కుర్రాడు భాను.. స్టార్‌ హీరోల పక్కన

9 Dec, 2020 07:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వయసు తొమ్మిదేళ్లు.. 15కి పైగా సినిమాలు.. డైలాగ్‌ చెప్పడం మొదలు పెడితే అనర్గళమే.. వయసుకు మించిన పరిణితితో నటనకు సంబంధించిన అన్ని ఫార్మాట్లలో ప్రావీణ్యం. ఇవన్నీ ఒక్క చైల్డ్‌ ఆర్టిస్ట్‌ గురించే.. ఆ కుర్రాడే భాను ప్రకాష్‌. అనతికాలంలోనే స్టార్‌ హీరోల పక్కన అవకాశాలు దక్కించుకుంటూ మోస్ట్‌ ఎలిజిబుల్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కేజీఎఫ్‌–2, గమనం లాంటి పాన్‌ ఇండియా మూవీస్‌లో సైతం భాను నటిస్తుండటం విశేషం. 

సినిమా ఆర్టిస్ట్‌గా రాణించాలని చాలామంది అనుకుంటారు. కానీ కొందరే ఆ కలను నిజం చేసుకుంటారు. నిరంతర కృషి, సినిమా పట్ల అంకితభావం, ఎప్పటికప్పుడు నటనలో మెలకువలు నేర్చుకోవడం వల్లే అది సాధ్యమవుతుందని అంటున్నాడు చైల్డ్‌ ఆర్టిస్ట్‌ భాను ప్రకాష్‌. ఐదేళ్ల ప్రాయం నుంచే కెమెరా ముందు తన నటనతో అందరినీ ఆకర్షించాడు. అలా అతితక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌కి కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా మారాడు భాను.  

కేజీఎఫ్‌లో ఓన్లీ వన్‌.. 
క్రేజీ ప్రాజెక్ట్‌ కేజీఎఫ్‌–2లో నటిస్తున్న తొలి తెలుగు నటుడు భాను కావడం విశేషం.. అంతేగాకుండా ఐదు భాషల్లో ఒకేసారి విడుదల కానున్న గమనం సినిమాలో నటించాడు. ఇందులో ప్రముఖ నటి శ్రియ శరన్‌తో పాటు ఒక ప్రత్యేక పాత్రలో భాను నటిస్తున్నాడు. ఈ మధ్యే గమనం తెలుగు వెర్షన్‌ ట్రైలర్‌ను పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. ఈ ట్రైలర్‌కి ఇప్పటికే 15 మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. దీంతో పాటు శేఖర్‌ కమ్ముల, నాగచైతన్య కాంబినేషన్‌లో వస్తున్న లవ్‌స్టోరీలో కూడా మెరుస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరు, వెంకీమామ, ఎన్‌టీఆర్‌ బయోపిక్‌ కథానాయకుడుతో పాటు పలు హిట్‌ సినిమాల్లో నటించాడు.
 
నాన్నే నడిపించాడు.. 
తండ్రి సురేష్‌ సినిమాలపై ప్రేమతోనే సిటీకి వచ్చాడని, తను చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా రాణించడం వెనుక నాన్న కృషి మాటల్లో చెప్పలేనిది గుర్తుచేసుకున్నాడు. ఐదేళ్ల వయసులోనే దానవీర శూర కర్ణ సినిమాలోని ‘ఏమంటివి ఏమంటివి.. లాంటి భారీ డైలాగ్స్‌ని సునాయాసంగా అభినయ సహితంగా చెప్పడం గమనించి నాన్న తనను బాగా ప్రోత్సహించాడని భాను చెప్పాడు.  

