ఏక్తా కపూర్‌ నిర్మించిన వెబ్‌ సిరీస్‌ కారణంగానే..?

4 Aug, 2020 08:10 IST|Sakshi

‘డిఫెన్స్‌’ సినిమాలకు అనుమతి తప్పనిసరి 

వక్రీకరణల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం 

ఎన్‌ఓసీ తప్పనిసరంటూ సెన్సార్‌ బోర్డుకు లేఖ 

పోలీసుల్నీ కించపరుస్తూ అనేక చిత్రాల్లో పాత్రలు 

దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే 

సాక్షి, సిటీబ్యూరో: ఒక్కసారి కూడా పోలీసుల వద్దకు వెళ్లని వారికంటే కనీసం ఒక్కసారైనా వారి సహాయం పొందిన వారికే డిపార్ట్‌మెంట్‌పై సద్భావన ఉంటోంది. అయితే 70 శాతం సాధారణ ప్రజలు జీవితంలో ఒక్కసారి కూడా పోలీసులను ఆశ్రయించట్లేదు. – జాతీయ స్థాయిలో జరిగిన అనేక సర్వేలు వెల్లడించిన విషయమిది. 

ఈ సర్వేలకు తోడు టాలీవుడ్, బాలీవుడ్‌ సినిమాల్లో పోలీసు పాత్రల్ని చిత్రీకరిస్తున్న తీరు వారిపై మరింత ప్రతికూల భావన కలిగేందుకు కారణమవుతోంది. ఇప్పటి వరకు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ వంటి భద్రతాదళాల నేపథ్యంలో సాగే చిత్రాలు ఇష్టం వచ్చినట్లు నిర్మితమయ్యేవి. అందులో అధికారులు, సిబ్బంది తీరుతెన్నుల్ని అవగాహన రాహిత్యంతో చిత్రీకరించడం, పూర్తి నెగిటివ్‌ రోల్‌లో నడిపించడం జరిగే­వి. ఈ విధానాలకు చెక్‌ పెడుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏక్తా కపూర్‌ నిర్మించిన ఓ వివాదాస్పద వెబ్‌ సిరీస్‌ కారణంగానే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసు విభాగం విషయంలోనూ ఇలాంటి విధానపరమైన చర్యలు అవసరమని అధికారులు కోరుతున్నారు. 

ఇవీ కేంద్రం ఉత్తర్వులు... 
భద్రతా బలగాల నేపథ్యంలో వస్తున్న అనేక చిత్రాలు, వాటి వల్ల తలెత్తిన వివాదాలను కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిగణలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ వంటి బలగాలపై, ఆయా అధికారుల పాత్రల నేపథ్యంలో సాగే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, డాక్యుమెంటరీలు ఇష్టం వచ్చినట్లు తెరకెక్కించడానికి ఆస్కారం లేదు. వీటి నిర్మాణం పూర్తయిన తర్వాత కచ్చితంగా కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు ప్రదర్శించాల్సి ఉంటుంది. వాటిని వీక్షించి, అందులో ఉన్న అంశాలను పరిశీలించే ఈ విభాగం అభ్యంతరకమైన వాటిని తొలగించాలని స్పష్టం చేస్తుంది. అలాంటివి ఏమీ లేకపోతే చిత్రం విడుదలకు అనుమతిస్తూ నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఓసీ) జారీ చేస్తుంది. దీన్ని సమర్పిస్తేనే సెన్సార్‌ బోర్డు చిత్రం/వెబ్‌సిరీస్‌/డాక్యుమెంటరీ విడుదలకు అనుమతి ఇస్తుంది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ కేంద్ర సెన్సార్‌ బోర్డుకు లేఖ రాసింది.  

పోలీసుల పాత్రలు మరీ దారుణం... 
రాష్ట్రంలో విడుదలయ్యే తెలుగు/హిందీ చిత్రాల్లో దాదాపు ప్రతి దాంట్లోనూ పోలీసుల పాత్రలు ఉంటాయి. కానిస్టేబుల్‌ నుంచి డీఐజీ, డీజీపీ వరకు వివిధ హోదాల్లో ఈ పాత్రలు సాగుతూ ఉంటాయి. వీటిలో దాదాపు 90 శాతం నెగెటివ్‌ షేడ్స్‌లోనే నడుస్తుంటాయి. ఆయా పాత్రలతో లంచాలు, బెదిరింపులు, కబ్జాలు, హత్యలు సహా అనేక వ్యవహారాలు చేయిస్తూ ఈ క్యారెక్టర్లను తెరకెక్కిస్తూ ఉంటారు. వీటికి తోడు వారి డైలాగ్స్, వారిని ఉద్దేశించి ఎదుటి వారు చెప్పే మాటలు పోలీసులు అంటే నరరూప రాక్షసులన్న భావన కలిగిస్తూ సాగుతాయి. మరోపక్క పోలీసు యూనిఫామ్‌కు ఓ ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఒక్కో హోదాలో ఉండే అధికారి ఒక్కో తరహా స్టార్స్, బ్యాడ్జ్‌లు, టోపీలు ధరిస్తూ ఉంటాయి. సినిమాల్లోని పాత్రలు చెప్పే హోదా ఒకటి ఉంటే.. వారి యూనిఫాంపై కనిపించే స్టార్స్‌ తదితరాలు మరో హోదాకు సంబంధించినవి ఉంటాయి. అత్యంత క్రమశిక్షణ కలిగిన పోలీసు విభాగాన్ని ప్రతిబింబించే ఆయా నటీనటులు దీనికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంటారు. వీటిని వీక్షించే ప్రజలు పాటు కొన్ని సందర్భాల్లో కొందరు పోలీసులు చేసే తప్పుల్నీ అందరికీ ఆపాదిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పోలీసులపై ప్రతికూల అభిప్రాయం ఏర్పడటానికి కొంత వరకు దోహదపడుతున్నాయి. 

రాష్ట్రం ఏర్పడ్డాక మారిన పరిస్థితులు... 
రాష్ట్ర పోలీసు విభాగంలో ఇప్పుడు ఒకప్పటి పరిస్థితులు లేవు. ప్రధానంగా 2014 తర్వాత విప్లవాత్మకమైన మార్పు­లు చోటు చేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పోలీసు విభాగానికి కీలక ప్రాధాన్యం ఇచ్చింది. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ కాన్సెప్ట్‌తో ముందుకు వెళ్తున్న అధికారులు ప్రతి స్థాయిలోనూ సాంతికేతికత, జవాబుదారీతనం పెంచుతూ పోయారు. ప్రత్యేక యాప్‌లు, ప్రజల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకునే విధానాలను ప్రవేశపెట్టారు. అధికారులతో పాటు పోలీసుస్టేషన్లకూ ర్యాకింగ్స్‌ ఇస్తున్నారు. ఫలితంగా పోలీసుల ప్రవర్తన, బాధితుల్ని రిసీవ్‌ చేసుకునే విధానం సహా అనేక అంశాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. ప్రజల్లో పెరిగిన అవగాహన, చైతన్యం సైతం దీనికి ప్రధాన కారణంగా మారింది. ఆరోపణలు వచ్చిన వారిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ ‘సినిమా పోలీసు’ల్లో మాత్రం ఎలాంటి మార్పులు కనిపించట్లేదు. నానాటికీ ఈ పాత్రలు దిగజారుతున్నాయి. ఇది చాలదన్నట్లు కొన్ని సినిమాల్లో ఆయా పోలీసుస్టేషన్ల పేర్లు, వాహనాలపై కమిషనరేట్ల లోగోలు సైతం కనిపించేలా చిత్రీకరిస్తున్నారు.  ఇవన్నీ మారాలంటే రాష్ట్ర ప్రభుత్వం సైతం కేంద్రం మాదిరిగా ‘పోలీసు–సినిమా’లపై ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. 

ఉన్నతాధికారులకు నివేదిస్తాం
పోలీసు విభాగాన్ని కించ పరుస్తూ వచ్చిన చిత్రాలు, సినిమా పేర్లపై ఇప్పటికే సెన్సార్‌ బోర్డును ఆశ్రయిస్తున్నాం. ‘మెంటల్‌ పోలీస్‌’, ‘పోలీసోడు’ టైటిల్స్‌పై లిఖిత పూర్వకంగా అభ్యంతరం తెలిపాం. ‘గబ్బర్‌సింగ్‌’ చిత్రంలో యూనిఫాంను అవమానించడాన్నీ తప్పుపట్టాం. పోలీసు విభాగంలో తప్పులు చేసే వారి శాతం 5 కంటే తక్కువే ఉంటుంది. వారిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వాటిని దృష్టిలో పెట్టుకుని అహర్నిశలు శ్రమిస్తూ, అంకిత భావంతో పని చేసే 95 మందిని అవమానించడం సరికాదు. పోలీసు యూనిఫాంకు ఒక కోడ్‌ ఉంటుంది. అనేక సినిమాల్లో దీని ఉల్లంఘనలు జరుగుతున్నాయి. ఇప్పుడు డిఫెన్స్‌ మినిస్ట్రీ తీసుకున్న చర్యల్ని ఉన్నతాధికారులకు నివేదిస్తాం. పోలీసు విభాగానికి సంబంధించీ ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చేలా ప్రభుత్వాని కోరమని వారి దృష్టికి తీసుకువెళ్తాం. – గోపిరెడ్డి, అధ్యక్షుడు, రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా