CCL 2023: సీసీఎల్‌ మళ్లీ వచ్చేస్తుంది.. హీరోలు స్టేడియంలో బ్యాట్ పట్టుకుంటే..

16 Feb, 2023 10:28 IST|Sakshi

తమిళసినిమా: క్రికెట్‌ పోటీలు అంటేనే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది. ఇక సినీ కళాకారుల క్రికెట్‌ అంటే ప్రత్యేకంగా చెప్పాలా? సందడే సందడి. హీరోలు స్డేడియంలో బ్యాట్‌ పట్టి సిక్స్‌ కొడితే.. ఫ్యాన్స్‌కు పునకాలే వస్తాయి. ఇటీవల కరోనా కారణంగా సీసీఎల్‌ (సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌) జరగలేదు. ఈ నెల 18వ తేదీ నుంచి సీసీఎల్‌ పోటీల సందడి మొదలవుతోంది. ఇందులో 8 రాష్ట్రాలకు చెందిన సినీ సెలబ్రిటీ జట్లు తలపడనున్నాయి. చెన్నై రైనోస్, ముంబై హీరోస్, తెలుగు వారియర్స్, కర్ణాటక బుల్డోజర్స్, బెంగాల్‌ టైగర్స్, కేరళా స్ట్రైకర్స్, పంజాబ్‌ ది షేర్, బోజ్‌పురి దబాంగ్స్‌  పోటీ పడుతున్నాయి.

కాగా ముంబాయి హీరోస్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సల్మాన్‌ఖాన్, కెప్టెన్‌గా రితేశ్‌ దేశ్‌ముఖ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చెన్నై రైనోస్‌ జట్టుకు కెప్టెన్‌ జీవా ఐకాన్‌ ప్లేయర్‌గానూ, విష్టు విశాల్‌ స్టార్‌ క్రీడాకారుడిగా ఉన్నారు. తెలుగు వారియర్స్‌ జట్టుకు నటుడు వెంకటేశ్‌ సహ నిర్వాహకుడిగానూ, అఖిల్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. బోజ్‌పురి దబాంగ్‌ జట్టుకు మనోజ్‌ తివారి కెప్టెన్‌గా, కేరళా స్ట్రైకర్స్‌ జట్టుకు నటుడు మోహన్‌లాల్‌ సహ నిర్వాహకుడిగా కుంజాకోబోపన్‌ కెప్టెన్‌గా ఉన్నారు.

బెంగాల్‌ టైగర్స్‌ జట్టుకు బోనీకపూర్‌ సహ నిర్వాహకుడిగా, జిసుసేన్‌ గప్లా కెప్టెన్‌గా ఉండనున్నారు. కర్ణాటక బుల్డోజర్స్‌ జట్టుకు సుదీప్, పంజాబ్‌ ది ఫేర్‌ జట్టుకు సోనూసూద్‌ కెపె్టన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా ఈ నెల 18వ తేదీ నుంచి రాయ్‌పూర్, జైపూర్, బెంగళూర్, త్రివేండ్రం, జోద్‌పూర్, హైదరాబాద్‌లలో ఈ పోటీలు జరగనున్నాయి. అదే విధంగా మార్చి 19వ తేదీ ఫైనల్‌ పోరు జరుగుతుంది. ఈ పోటీలు జీటీవీలో లైవ్‌ ప్రసారం అవుతాయని నిర్వాహకులు బుధవారం ఉదయం చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ పోటీల కోసం గట్టిగా ప్రాక్టీస్‌ చేస్తున్నట్లు చెన్నై రైనోస్‌ జట్టు కెప్టెన్‌ జీవా తెలిపారు.

మరిన్ని వార్తలు