మూగబోయిన ‘ఆనంద’ గానం 

8 May, 2021 08:13 IST|Sakshi

చెన్నై : ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు జి.ఆనంద్‌ మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ముఖ్యంగా చెన్నైలోని సంగీత కళాకారులు, సంగీత అభిమానులు జీర్ణించుకోలేని బాధాకరమైన సంఘటన. జి.ఆనంద్‌ గానం అమృతం. మనసు సున్నితం. సౌమ్యం, నిడారంబరమే ఆయనకు ఆభరణాలు. ఆయన మృతిపై చెన్నైలోని తెలుగు ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. 

ఆనంద్‌ మరణవార్త చాలా బాధాకరం. కొన్ని సభల్లో అతిథులుగా పాల్గొన్న పరిచయం. స్వర మాధురి పేరుతో సంస్థని స్థాపించి 7,500  సంగీత కార్యక్రమాలు నిర్వహించిన రికార్డు సృష్టించిన గాయకుడు ఆయన. 20 సార్లు అమెరికాలోని తానా సభల్లో పాల్గొన్నారు. కచేరీల్లో ఘంటసాల గారి పాటలు పాడుతూ ఉన్నత స్థితికి చేరుకున్నానని గర్వంగా చెప్పుకున్న మంచి మనిషి జి.ఆనంద్‌. విశాల హృదయం గల మహా మనిషి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.  
–గుడిమెట్ల చెన్నయ్య, జనని కార్యదర్శి, చెన్నై 

ఎందరో యువ కళాకారులను ప్రోత్సహించారు 
గాయకుడు, సంగీత దర్శకుడు, స్వరమాధురి వ్యవస్థాపకుడు జి.ఆనంద్‌ ఆకస్మిక మృతికి అఖిల భారత తెలుగు సమాఖ్య ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది. 2014లో నెహ్రూ స్టేడియంలో జరిగిన ముప్పెరుం మహాసభలో జి.ఆనంద్‌ మాకు మంచి సంగీతాన్ని సమకూర్చారు. మితభాషి, స్నేహశీలి, ఎందరో కళాకారులను ప్రోత్సహించిన జి.ఆనంద్‌ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాం. 


–సీఎంకే రెడ్డి, అఖిల భారత తెలుగు సమాఖ్య 

ఉదారస్వభావుడు 
మనందరికీ ఆయన దూరం కావడం చాలా బాధాకరం. ఆంధ్ర కల్చరల్‌ అండ్‌ సోషల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాటలకు ఆనంద్, నాట్యానికి నేను చాలా ఏళ్లుగా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించాం. ఆ సమయంలో ఆయన ఉదార స్వభావం, సౌశీల్యం, గాత్రాన్ని చాలా దగ్గరగా చూసే అవకాశం కలిగినందుకు సంతోషిస్తున్నాను, ఆనంద్‌ శారీరకంగా మన మధ్య లేకున్నా ఆయన గాత్రం ఎల్లప్పుడూ మన మధ్యే ఉంటుంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. 
–ఏవీ శివకుమార్, చెన్నై  

మరిన్ని వార్తలు