శోభా నాయుడు నన్ను ప్రశంసించారు: చిరంజీవి

14 Oct, 2020 15:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ కూచిపూడి నాట్యకళాకారిణి శోభా నాయుడు కన్నుమూశారు. ఈ క్రమంలో మెగస్టార్‌ చిరంజీవి ట్విట్టర్‌ వేదికగా ఆమె మృతికి సంతాపం తెలిపారు. ఆమెతో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘శోభా నాయుడు గొప్ప కూచిపూడి కళాకారిణి. నృత్య కళకు జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి. వెంపటి చిన్న సత్యం తర్వాత ఆయన శిష్యురాలిగా ఆయనంత ఖ్యాతినీ, కీర్తినీ కూచిపూడి నృత్య కళకు తీసుకొచ్చిన గొప్ప కళాకారిణి ఆమె. కూచిపూడి నృత్యం ద్వారా ఆమె మన సంస్కృతి గొప్పతనాన్ని విదేశాల్లో కూడా చాటారు. ఆమెతో నాకు వ్యక్తిగతంగా ఎంతో పరిచయం ఉంది. ఒకరిని ఒకరు అభిమానించుకొని ప్రశంసించుకునే వాళ్లం. శుభలేఖ చిత్రంలో నా క్లాసికల్‌ డ్యాన్స్‌ చూసి ఆమె నన్ను ఎంతో ప్రశంసించారు. అది నాకు లభించిన గౌరవంగా భావిస్తాను. ఆ సంప్రదాయం అలా కొనసాగుతూనే ఉంది. సినిమాల్లో ఆమెకు ఎంతో గొప్ప భవిష్యత్తు ఉన్నప్పటికి నృత్యానికే అంకితం అయ్యారు’ అని తెలిపారు. (చదవండి: ‘ఏ వార్త వినకూడదు అనుకున్నామో.. )

‘ఈ మధ్య కాలంలో కూడా కరోనా గురించి జనాలకు అవగాహన కల్పించడం కోసం శోభా నాయుడు ఒక డ్యాన్స్‌ వీడియోను రూపొందించారు. అది చూసిన వెంటనే నేను ఆమెకు కాల్‌ చేసి అభినందించాను. సమాజ శ్రేయస్సు కోసం తన కళను వినియోగించారు. భారత దేశానికి, తెలుగు జాతికి ఆమె చేసిన సేవకు సెల్యూట్‌ చేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అంటూ చిరంజీవి ట్వీట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు