ఓ బిడ్డ ఐసీయూలో.. మరో బిడ్డకు అంత్యక్రియలు: నటి

19 Nov, 2020 14:54 IST|Sakshi

గత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న సెలీనా జైట్లీ

న్యూఢిల్లీ: పొత్తిళ్లలో పాపాయిని చూడగానే అప్పటివరకు పడ్డ పురిటినొప్పులను మరచిపోతుంది మాతృమూర్తి. తన ప్రతిరూపాన్ని చూసుకుని మురిసిపోతూ బిడ్డ భవిష్యత్తు గురించి ఎన్నెన్నో కలలు కంటుంది. అలాంటిది.. పసిప్రాయంలోనే బిడ్డ తన నుంచి దూరమై, శాశ్వతంగా లోకాన్ని విడిచి వెళ్లిపోయాడని తెలిస్తే ఆ బాధ వర్ణనాతీతం. సామాన్యులకైనా, సెలబ్రిటీలకైనా కడుపుకోత ఒకేలా ఉంటుంది. బాలీవుడ్‌ నటి సెలీనా జైట్లీ కూడా ఇలాంటి బాధను అనుభవించారు. నెలలు నిండకుండానే జన్మించిన తన తనయుడు షంషేర్‌ గుండె జబ్బుతో మరణించడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వరల్డ్‌ ప్రిమెచ్యూరిటీ‌ డే సందర్భంగా మంగళవారం తన మనోగతాన్ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు.(చదవండి: నా కుమారుడు అలా.. నాకిష్టం లేదు : సోనూ నిగమ్‌)

‘‘నెలలు నిండకుండానే ఏటా లక్షలాది మంది శిశువులు జన్మిస్తున్నారు. వారు ఎదుర్కొనే సమస్యల గురించి అవగాహన కల్పించేందుకు  నవంబరు 17,2011న వరల్డ్‌ ప్రిమెచ్యూరిటీ‌ డేను సృష్టించారు. ఇది చాలా తీవ్రమైన సమస్య. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీనిని అధిగమించవచ్చు. నియోనటల్‌ కేర్‌(నెలలు నిండకుండానే పుట్టిన చిన్నారులను ఉంచే ప్రత్యేక ఐసీయూ‌)లో శిశువులను ఉంచినప్పుడు తల్లిదండ్రులు గుండె ధైర్యంతో ఉండాలి. చనుబాలు పట్టించడం, వైద్యులపై నమ్మకం ఉంచితే అద్భుతాలు జరిగే అవకాశం ఉంటుంది. మా విషయంలో ఇది నిరూపితమైంది. ఓ బిడ్డ ఎన్‌ఐసీయూలో ఉండగా, మరో బిడ్డ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. 

ఆ గుండెకోత వర్ణించలేం. అయితే దుబాయ్‌ వైద్యుల నిర్విరామ కృషి వల్ల మా ఆర్థర్‌ హాగ్‌ మాతోపాటు ఇంటికి రాగలిగాడు. కొన్ని సమస్యలు ఎదురైనా ప్రస్తుతం తను బాగానే ఉన్నాడు. విన్‌స్టన్‌ చర్చిల్‌, అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ లాంటి ప్రముఖులతో పాటు మా ఆర్థర్‌ కూడా ప్రిమెచ్యూర్‌ బేబీనే. మా ఆర్థుకు మీ ఆశీర్వాదాలు, ప్రేమ కావాలి. తగిన జాగ్రత్తలు పాటిస్తే మీ ప్రిమెచ్యూర్‌ బేబీలు కూడా ఆర్థులాగే చలాకీగా మారిపోతారు’’ అని సెలీనా చెప్పుకొచ్చారు. కాగా మిస్‌ యూనివర్స్‌ పోటీల్లోనూ నాలుగో రన్నరప్‌గా నిలిచిన సెలీనా, మోడల్‌గా రాణిస్తున్న తరుణంలోనే 2003లో జనాషీన్‌ అనే థ్రిల్లర్‌(హిందీ)మూవీతో సిల్వర్‌ స్ర్రీన్‌పై ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించి 2011లో పీటర్‌ హాగ్‌ అనే విదేశీయుడిని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు 2012లో కవలలు(విన్‌స్టన్‌, విరాజ్‌), 2017లో కవలలు(షంషేర్‌, ఆర్థర్‌) జన్మించారు. షంషేర్‌ గుండెలోపంతో మృతి చెందగా.. ప్రస్తుతం వీరికి మొత్తం ముగ్గురు కుమారులు ఉన్నారు.

మరిన్ని వార్తలు