  • నటనలో ఓనమాలు నేర్పిందీ నాన్నే అంటున్నాడు. మొదట్లో ఎక్కడ ఆడిషన్స్‌ ఉన్నా తనని తీసుకెళ్లి ఎలా చేయాలి? ఎక్స్‌ప్రెషన్స్‌లో వేటికి ప్రాధాన్యం ఇవ్వాలి తదితర అంశాల్లో మెలకువలు నేర్పేవాడని గుర్తు చేసుకున్నాడు. 
  • తనకు మెదటిసారిగా ‘ఒక్క క్షణం’ సినిమాలో అవకాశం వచ్చిందని, దాన్ని సద్వినియోగం చేసుకున్నాక అనేక సినిమాల్లో అవకాశాలు వెల్లువెత్తాయని ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తక్కువ సమయంలోనే క్రిష్, అనిల్‌ రావిపూడి లాంటి దిగ్గజ దర్శకుల సినిమాల్లో అవకాశాలు పొందడం, తద్వారా వారి పర్యవేక్షణలో నటనలో మంచి ప్రావీణ్యం సంపాదించానని చెబుతున్నాడు. 
  • ప్రస్తుతం తాను 3వ తరగతి చదువుతూ అటు సినిమాలను ఇటు చదువును ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండా కష్టపడుతున్నాడు. ఔట్‌డోర్‌ షూటింగ్స్‌ ఉన్న సమయాల్లో ఆన్‌లైన్‌లో తన సబ్జెక్ట్‌ని నేర్చుకుంటున్నాడు. నటనలోనైనా, చదువులోనైనా అన్నింటికీ మార్గదర్శి మాత్రం నాన్నే అంటున్నాడు భాను. ఈ సందర్భంగా ఆర్టిస్ట్‌గా నేషనల్‌ అవార్డ్‌ సాధించి నాన్నకు బహుమతిగా ఇవ్వాలన్నదే తన లక్ష్యమని వినయంగా తెలిపాడు. 

యాక్టర్‌.. ఆల్‌ రౌండర్‌..
సినిమాల్లోనే కాకుండా సీరియల్స్, షార్ట్‌ఫిలిమ్స్, వెబ్‌సిరీస్, యాడ్స్, టీవి షోలు, నాటకాలు ఇలా అన్ని ఫార్మాట్లలో భాను తనని తాను నిరూపించుకుంటున్నాడు. మెట్రో కథలు, గీతా సుబ్రహ్మణ్యం తదితర వెబ్‌ సిరీస్‌లు, జబర్దస్త్‌ షోలో సైతం కొన్ని ఎపిసోడ్స్‌లో చేశాడు. అంతేగాకుండా ఆహా వేదికగా సమంత చేస్తున్న సామ్‌జామ్‌ షోలోనూ మెరిశాడు. అతి చిన్న వయసులోనే ఇలా విభిన్న ఫార్మాట్లలో ప్రావీణ్యం చూపడం చాలా అరుదు. ‘దారి’ షార్ట్‌ఫిల్మ్‌లో తన నటనతో అందరి మన్ననలను పొందడమే కాకుండా ఏఎన్నార్‌ అవార్డ్‌ను సైతం సొంతం చేసుకున్నాడు. ఇదే ఫిల్మ్‌కి మినీమూవీ ఫెస్టివల్‌ అవార్డ్‌ కూడా వరించింది.   

ఇష్టపడి.. కష్టపడి.. 
చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌లోనూ, నటనలోనూ భాను ఉత్సాహం చూసి ముచ్చటేసేది. తనలో కళ ఉంది. దానికి మెళుకువలద్ది సరైన దారిలో పెట్టడమే నా భాధ్యతగా భావించా. వయస్సు చిన్నదే అయినా సినిమాలు, నటనలో డెడికేటివ్‌గా ఉంటాడు. ఉన్నతంగా ఆలోచించడం భాను మరో కోణం. మంచి సినిమాల్లో అవకాశాలు వచ్చాయంటే దానికి భాను పడిన కష్టం, తాపత్రయం నాకు మాత్రమే తెలుసు. కొన్ని ఆడిషన్స్‌లో వేల మంది పాల్గొన్నప్పటికీ భాను మాత్రమే సెలక్ట్‌ అయిన సందర్భాలు ఉన్నాయి. సినిమా నటుడిగా నిరూపించుకోవడం కొద్ది మందికి మాత్రమే సాధ్యమవుతుంది. అందులో భాను ఉండటం చాలా సంతోషాన్నిస్తోంది. – సురేష్‌ అమాస, భాను తండ్రి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు