Jamuna: లెక్చరర్‌ను పెళ్లాడిన జమున

28 Jan, 2023 05:28 IST|Sakshi

తెలుగువారి సత్యభామగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన జమున (86) ఇకలేరు. వయోభారం, అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని  తన స్వగృహంలో శుక్రవారం ఉదయం 7.30 ని‘‘లకు తుదిశ్వాస విడిచారామె. అమెరికాలో ఉంటున్న కుమారుడు వంశీకృష్ణ  హైదరాబాద్‌ చేరడానికి ఆలస్యం కావడంతో కుమార్తె స్రవంతి తల్లికి అంత్యక్రియలు నిర్వహించారు.

నిప్పాణి శ్రీనివాసరావు, కౌసల్యాదేవి దంపతులకు 1936 ఆగస్ట్‌ 30న హంపిలో జన్మించారు జమున. తండ్రికి గుంటూరులో పొగాకు, పసుపు వ్యాపారాలుండేవి. శ్రీనివాసరావు వ్యాపార రీత్యా జమున బాల్యమంతా గుంటూరు జిల్లాలోని దుగ్గిరాలలో గడిచింది. చక్కని సంగీత విద్వాంసురాలు అయిన కౌసల్యాదేవి జమునకి శాస్త్రీయ సంగీతం, హార్మోనియంలలో శిక్షణ ఇప్పించారు. దుగ్గిరాల గ్రామస్తులు వేసిన ‘ఛలో ఢిల్లీ’ నాటకంలో తొలిసారి వసుంధర అనే పాత్ర వేశారు జమున. ఆ తర్వాత ‘మా భూమి, ఖిల్జీ రాజ్యపతనం..’ ఇలా పలు నాటకాలు వేశారు జమున.

దుగ్గిరాలకు చెందిన శ్రీమన్నారాయణమూర్తి అనే నటుడు జమున గురించి నిర్మాత బీవీ రామానందంకు (‘వరూధిని’ సినిమా తీశారు) చెప్పారు. దీంతో ఆయన నిర్మిస్తున్న తర్వాతి చిత్రం ‘జై వీర భేతాళ’(1952 మార్చిలో స్టార్ట్‌ అయింది) అనే సినిమాలో హీరోయిన్‌గా జమునకు అవకాశం ఇచ్చారు. ఈ చిత్రంలో గుమ్మడి హీరోగా ఎంపికయ్యారు. అయితే ఆ సినిమా ఎందుకో ఆగిపోయింది. ఆ తర్వాత గరికపాటి రాజారావు దర్శకత్వం వహించిన ‘పుట్టిల్లు’ (1953) సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమయ్యారు జమున. ఆ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, జగ్గయ్య వంటి అగ్రహీరోల సరసన కథానాయికగా నటించారు.

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు పలు హిందీ సినిమాల్లో నటించి భేష్‌ అనిపించుకున్నారామె. దాదాపు 200 సినిమాల్లో ఎన్నో పాత్రల్లో జమున నటించినా బాగా పేరు తెచ్చినవాటిలో సత్యభామ పాత్రని ప్రముఖంగా చెప్పుకోవాలి. ఆ పాత్రలో ఆమెను తప్ప ఎవర్నీ ఊహించుకోలేం అన్నట్టుగా జీవించారు జమున. ‘సంతోషం, మిస్సమ్మ, చిరంజీవులు, తెనాలి రామకృష్ణుడు, దొంగరాముడు, బంగారు పాప, వద్దంటే డబ్బు, చింతామణి, భూకైలాస్, భాగ్యరేఖ, గుండమ్మకథ’ వంటి పలు హిట్‌ చిత్రాల్లో నటించారు జమున. ‘తెలుగు ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ అనే సంస్థ నెలకొల్పి 25 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారామె.

లెక్చరర్‌తో పెళ్లి...
హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీలోని వారిని కాకుండా ఇతర రంగంలోని వారిని వివాహం చేసుకోవడం నటి పద్మినీతో ఆరంభమైంది. అలా వివాహం చేసుకున్న రెండో హీరోయిన్‌ జమున. దూరపు బంధువైన రమణారావుతో 1965లో జమున వివాహం తిరుపతిలో జరిగింది. రమణారావు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తూ, జువాలజీ లెక్చరర్‌గా చేసేవారు. డాక్టరేట్‌ అందుకున్న తర్వాత ఉస్మానియా విశ్వ విద్యాలయానికి బదిలీ అయ్యారాయన.. దీంతో కాపురాన్ని హైదరాబాద్‌కి మార్చారు. జమున కూడా మద్రాసు (చెన్నై) నుంచి హైదరాబాద్‌కి వచ్చేశారు. 1976లో బంజారాహిల్స్‌లో సొంత ఇల్లు కట్టుకుని స్థిరపడ్డారామె. రమణారావు–జమునలకు వంశీకృష్ణ, స్రవంతి సంతానం. తొలి సంతానం వంశీకృష్ణ పుట్టిన తర్వాత కూడా పదేళ్లపాటు హీరోయిన్‌గా బిజీగానే కొనసాగారు జమున.

వంశీకృష్ణ శాన్‌ఫ్రాన్సిస్కో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. బర్కిలీలోని స్టెయిన్డ్‌ గ్లాస్‌ గార్డెన్‌లో గ్లాస్‌ పెయింటింగ్‌లో శిక్షణ పొంది, అదే రంగంలో స్రవంతి స్థిరపడ్డారు. స్రవంతిని హీరోయిన్‌ చేయాలనుకున్నారు జమున. అయితే ఇండస్ట్రీలో వచ్చిన మార్పులతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారామె. కాగా ఓ నవల ఆధారంగా సినిమా తీయాలని, దానికి తనే దర్శకత్వం వహించాలని సంకల్పించారు జమున. నాలుగు పాటలు రికార్డు చేసిన తర్వాత ఈ సినిమా ఆగిపోయింది. అయితే దర్శకత్వంపై తనకున్న మమకారంతో ‘డాక్టర్‌ మమత’ అనే సీరియల్‌ని తెరకెక్కించారామె. దూరదర్శన్‌లో 15 ఎపిసోడ్స్‌గా ఆ సీరియల్‌ ప్రసారం అయింది కూడా!

రాజకీయ రంగంలో...
1980లలో నాటి ప్రధాని రాజీవ్‌ గాంధీ ప్రోత్సాహంతో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు జమున. పార్టీ కార్యవర్గ సభ్యురాలిగా ఎన్నికై 1983లో ఆ పార్టీ తరఫున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారం చేశారామె. తర్వాత రాజీవ్‌ గాంధీ సపోర్ట్‌తో 1989లో రాజమండ్రి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు జమున. ఆ తర్వాత వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా కొన్నాళ్లు చేసిన ఆమె ఆ తర్వాత కాంగ్రెస్‌ నుంచి బయటికొచ్చేశారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి వ్యవహార శైలి నచ్చి భారతీయ జనతా పార్టీలో చేరారు.. 1990వ దశకంలో ఆ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. ఆ తర్వాత ‘రంగస్థల వృత్తి కళాకారుల సమాఖ్య’ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రంలో పర్యటించి, పదివేల మంది కళాకారుల వివరాలు సేకరించారామె. అంతేకాదు.. ‘రంగస్థల వృత్తి కళాకారుల సమాఖ్య’కు 26 శాఖలు ఏర్పాటు చేశారు. నిరుపేద కళాకారులకు ఇళ్ల స్థలాలు, గృహ రుణాలు, పెన్షన్లు మంజూరు చేయించి పెద్ద మనసు చాటుకున్నారు జమున.

అవార్డులు...
1964లో విడుదలైన ‘మూగమనసులు’ (తెలుగు), 1968లో రిలీజైన ‘మిలన్‌’ (హిందీ) చిత్రాలకు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు, 2008లో ‘ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారం’ అందుకున్నారామె. అలాగే 2021 సంవత్సరానికిగాను ‘సాక్షి’ మీడియా గ్రూప్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డుల్లో భాగంగా ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందుకున్నారు జమున. దాదాపు ఏడు దశాబ్దాల కెరీర్‌లో అద్వితీయమైన పాత్రలు చేసిన జమునకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే‘పద్మ’ పురస్కారం వరించలేదు. అయినా అవార్డులకు అతీతంగా ‘సత్యభామ’గా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసిన ఈ అద్భుత నటి చరిత్ర ఎప్పటికీ నిలిచిపోతుంది.

