Suriya Jai Bhim Movie: జై భీమ్‌ వివాదం.. సూర్యపై హైకోర్టు కీలక ఆదేశం

19 Jul, 2022 08:26 IST|Sakshi

సూర్యపై ఎలాంటి కఠిన చర్యలు చేపట్టరాదని చెన్నై హైకోర్టు సోమవారం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. వివరాలు.. నటుడు సూర్య కథానాయకుడు నటించిన చిత్రం జై భీమ్‌. టూడీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై జ్యోతిక, సూర్య కలిసి నిర్మించిన ఈ చిత్రానికి జ్ఞానవేల్‌ దర్శకుడు. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణతోపాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. అయితే కొన్ని సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంది. ముఖ్యంగా హిందూ వన్నియార్ల సామాజిక వర్గం తమ మనోభావాలు దెబ్బతినే విధంగా జై భీమ్‌ చిత్రంలో సన్నివేశాలు చోటు చేసుకున్నాయంటూ సంతోష్‌ అనే వ్యక్తి స్థానిక సైదాపేట కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

చదవండి: మహేష్‌బాబు సినిమానే చివరగా చూశా: కేజీఎఫ్‌ బ్యూటీ శ్రీనిధి శెట్టి

కథానాయకుడు సూర్య, నిర్మాతల్లో ఒకరైన జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం సూర్య తదితరులపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వెలచ్ఛేరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ పిటిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ జైభీమ్‌ చిత్రం సూర్య తరపున చెన్నై హైకోర్టును కోరారు. ఈ కేసు సోమవారం విచారణకు రాగా.. న్యాయమూర్తి సతీష్‌ కుమార్‌ ఈనెల 21వ తేదీకి వాయిదా వేశారు. అప్పటి వరకు సూర్యపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని పోలీసులను ఆదేశించారు.  

మరిన్ని వార్తలు