-

ట్రోలింగ్‌తో ఆర్టిస్ట్‌ ఆత్మహత్య.. చివరి మాటలవే:తల్లి

27 Nov, 2023 10:40 IST|Sakshi

పొగడ్త పన్నీరు వంటిది.. వాసన చూసి వదిలేయాలి అంటుంటారు. విమర్శ కూడా అంతే.. వినీవినపడనట్లు వదిలేయాలే కానీ వాటి గురించి ఆలోచిస్తూ ఒత్తిడికి లోనవకూడదు. కానీ ఇక్కడ చెప్పుకునే మేకప్‌ ఆర్టిస్ట్‌ ప్రన్షు విమర్శలను తట్టుకోలేకపోయాడు. ట్రోలింగ్‌ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. 16 ఏళ్లకే ప్రపంచాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. 'నా కొడుకు మేకప్‌ వేయడం సొంతంగా నేర్చుకున్నాడు. అతడిని చూసి నేను గర్వపడ్డాను. 12వ తరగతి పూర్తయ్యాక వాడిని ముంబైకి పంపిద్దామని ఇప్పటినుంచే డబ్బులు కూడా దాచిపెడుతున్నాను. 2019లో నేను విడాకులు తీసుకున్నాను. అప్పటినుంచి ప్రన్షుతో కలిసి ఒంటరిగా జీవిస్తున్నాను.

గతేడాది నుంచి వింతగా
గతేడాది నా కొడుకు వింతగా ప్రవర్తించాడు. అమ్మా.. నేను అమ్మాయిలు, అబ్బాయిలు.. ఇద్దరి ఆకర్షణకు లోనవుతున్నానన్నాడు. నేను అతడిని తప్పుపట్టలేదు. తను మేకప్‌ వేసుకుంటే కూడా వద్దని వారించలేదు. సింగిల్‌ పేరెంట్‌గా ఎన్నో ఆర్థిక సమస్యలు వస్తుంటాయి. ప్రన్షు ప్రతిరోజు ఎంతో కష్టపడేవాడు. యూట్యూబ్‌ నుంచి మేకప్‌ ఎలా వేయాలని నేర్చుకున్నాడు. జేమ్స్‌ చార్లెస్‌ను చూసి స్ఫూర్తి పొందాడు. అతడిలానే ఉంటాననుకునేవాడు. ఎప్పటికైనా అతడిని కలవాలనుకునేవాడు.

అదే చివరి ఫోన్‌ కాల్‌..
ప్రన్షు చిన్న వయసులోనే ఎంతో మెచ్యూర్‌గా ఆలోచించేవాడు. ద్వేషపూరిత కామెంట్లను ఎలా హ్యాండిల్‌ చేయాలో వాడికి బాగా తెలుసు. అంతెందుకు, ట్రోలింగ్‌ చూసి మేమిద్దరం నవ్వుకునేవాళ్లం. తన తండ్రిని కూడా చాలా ఏళ్ల క్రితమే బ్లాక్‌ చేశాడు. మళ్లీ ఎప్పుడూ ఆయన గురించి ఆలోచించలేదు. ప్రన్షు చాలా కష్టపడేతత్వం ఉన్న పిల్లాడు. తనకు ఎగ్జామ్స్‌ ఉండటంతో ట్యూషన్‌ మధ్యలో నుంచి ఇంటికి వచ్చేశాడు. ఉదయం 10 గంటలకు ఫోన్‌ చేసి మాట్లాడాను. అదే తనతో చివరి సంభాషణ అవుతుందని ఊహించలేదు. ఆ తర్వాత నా కొడుకు నాతో మాట్లాడలేదు.

ఇంత పగ, ద్వేషమా?
తను ఎక్కడున్నా రత్నమే. నా పిల్లాడిని నేను కోల్పోయాను. మీ పిల్లలు ఏం కావాలనుకుంటే అది కానివ్వండి. వారిని ఎలా ఉంటే అలా అంగీకరించండి అని ప్రన్షు తల్లి ఎమోషనలైంది. ఈ నోట్‌ను సింగర్‌ చిన్మయి శ్రీపాద షేర్‌ చేస్తూ.. భారతీయుల్లో పగ, ద్వేషం వంటివి ఎప్పటినుంచో ఉన్నాయా? లేదా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ దొరకడం వల్ల దాన్ని ఇప్పుడు చూపిస్తున్నారా తెలియడం లేదు అని మండిపడింది. ఈ పోస్ట్‌పై హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ స్పందిస్తూ గుండె బద్ధలైందని రాసుకొచ్చింది.

చీర కట్టుకుని వీడియో
కాగా ప్రన్షు మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలోని తన నివాసంలో నవంబర్‌ 21న ఆత్మహత్య చేసుకున్నాడు. దీపావళి పండగ సమయంలో ప్రన్షు చీర కట్టుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్‌ చేశాడు. దీనికి విపరీతమైన నెగెటివ్‌ కామెంట్లు వచ్చాయి. ఆ ట్రోలింగ్‌ను తట్టుకోలేకే అతడు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఎల్‌జీబీటీక్యూలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు స్వేచ్ఛగా బతికే హక్కు లేదా? అని ప్రశ్నిస్తున్నారు.

A post shared by Chinmayi Sripada (@chinmayisripaada)

A post shared by 𝙋𝙧𝙖𝙣𝙨𝙝𝙪. (@glamitupwithpranshu)

నోట్‌: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు:
040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

చదవండి: తెలుగులో స్టార్‌ హీరో సరసన నటించే ఛాన్స్‌.. కానీ..

మరిన్ని వార్తలు