ఆయన ప్రస్థానం నన్ను వెన్నాడే విషాదం: చిరంజీవి

7 May, 2021 10:32 IST|Sakshi

సామాన్యులతో పాటు ఎందరో సెలబ్రిటీలను కరోనా పొట్టన పెట్టుకుంటోంది. ఈ క్రమంలో గతేడాది గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో కన్ను మూసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రముఖ సీనియర్‌ గాయకుడు జి.ఆనంద్‌ ఆ మహమ్మారికి బలయ్యాడు. ఆయన మరణవార్త విని మెగాస్టార్‌ చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యాడు. 

"ఎన్నియల్లో.. ఎన్నీయల్లో.. ఎందాకా.. అంటూ నా సినీ జీవితంలో తొలి పాటకు గాత్రదానం చేయడం ద్వారా మృదు స్వభావి, చిరు దరహాసి జి. ఆనంద్‌ నాలో ఒక భాగమయ్యారు. అలాంటి ఆయన కర్కశమైన కరోనా బారిన పడి ఇక లేరనే వార్తన నమ్మలేకపోతున్నాను. మొట్టమొదటి సారి వెండితెర మీద ఆయన గొంతు పాడిన పాటకే నేను నర్తించాననే విషయం, ఆయనతో నాకు ఒక అనిర్వచనీయమైన అవినాభావ బంధం ఏర్పరిచింది. ఆయన ప్రస్థానం నన్ను వెన్నాడే విషాదం..." అంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపాడు చిరంజీవి.

ఈ మహమ్మారి కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని, దయచేసి అందరూ తప్పకుండా కరోనా నియంత్రణ చర్యలు పాటించాలని విజ్ఞప్తి చేశాడు. కరోనా విముక్త భారతాన్ని నిర్మించడంలో మీ వంతు భాద్యతగా వ్యవహరించండని పిలుపునిచ్చాడు.

చదవండి: తెలుగు చిత్రసీమలో విషాదం..ప్రముఖ గాయకుడు మృతి

>
మరిన్ని వార్తలు