15 నిమిషాల కథ విని ఒప్పుకున్నా

19 Feb, 2021 03:12 IST|Sakshi
ఆనంద్‌ ప్రసాద్, ప్రియా ప్రకాశ్‌ వారియర్, నితిన్, చంద్రశేఖర్‌

– నితిన్‌

‘‘నా కెరీర్‌లో కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్‌ జానర్‌ సినిమాలు చాలా ఉన్నాయి. ‘చెక్‌’ లాంటి యునిక్‌ కథతో సినిమా చేయడం ఇదే మొదటి సారి. చంద్రశేఖర్‌ యేలేటిగారు చెప్పిన 15 నిమిషాల కథ విని సినిమా చేసేందుకు ఒప్పుకున్నా’’ అని హీరో నితిన్‌ అన్నారు. చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో నితిన్‌ హీరోగా నటించిన చిత్రం ‘చెక్‌’. రకుల్‌ ప్రీత్‌ సింగ్, ప్రియా ప్రకాశ్‌ వారియిర్‌ హీరోయిన్లు. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి.ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నితిన్‌ మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాలు వేరు.. ‘చెక్‌’ వేరు. ఈ సినిమా కోసం ఫిజికల్‌గా చాలా కష్టపడ్డా.

అవుట్‌పుట్‌ చూశాక మా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందనిపించింది. కల్యాణీ మాలిక్‌ నేపథ్య సంగీతం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తుంది’’ అన్నారు. చంద్రశేఖర్‌ యేలేటి మాట్లాడుతూ–‘‘చిన్న పొరపాటు వల్ల జీవితం తారుమారు అయిన ఓ యువకుడు తన తెలివితేటలతో జీవితాన్ని తన కంట్రోల్‌లోకి ఎలా తెచ్చుకున్నాడనేది ‘చెక్‌’ సినిమా కథ. ఇంతకుముందు నితిన్‌తో ఓ కథ అనుకుని సెకండాఫ్‌ వర్కవుట్‌ కాక వదిలేశాం. తను లేకపోతే ‘చెక్‌’ సినిమా లేదు’’ అన్నారు. ‘‘మా సంస్థను మరో స్థాయికి తీసుకెళ్లే సినిమా ‘చెక్‌’’ అన్నారు ఆనంద్‌ ప్రసాద్‌. ‘‘ఈ సినిమాలో నటించడం పద్మ అవార్డు అందుకున్నంత సంతోషంగానూ ఉంది’’ అన్నారు నటుడు సాయిచంద్‌. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కల్యాణీ మాలిక్, ప్రియా ప్రకాశ్‌ వారియర్, అన్నే రవి తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు