‘బాల్యం నుంచి వేధింపులు, మీ స్ఫూర్తితో ధైర్యం చేశా’

13 May, 2021 15:49 IST|Sakshi

చిన్మయి శ్రీపాద.. గాయనీగా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా పరిశ్రమలో దూసుకుపోతున్న ఆమె ఒక్కప్పుడు పెద్దగా ఎవరికీ తెలియదు. తన గాత్రంతో ఎందరినో ఆకట్టుకున్న ఆమె.. చిన్మయి పేరుతో మాత్రమే సుపరిచితురాలు. తెరవెనుకే ప్రేక్షకులను అలరించిన ఆమె ఒక్కసారిగా మీటూ ఉద్యమంతో తెరపైకి వచ్చి పాపులర్‌ అయ్యింది. అంతకుముందు వరకు పాడటం కోసమే సవరించిన ఆమె గొంతు.. ఒక్కసారిగా గళాన్ని విప్పింది. బయట సమాజంలో ఆడవారు ఎదుర్కొంటున్న వివక్షను మీ టూ ఉద్యమం ద్వారా ఆమె ప్రశ్నించడం ప్రారంభించింది. 

అలా ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్న చిన్మయి ఎంతోమంది మహిళలకు, బాలికలకు, యువతులకు ఆదర్శంగా నిలిచింది. తమ పట్ల జరుగుతున్న అఘాయిత్యాలపై నోరు మెదిపేందుకు భయపడుతున్న వారు సైతం ఆమె స్ఫూర్తితో బయటకు వచ్చి తమ బాధను చెప్పుకుంటున్నారు. తాజాగా ఓ యువతి తనకు జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులతో చెప్పుకున్నానని, అంతేగాక తనపట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ కామంధుడికి తగిన శిక్ష పడేలా చేశానంటూ ఆమె చిన్మయికి లేఖ రాసింది. అంతేగాక ఇది మీ వల్లే ఇంత ధైర్యం చేశానని కూడా చెప్పింది. ఈ లేఖ సదరు యువతి.. ‘మీరు నిజంగా మాకు స్ఫూర్తి మేడం. నేను నా బాల్యం నుంచి లైంగిక వేధింపులకు గురయ్యాను. మా కజిన్‌నే నాపై అత్యాచారం చేస్తూ వచ్చాడు.

ఈ విషయం మా అమ్మనాన్నలకు చెప్పేందుకు భయపడేదాన్ని. కానీ ఓ రోజు ధైర్యం చేసి నిజం చెప్పాను. అయితే వారు ఈ విషయం బయట ఎక్కడ మాట్లాడొద్దని నన్ను హెచ్చరించారు. వారి నుంచి ఆ మాటలు విని నిరాశ పడ్డాను. కానీ మీలాంటి వ్యక్తులు అలాంటి వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుండటంతో నాలాంటి వారిలో ధైర్యం వచ్చింది. మగవారు తప్పు చేసినా కూడా మనం ఎందుకు సైలెంట్‌గా ఉండాలనే ఆలోచన మొదలైంది. అందుకే ఇంట్లో ఎదురించలేకపోయిన బయట ఓ ఆకతాయి చేసిన పనికి పోలీసులకు ఫిర్యాదు చేశాను. పబ్లిక్ స్థలంలోనే అతడు నన్ను తాకడంతో తిరిగి ఎదిరించాను. అతడిపై ఫిర్యాదు కూడా చేశాను. వాడికి సరైన శిక్ష పడేలా చేశాను. మా లాంటి వారి గొంతుకలా నిలుస్తున్నందుకు మీకు ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చిన లేఖను చిన్మయి తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. 

A post shared by Chinmayi Sripada (@chinmayisripaada)

మరిన్ని వార్తలు