కూతురే కుమారుడై...
2014 నవంబరు 10న జమున భర్త రమణారావు గుండెపోటుతో మృతి చెందారు. అప్పటినుంచి కుమార్తె స్రవంతి దగ్గరే ఉంటున్నారు జమున. తల్లికి అన్నీ తానయ్యారు స్రవంతి. శుక్రవారం ఉదయం జమున మరణించగా, మధ్యాహ్నం ఆమె పార్థివ∙దేహాన్ని ఫిలిం చాంబర్‌లో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ఆ సాయంత్రం 4.30 గంటలకు ఫిలిం చాంబర్‌ నుంచి జమున అంతిమ యాత్ర మహాప్రస్థానానికి చేరింది. అమెరికాలో ఉంటున్న కుమారుడు వంశీకృష్ణ నేడు (శనివారం) హైదరాబాద్‌ చేరుకుంటారు. దాంతో అన్నీ తానై అశ్రునయనాల మధ్య తల్లికి స్రవంతి అంత్యక్రియలు నిర్వహించారు. సినీ ప్రముఖులు, కుటుంబసభ్యులు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి ఆర్‌కే రోజాతోపాటు పలువురు పాల్గొని అశ్రునివాళులు అర్పించారు.

గాయం చేసిన లేత మనసులు...
‘లేత మనసులు’ సినిమా తమిళ వెర్షన్‌ చేస్తుండగా జరిగిన ఓ ప్రమాదం వల్ల జమున మెడ బాగా దెబ్బతింది. ‘అందాల ఓ చిలుకా..’ పాట తమిళంలో తీస్తున్నారు. హీరో గడ్డిమేట మీద నుంచి జారుకుంటూ వచ్చి జమున పక్కన చేరాలి. అయితే కొత్తవాడైన ఆ చిత్ర హీరో జయశంకర్‌..  సీనియర్‌ హీరోయిన్‌ జమునతో చేస్తున్నాననే కంగారుతో అడ్డదిడ్డంగా వచ్చి జమున తలపై పడ్డారు.. దీంతో ఆమె మెడ విరిగినంత పనయింది. షూటింగ్‌ నిలిచిపోయింది. సున్నితమైన మెడ నరాలు దెబ్బతినడంతో కొన్నాళ్లు చికిత్స తర్వాత మళ్లీ షూటింగ్‌లో పాల్గొన్నారు జమున. అయితే కొన్నేళ్ల తర్వాత ఆ సమస్య మళ్లీ మొదటికొచ్చింది.. దీంతో ఆమె మెడ ఎక్కువగా ఊగిపోయేది.

‘రాజపుత్ర రహస్యం’ సినిమాలో ఈ ఇబ్బంది ఆమెలో బాగా కనిపించేది. ఎన్ని చికిత్సలు తీసుకున్నా తల ఊగడం తగ్గలేదు. 1978లో విడుదలైన ‘శ్రీరామ పట్టాభిషేకం’ తర్వాత సినిమాల నుంచి గౌరవంగా తప్పుకున్నారు జమున. ఆ తర్వాత ‘బంగారు కొడుకు’(1982), ‘జల్సా రాయుడు’(1983), ‘రాజకీయ చదరంగం’(1989) వంచి చిత్రాల్లో ముఖ్యమైన పాత్రలు చేశారు. కాగా ఆమె నటించిన చివరి చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’  2021 జనవరి 29న విడుదలైంది.

