Chiranjeevi: రమేశ్‌బాబు మరణవార్త ఎంతో బాధ కలిగించింది

9 Jan, 2022 10:35 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ కృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేశ్‌బాబు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి ట్విటర్‌ వేదికగా ఆయనకు నివాళులు అర్పించారు. 'రమేశ్‌బాబు మరణవార్త విని షాకయ్యాను. ఎంతో బాధ కలిగింది. కృష్ణగారికి, మహేశ్‌బాబు కుటుంబం మొత్తానికి ఇదే నా ప్రగాఢ సానుభూతి.. ఈ విషాదంలో నుంచి కోలుకునేందుకు ఆ భగవంతుడు రమేశ్‌ కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్‌ చేశాడు. కాగా కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రమేశ్‌బాబు శనివారం(జనవరి 8) రాత్రి తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే!

కృష్ణ, ఇందిరల మొదటి సంతానం రమేశ్‌బాబు. తండ్రి కృష్ణ హీరోగా నటించిన ‘అల్లూరి సీతారామరాజు’(1974) సినిమాలో చిన్నప్పటి సీతారామరాజుగా తెరంగేట్రం చేశారు. వి. మధుసూదనరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సామ్రాట్‌’(1987)తో హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘చిన్ని కృష్ణుడు, బజారు రౌడీ, కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు, బ్లాక్‌ టైగర్, కృష్ణగారి అబ్బాయి, కలియుగ అభిమన్యుడు, అన్నాచెల్లెలు, ఆయుధం’వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించారు. ‘బజారు రౌడీ’, ‘అన్నాచెల్లెలు’చిత్రాలు రమేశ్‌ కెరీర్‌లో మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి. 1997లో ఎన్‌. శంకర్‌ దర్శకత్వం వహించిన ‘ఎన్‌కౌంటర్‌’ రమేశ్‌బాబుకి చివరి చిత్రం. ఆ తర్వాత నిర్మాతగా మారిన ఆయన మహేశ్‌ ‘అతిథి’సినిమాను నిర్మించారు. మహేశ్‌ ‘దూకుడు’, ‘ఆగడు’చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరించారు.

మరిన్ని వార్తలు