాలను దెబ్బతీసేలా ఉందని  బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు బిందూ రెడ్డి ఆరోపిస్తున్నారు. నాగ దేవతను కించపరిచేలా రచించిన అనంత శ్రీరామ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ మేరకు అనంత్ శ్రీరామ్‌తో పాటు చిత్ర యూనిట్‌పై చర్యలు తీసుకోవాలని నెల్లూరులోని చిల్లకూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు అనంత శ్రీరామ్‌పై బ్రాహ్మణ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒరిజినల్ పాటలో ఉన్న అద్భుతమైన భావాన్ని పాడు చేశారని, డబ్బు కోసం దేవతలను కించపరుస్తున్నారని మండిపడ్డారు. వెంటనే చిత్రం నుంచి ఈ పాటను తొలగించాలని డిమాండ్‌ చేశారు. కాగా ఈ సినిమాను లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహించగా, సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. థమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 

మరిన్ని వార్తలు