Chiranjeevi Birthday Special: చిరంజీవి గురించి మీకు తెలియని 10 ఆసక్తికరమైన విషయాలు

22 Aug, 2022 02:28 IST|Sakshi

‘స్వయంకృషి’తో ఎదిగిన గొప్ప నటుడు ఆయన. టాలీవుడ్‌ బాక్సాఫీస్‌కు కొత్త లెక్కలు నేర్పించిన ‘మాస్టర్‌’. డ్యాన్స్‌తో ఎంతో మందికి స్ఫూర్తి నింపిన ‘ఆచార్యు’డు. యాక్షన్‌కు ‘గాడ్‌ఫాదర్‌’. ఇండస్ట్రీ హిట్లకు దారి చూపిన ‘హిట్లర్‌’. ప్రతి పాత్రని ‘ఛాలెంజ్‌’గా తీసుకొని ‘విజేత’గా నిలిచిన ‘హీరో’. కరోనా సమయంలో పేద కళాకారులకు ఆదుకున్న ‘ఆపద్బాంధవుడు’. రక్తదానం, నేత్రదానం అంటూ  ఎంతో మంది ప్రాణాలను కాపాడుతూ ‘ అందరివాడు’ అనిపించుకున్న ‘మగ మహారాజు’.. ఆయనే మెగాస్టార్‌ చిరంజీవి.  నేడు(ఆగస్ట్‌ 22) ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి గురించి కొన్ని విశేషాలు...

1955, ఆగ‌ష్టు 22 న ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా మొగుల్తూర్ గ్రామంలో కొణిదెల వెంక‌ట్రావ్, అంజనా దేవి దంప‌తుల‌కు ప్ర‌థ‌మ సంతానంగా చిరంజీవి జన్మించారు. త‌మ్ముళ్లు నాగేంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్. తన 25 వ ఏటా అంటే 1980లో నాటి ప్ర‌సిద్ద హాస్య న‌టుడు అల్లు రామ‌లింగ‌య్య కుమార్తె సురేఖను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గ‌రు సంతానం. ఇద్దరు కూతుళ్లు సుష్మిత, శ్రీజ , కుమారుడు రామ్‌ చరణ్‌.

► మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. కెరీర్ ప్రారంభం లో చిన్న చిన్న పాత్రలు చేసి హీరోగా అవకాశాలు అందుకున్నారు. ఆ తరవాత తన డ్యాన్స్ నటన తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

► చిరంజీవికి తన బర్త్‌డే ఆగస్ట్‌ 22 ఎంత ప్రత్యేకమో.. సెప్టెంబర్‌ 22 కూడా అంతే స్పెషల్‌. ఎందుకంటే ఆయన నటించిన తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’విడుదలైంది ఈ రోజే. 1978 సెప్టెంబర్‌ 22న ఈ చిత్రం విడుదలైంది.  కొణిదెల శివశంకర్‌ వరప్రసాద్‌ని చిరంజీవిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన ‘ప్రాణం ఖరీదు’నాకు ఎప్పుడూ స్పెషలే అని చిరంజీవి చెబుతుంటాడు.(చిరంజీవి నటింటిన తొలి చిత్రం ‘పునాది రాళ్లు’అయినా.. ప్రాణం ఖరీదు ముందుగా విడులైంది)

► ‘రుద్రవీణ‌’లోని పాటలు చిరంజీవికి చాలా ఇష్టమట. చిరుకే కాదు ఆయన సతీమణి సురేఖకు కూడా ఈ పాటలే ఇష్టమట. ఈ సినిమాలోని ‘న‌మ్మ‌కు నమ్మ‌కు ఈరేయిని క‌మ్ముకు వ‌చ్చిన ఈ మాయ‌ని’అనే పాట అంటే తనకు చాలా ఇష్టమని గతంలో చిరంజీవి తెలిపారు. 

► చిరంజీవి చేతి రాత అస్స‌లు బాగుండ‌ద‌ట‌. ఆయన రాసిన దాన్ని ఆయనే మళ్లీ చదవలేకపోతాడట. స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా చేతి రాత‌ను మ‌ళ్లీ ప్రాక్టీస్ చేస్తుంటానని గతంలో చిరంజీవి చెప్పారు.

► చిరంజీవికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. వీలు చిక్కినప్పుడల్లా ప్రకృతి అందాలను తన కెమెరాలో బంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటాడు. ‘నాకు చిన్న‌ప్ప‌టి నుంచి ఫోటోగ్ర‌ఫి అంటే చాలా ఇష్టం. చిన్న‌ప్పుడు కెమెరాలు కొనుక్కోలేక‌పోయాను. సినిమాల్లోకి వ‌చ్చిన త‌రువాత నాకు తెలియ‌కుండానే అదొక హాబీగా మారిపోయింది’అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చిరు చెప్పారు.

► ‘అంజి’ సినిమా కోసం ఓ షర్ట్‌ని రెండేళ్ల పాటు ఉతకకుండా వేసుకున్నాడట. ఈ సినిమా క్లైమాక్స్‌ని దాదాపు రెండేళ్ల పాటు తీశాడు దర్శకుడు కోడి రామకృష్ణ. క్లైమాక్స్‌లో చిరంజీవి వేసుకునే చొక్కా రెండేళ్ల పాటు అలాగే ఉతకకుండా ఉంచాల్సి వచ్చిందని అప్పట్లో దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ మూవీ  ఫ్లాప్ అయినా కూడా తనకు, చిరంజీవికి మరుపురాని చిత్రమని చెప్పాడు .

► చిత్రపరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ‘ఆస్కార్‌’. ఈ అవార్డు అందుకోవడం ఎంత గొప్ప విషయమో.. ఆ వేడుకలో పాల్గొనటం కూడా అంతే గొప్ప విశేషం. దక్షిణాది నుంచి ఈ అరుదైన అవకాశం అందుకున్న తొలి హీరో చిరంజీవి. 1987లో జరిగిన అస్కార్‌ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు.

► రెండు బిరుదులు పొందిన అరుదైన హీరోలలో చిరంజీవి ఒకరు. తొలినాళ్లలో ‘సుప్రీమ్‌ హీరో’గా పేరొందిన చిరంజీవి.. తర్వాత ‘మెగాస్టార్‌’గా క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ‘మరణ మృదంగ’తర్వాత చిరంజీవి మెగాస్టార్‌గా మారాడు. ఈ చిత్ర నిర్మాత కేఎస్‌ రామారావు చిరుకి ఆ బిరుదు ఇచ్చాడు.

► ‘ప‌సివాడి ప్రాణం' చిత్రం ద్వారా తెలుగు తెరపై మొట్ట మొద‌టిసారిగా బ్రేక్ డ్యాన్స్ చేసిన ఘ‌న‌త చిరంజీవి కే ద‌క్కుతుంది.చిరంజీవి డాన్సుల‌కే కాకుండా ఫైట్స్ కు కూడా పెట్టింది పేరు. ఆయ‌న ఫైట్స్ శైలి కూడా ప్ర‌త్యేకంగా ఉంటుంది. డూప్ లేకుండానే రిస్క్ తీసుకుంటారు. 

► అక్టోబర్ 2, 1998లో 'చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్' స్థాపించాడు. 'చిరంజీవి బ్లడ్ బాంక్', 'చిరంజీవి ఐ బాంక్' ఈ ట్రస్టు నడుపుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా నేత్రదానం, రక్తదానం సాగిస్తున్న సంస్థలుగా గుర్తింపు పొందాయి.

► త్వరలోనే సినీ కార్మికుల కోసం  ఓ ఆస్పత్రి కట్టించబోతున్నాడు. ఓ సినిమా నిర్మించాలంటే ఎంతో మంది కార్మికులు ఎంతో కష్టపడతారని, వారి కోసం తాను తన తండ్రి కొణిదెల వెంకట్రావు పేరుతో ఆస్పత్రి నిర్మిస్తానని ఇటీవల చిరంజీవి ప్రకటించారు. వచ్చే ఏడాదికల్లా ఈ ఆస్పత్రిని నిర్మించి అందుబాటులోకి తీసుకొస్తానని వెల్లడించారు.

మరిన్ని వార్తలు