నటి జమునతో తన అనుబంధాన్ని ‘సాక్షి’తో నటి కాంచన ప్రత్యేకంగా పంచుకున్నారు.
నన్ను ఏడిపించేశావ్‌ కాంచీ అన్నారు    
– కాంచన

► వారానికి మూడు నాలుగు సార్లు జమున అక్క, నేను మాట్లాడుకునేవాళ్లం. అయితే ఈ నెల నాకు తీరిక లేకపోవడం, అక్క కూడా ఫోన్‌ చేయకపోవడంతో మాట్లాడుకోలేదు. మామూలుగా ఫోన్‌ చేసి, అప్పటి సినిమాల గురించి మాట్లాడుకుంటుంటాం. ‘భోజనం చేశావా.. వంట ఏంటి?’.. ఇవన్నీ కూడా చెప్పుకునేవాళ్లం.
► జమున అక్క నా సీనియర్‌. నేను కాలేజీ డేస్‌ నుంచే సీనియర్లతో జూనియర్లు మాట్లాడకూడదా అనుకునేదాన్ని. ఆ ఫీలింగ్‌తో సీనియర్లతో కూడా బాగా మాట్లాడేదాన్ని. సినిమాల్లోకి వచ్చాక కూడా అంతే. పైగా మేం చిన్నవాళ్లం అనే ఫీలింగ్‌ ఏమీ పెట్టుకోకుండా జమునక్క, సావిత్రక్క బాగా మాట్లాడేవారు.
► ఇక దసరా వచ్చిందంటే చాలు... బొమ్మల కొలువు సందడి ఉండేది. ఒకరింటికి ఒకరు వెళ్లడం.. సుండల్‌ (శెనగలు) తినడం... అంతా బాగుండేది. పైగా జమున అక్క భలే డ్రెస్‌ చేసుకునేవారు. ఆవిడకు బాగా రెడీ అవ్వడం అంటే ఇష్టం. నా డ్రెస్సింగ్‌ డిఫరెంట్‌గా ఉండేది. సింపుల్‌గా రెడీ అయ్యేదాన్ని. బాగున్నావని మెచ్చుకునేవారు.
► అట్లతద్దిని అయితే ఎప్పటికీ మరచిపోలేను. అప్పట్లో అందరం మదరాసు (చెన్నై)లో ఉండేవాళ్లం కదా. అట్లతద్ది నాడు ఒకళ్లు అట్లు వేసేవాళ్లం. ఇంకొకరు చట్నీ చేసేవాళ్లం. ఇంకొకరు పులుసు.. జమున అక్క, నేను అందరం మెరీనా బీచ్‌కి వెళ్లిపోయేవాళ్లం. అక్కడ ఉయ్యాల కుదరదు కదా. పరుగు పందేలు పెట్టుకుని, చాలా హ్యాపీగా గడిపేవాళ్లం.
► ఆ మధ్య ఒకసారి జమున అక్క ఫోన్‌ చేసి, ‘నన్ను ఇవాళ బాగా ఏడిపించేశావ్‌..’ అంటే, నాకేం అర్థం కాలేదు. ‘నేనేం ఏడిపించాను అక్కా...’ అంటే... నువ్వు యాక్ట్‌ చేసిన ‘కల్యాణ మంటపం’ సినిమా చూశాను. ‘ఎంత బ్రహ్మాండంగా యాక్ట్‌ చేశావ్‌. ఎమోషనల్‌ సీన్స్‌లో ఏడిపించావ్‌’ అంటే నాకు పట్టరానంత ఆనందం కలిగింది.
► జమునక్క యాక్ట్‌ చేసినవాటిలో నాకు ‘మూగ మనసులు’ చాలా ఇష్టం. ఇక ‘మిస్సమ్మ’లో ‘బృందావనమది అందరిదీ..’ పాటకి ఎంతో నాజూకుగా డ్యాన్స్‌ చేసింది. మనకు ఏమీ తెలియనప్పుడు టీచర్‌ చెప్పింది చెప్పినట్లు చేస్తాం... ఆ సినిమాలో డ్యాన్స్‌ నేర్చుకునే స్టూడెంట్‌గా టీచర్‌ చెప్పింది చెప్పినట్లు చేసే క్యారెక్టర్‌ని అక్క అద్భుతంగా చేసింది.
► మేం కలిసి నాటకాలు కూడా వేసేవాళ్లం. ముఖ్యంగా ‘శ్రీకృష్ణ తులాభారం’ నాటకం చాలాసార్లు వేశాం. అందరూ ఆడవాళ్లే నటించాలన్నది అక్క ఆశ. అలానే ఆడవాళ్లందరం కలిసి నటించాం. సినిమాలో కృష్ణుడిగా ఎన్టీఆర్‌ నటించారు. నాటకంలో ఆ పాత్ర నాది. సత్యభామగా జమున అక్క నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటిది కృష్ణుడిగా నా నటనను మెచ్చుకునేది.
► మేమంతా సత్య సాయిబాబా భక్తులం. జీవితం అనేది పోరాటం. ఈ పోరాటంలో గెలిచి నిలబడటం చాలా కష్టమైన విషయం. జమున అక్క నిలబడింది. ఈ గెలుపు కన్నా కూడా బతికున్నంతవరకూ పోరాటం చేసే మనిషి పోయేటప్పుడు ప్రశాంతంగా పోవడమనేది ముఖ్యం. ఆ ప్రశాంతత అక్కకు దక్కింది. ‘దేవుడా.. ఆస్పత్రిపాలు కాకుండా ప్రశాంతంగా తీసుకెళ్లు’ అని కోరుకుంటాం. ఆ సత్య సాయిబాబా ఆశీస్సులతో అక్క ఎలాంటి ఇబ్బంది పడకుండా వెళ్లిపోయింది. ఆ జీవుడు చివరి నిమిషంలో ఎలాంటి బాధ పడకుండా నిష్క్రమించింది. ప్రశాంతమైన మనిషికి ప్రశాంతమైన నిష్క్రమణ దక్కింది. ఇది కదా కావాల్సింది (గద్గద కంఠంతో..)

