Ilayaraja: ఇళయరాజాకు అనుకూలంగా తీర్పు, ఆడియో సంస్థలకు షాక్‌!

19 Feb, 2022 08:00 IST|Sakshi

సంగీత దర్శకుడు ఇళయరాజా పిటిషన్‌పై ఎకో, అగీ ఆడియో సంస్థలకు చెన్నై హైకోర్టు షాక్‌ ఇచ్చింది. వివరాలు.. ఇళయరాజా సంగీతంలో రూపొందిన పాటలను సీడీ, క్యాసెట్‌ రూపంలో విక్రయించడానికి ఎకో, అగి రికార్డింగ్‌ కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే ఒప్పందం కాలం ముగిసినా రెన్యువల్‌ చేయకుండా ఆ సంస్థలు తన పాటలను విక్రయిస్తుండడంతో ఇళయరాజా ఆ సంస్థలపై 2017లో మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఎకో, అగి ఆడియో సంస్థలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

దీంతో ఇళయరాజా మరోసారి అప్పీలు చేశారు. ఈ పిటిషన్‌ విచారించిన ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన డివిజన్‌ బెంచ్‌ శుక్రవారం సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. అందులో ఒప్పంద కాలం పూర్తి అయిన తరువాత ఇళయరాజా పాటలను ఎకో, అగి రికార్డింగ్‌ సంస్థలు వాణిజ్యం చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఆడియో సంస్థలు బదులు పిటిషన్‌ వేసుకోవచ్చని పేర్కొంది. తదుపరి విచారణను మార్చి 31వ తేదికి వాయిదా వేసింది. కాగా చాలా కాలంగా మనస్పర్థల కారణంగా దూరంగా ఉన్న ఇళయరాజా, ఆయన సోదరుడు గంగై అమరన్‌ ఇటీవల అనూహ్యంగా కలుసుకోవడం విశేషం.

మరిన్ని వార్తలు