Horror Movie: ఓటీటీలోకి వచ్చేసి భయపెడుతున్న హారర్‌, సైకో థ్రిల్లర్‌ మూవీస్‌.. స్ట్రీమింగ్‌ అక్కడే!

26 Oct, 2023 12:10 IST|Sakshi

చాలామందికి హారర్‌ సినిమాలంటే ఇష్టం. ఓపక్క భయపడుతూనే మరోపక్క కన్నార్పకుండా సినిమా చూస్తారు. అలాంటివారికోసమే తాజాగా ఓ హారర్‌ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. రజనీకాంత్‌ నటించిన సూపర్‌ హిట్‌ మూవీ చంద్రముఖికి సీక్వెల్‌గా వచ్చిందీ చిత్రం. చంద్రముఖి 2లో రాఘవ లారెన్స్‌ ప్రధాన పాత్రలో నటించగా కంగనా రనౌత్‌ హీరోయిన్‌గా నటించింది.

చంద్రముఖి సినిమాతో ట్రెండ్‌ సెట్‌ చేసిన పి.వాసు ఈ సీక్వెల్‌కు దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా జనాలను పెద్దగా ఆకట్టుకోలేదు. కథ రొటీన్‌గా ఉండటంతో ప్రేక్షకులు ముఖం చాటేశారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నేటి నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. చంద్రముఖి విషయానికి వస్తే.. 2005లో విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది.

తమిళనాట ఈ చిత్రం 175 రోజులపాటు నిరంతరాయంగా ఆడి రికార్డులు బ్రేక్‌ చేసింది. ఇందులోని లకలకలకలక.. అనే డైలాగ్‌ ఇప్పటికీ చాలామంది నోళ్లలో నానుతూనే ఉంటుంది. కానీ ఈ సినిమా అందుకున్న విజయంలో పావు వంతైనా సక్సెస్‌ అందుకోలేకపోయింది చంద్రముఖి 2.

అటు సైకో థ్రిల్లర్‌ ఇరైవన్‌ మూవీ సైతం నెట్‌ఫ్లిక్స్‌లోకి నేటి నుంచి అందుబాటులోకి వచ్చేసింది.  తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది. నయనతార, జయం రవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ తెలుగులో గాడ్‌ పేరిట విడుదలైంది.

చదవండి: రజనీకాంత్‌ ఇంట గ్రాండ్‌గా దసరా సెలబ్రేషన్స్‌.. గవర్నర్‌ సహా సెలబ్రిటీలు హాజరు

మరిన్ని వార్తలు