మన్సూర్‌ అలీఖాన్‌కు సమన్లు.. నేడు విచారణ

23 Nov, 2023 06:18 IST|Sakshi

కోలీవుడ్‌ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌కు థౌజండ్‌ లైట్స్‌ పోలీసులు  సమన్లు జారీ చేశారు. గురువారం తమ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. వివరాలు.. సినీ నటి త్రిష గురించి నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. జాతీయ మహిళా కమిషన్‌ ఫిర్యాదుతో డీజీపీ శంకర్‌జివ్వాల్‌ ఆదేశాల మేరకు మన్సూర్‌పై రెండు సెక్షన్లతో కేసు నమోదు చేశారు.

ఆయన్ని విచారించేందుకు థౌజండ్‌ లైట్స్‌ పోలీసులు సిద్ధమయ్యారు. విచారణకు రావాలని ఆదేశిస్తూ ఆయనకు సమన్లు పంపించారు. ఇదిలా ఉండగా మన్సూర్‌ అలీఖాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసే క్రమంలో నటి ఖుష్భు ‘చేరి’(స్లం) భాష గురించి తనకు తెలియదని, తాను మాట్లడలేనని ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ చేరి భాష మద్దతు దారులు కుష్భుకు వ్యతిరేకంగా గళాన్ని విప్పే పనిలో పడ్డాడు.

దర్శకుడు పా రంజిత్‌ , నటి గాయత్రి రఘురాం కుష్భు వ్యాఖ్యలను ఖండించారు. ఆమె బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంలో కుష్భుకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాలలో స్వరాన్ని పెంచిన వాళ్లు ఎక్కువే. మన్సూర్‌ వ్యవహారంలో ఆగమేఘాలపై స్పందించిన కుష్భు మణిపూర్‌ వ్యవహారంలో ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించడం గమనార్హం.

మరిన్ని వార్తలు