పేరు మారిందిలా...
జమున పేరు వెనక ఓ విశేషం ఉంది. ఆమె తల్లిదండ్రులు తీర్థయాత్రలు చేస్తూ, పండరీపురంలోని పాండురంగని దర్శనం చేసుకున్న తర్వాతే కౌసల్య కడుపులో పడ్డారట జమున. ఈ కారణం చేత ‘జనాబాయి’ అని పేరు పెట్టుకోవాలనుకున్నారు జమున తల్లిదండ్రులు. కానీ జన్మరాశి ప్రకారం ఏదైనా నది పేరు రావాలని పెద్దలు చెప్పడంతో ‘జ’కి ‘న’కు మధ్యలో ‘ము’ అక్షరాన్ని చేర్చి ‘జనాబాయి’ పేరును ‘జమున’గా మార్చారు. ఉత్తరాదిలో ‘యుమున’ నదిని ‘జమున’ అంటారు. ‘ఇంత నాజుకైన పేరు పెట్టి సినిమారంగం కోసం మళ్లీ పేరు మార్చుకునే అవసరం లేకుండా చేసిన మా అమ్మను నిజంగా అభినందించాల్సిందే’ అని పలు సందర్భాల్లో జమున గుర్తుచేసుకుని హ్యాపీ ఫీలయ్యేవారు.

సావిత్రితో ప్రత్యేక అనుబంధం
‘మిస్సమ్మ’, ‘దొంగరాముడు’, ‘అప్పుచేసి పప్పుకూడు’, ‘గుండమ్మకథ’ వంటి చిత్రాల్లో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న సావిత్రి, జమునల మధ్య మంచి అనుబంధం ఉంది. అక్కాచెల్లెళ్లుగా అన్ని విషయాలను అరమరికలు లేకుండా చర్చించుకునేవారు. అయితే కొందరు వ్యక్తులు కావాలని వీరిద్దరి మధ్యలో తగువులు పెట్టడంతో ఏడాది పాటు సావిత్రి, జమున మాట్లాడుకోలేదు. ఆ తర్వాత అసలు విషయం గ్రహించి మునుపటిలానే ఉండసాగారు. ఈ విషయాన్ని జమున ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు.. తన కొడుకు బారసాల వేడుకకు సావిత్రి వచ్చారని, ఆ సమయంలో ఆమె (సావిత్రి) జీవితం సజావుగా సాగనందుకు చాలా బాధపడి ఏడ్చారని, అప్పుడు తానే సావిత్రిని ఓదార్చినట్లుగా కూడా జమున ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అలాగే ఒకానొక స్థితిలో సావిత్రి పరిస్థితిని చూసి తనకు చాలా బాధకలిగిందని కూడా జమున పేర్కొన్నారు.

నటన–డైరెక్షన్‌–మ్యూజిక్‌: జమున!
చిన్నతనం నుంచే జమునకు కళల పట్ల మక్కువ ఎక్కువ. అందుకే తొమ్మిదేళ్లు వచ్చేలోపే నాటకాల్లో నటించారు. ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో తిరునగరి రామాంజనేయులు, బుర్రకథ పితామహుడు నాజర్‌ తదితరుల నాయకత్వంలో ‘మా భూమి’, ‘ముందడుగు’ ‘దిల్లీ’, ‘ఛలో’, ‘విందు’ వంటి నాటకాల్లో నటించారు జమున. ముఖ్యంగా ‘మా భూమి’ నాటికలోని జమున నటనకు మంచి మార్కులు పడ్డాయి. మరో విశేషం ఏంటంటే... ‘విందు’ అనే నాటికలో యశోదగా నటించడమే కాదు.. ఆ నాటికకు దర్శకత్వం వహించడంతో పాటు, మ్యూజిక్‌ను కూడా కంపోజ్‌ చేశారట జమున. ఇలా నటనలో ఎదగడానికి సరిపడా ఓనమాలు నేర్చుకున్నది నాటక రంగం నుంచేనని చెబుతారు జమున. ఆ తర్వాత ‘ఖిల్జీ రాజ్యపతనం’ నాటకంతో జమున పేరు మరింత ప్రాచుర్యంలోకి వచ్చి, తొలి సినిమా ‘పుట్టిల్లు’లో అవకాశం వచ్చేలా చేసింది.

ఎస్వీరంగారావు సలహా
సినిమా ఇండస్ట్రీలో బాగా రాణిస్తున్న సమయంలో ఓ హీరోను పెళ్లి చేసుకోవాలనుకున్నారట జమున. కానీ ఓ సందర్భంలో అప్పటి సీనియర్‌ నటులు ఎస్వీ రంగారావు జీవితం గురించి కొన్ని విషయాలు చెప్పి, అన్నీ ఆలోచించుకుని ముందడుగు వేయాలన్నట్లుగా హితబోధ చేశారట. దీంతో అప్పటి ఆ హీరోతో వివాహాన్ని వద్దనుకున్నారట జమున. ఆ తర్వాత రమణారావును పెళ్లి చేసుకున్నారు జమున.

తల్లి స్ఫూర్తితో...
ఇండస్ట్రీలో జమున చాలా ధైర్యంగా, ఆత్మాభిమానంతో ఉండేవారు. ఈ లక్షణాలతో పాటుగా ఆత్మవిశ్వాసం, వ్యక్తితాన్ని నిలబెట్టుకోవడం వంటి వాటిని తన తల్లి కౌసల్యాదేవి నుంచే అలవరచుకున్నారట జమున. విశేషం ఏంటంటే.. జమున తల్లి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని రెండు రోజులు జైల్లోనే ఉన్నారట.

ప్రముఖుల నివాళి
జమున మృతికి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్  విచారం వ్యక్తం చేశారు. 70ఏళ్ల నట జీవితంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన ఆమె చిరస్మరణీయంగా నిలిచిపోతారన్నారు. జమున కుటుంబ సభ్యులకు గవర్నర్‌ తన ప్రగాఢ సానుభూతి తెలిపారని రాజ్‌భవన్  వర్గాలు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ మొదటి తరం నటీమణుల్లో అగ్రనాయికగా వెలుగొందిన సీనియర్‌ నటి జమున తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్  రెడ్డి కొనియాడారు. ఆమె మృతి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టుగా ట్విట్టర్‌ ద్వారా సీఎం వైఎస్‌ జగన్  తన సంతాపాన్ని తెలియజేశారు.

నటి జమున మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్ , ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు. జమున మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని సీఎం కేసీఆర్‌ అన్నారు. తొలి తరం నటిగా వందలాది చిత్రాల్లో నటించి, తెలుగువారి అభిమాన తారగా వెలుగొందిన జమున జ్జాపకాలను సీఎం కేసీఆర్‌ స్మరించుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడంలోనే కాకుండా హిందీ సినిమాల్లోనూ నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన జమున, నటిగా కళా సేవనే కాకుండా పార్లమెంటు సభ్యురాలిగా ప్రజాసేవ చేయడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా జమున కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సీనియర్‌ హీరోయిన్‌ జమునగారు స్వర్గస్తులయ్యారనే వార్త విచారకరం. ఆవిడ బహుభాషా నటి. మాతృభాష కన్నడం అయినా ఎన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగువారి మనసుల్లో చెరగని ముద్రవేశారు. మహానటి సావిత్రిగారితో జమునగారి అనుబంధం ఎంతో గొప్పది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. 
– చిరంజీవి

అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నిటికీ మించి తెలుగువారి సత్యభామగా మనల్ని ఎంతో మెప్పించారు జమునగారు. చిన్ననాటి నుంచే నాటకాల అనుభవం ఉండటంతో నటనకే ఆభరణంగా మారారామె. కేవలం దక్షిణాది సినిమాలకే పరిమితం కాకుండా ఆ రోజుల్లోనే హిందీ సినిమాల్లోనూ నటించి ఔరా అనిపించి అందరి ప్రశంసలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి జమునగారు.           
– బాలకృష్ణ

జమునగారు మహానటి. ఆవిడతో కలిసి నేను ఆర్టిస్ట్‌గా పని చేశాను. ఆ మహానటి మరణం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. నాకు సన్నిహితురాలు. మేం కలిసినప్పుడు ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా మాట్లాడేవారు. ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.
– మంచు మోహన్‌బాబు

భారతీయ సినీ పరిశ్రమకు జమునగారి మరణం తీరని లోటు. సినిమా ఇండస్ట్రీలో ఆమె ఒక మహానటి. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీగణేశన్‌.. వంటి ఎంతోమంది మహానటులతో నటించి మెప్పించారామె. అన్ని భాషల్లో ఆమె ఒక సూపర్‌ స్టార్‌. కళాకారులకు పెన్షన్‌ ఇవ్వాలని పోరాడారు. జమునగారికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డు ప్రకటించాలని కోరుతున్నాను.
– ఆర్‌. నారాయణమూర్తి

జమునగారు దివంగతులు కావడం బాధాకరం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అలనాటి తరానికి ప్రతినిధిగా ఉన్నారామె. వెండితెరపై విభిన్న పాత్రలు పోషించిన జమునగారు తెలుగు ప్రేక్షకులకు సత్యభామగానే గుర్తుండిపోయారు. ఆ పౌరాణిక పాత్రకు జీవం పోశారామె. ఠీవి, గడుసు పాత్రల్లోనే కాకుండా అమాయకత్వం ఉట్టిపడే పాత్రల్లోనూ ప్రేక్షకుల మెప్పు పొందారు. ప్రజా జీవితంలో లోక్‌సభ సభ్యురాలిగా సేవలందించారు.
– పవన్‌ కల్యాణ్‌

జమునగారి మరణవార్త విని తీవ్రంగా కలత చెందాను. సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలు, పోషించిన వైవిధ్యమైన పాత్రలతో ఎప్పటికీ గుర్తుండిపోతారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
– మహేశ్‌బాబు

దాదాపు 30 సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహారాణిగా కొనసాగారు జమునగారు. ‘గుండమ్మకథ’, ‘మిస్సమ్మ’లాంటి ఎన్నో మరపురాని చిత్రాలు, మరెన్నో వైవిధ్యమైన పాత్రలతో మా మనసుల్లో చెరపలేని ముద్ర వేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. 
– ఎన్టీఆర్‌

జమునగారి మరణవార్త విని నా హృదయం ముక్కలైంది. క్లాసికల్‌ తెలుగు సినిమాకు ఆమె సేవలు మరువలేనివి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను.  
– అల్లు అర్జున్‌

జమునగారు లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నాను. కొంతకాలంగా ఆమె క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ‘మూగమనసులు’ సినిమాలో ఆమె నటన అద్భుతం. సినిమాలతోపాటుగా రాజకీయాల్లోనూ ముందున్నారామె. జమునగారి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగి ఉంటే బాగుండేది.                   
– అలీ
 

మరిన్ని వార్తలు