చిరంజీవి ఇచ్చిన గిఫ్ట్‌ వల్లే ప్రాణాలతో బయటపడ్డా : కృష్ణవంశీ

17 Jul, 2022 13:36 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి అంటే చిత్రపరిశ్రమలో అందరికి ఇష్టమే. ఎంత ఎదిగిన ఒదిగిన ఉండే వ్యక్తిత్వం ఆయనది . అందుకే సామాన్యులే కాకుండా సినీ ప్రముఖులు కూడా ఆయనకు అభిమానిగా మారుతారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ఒక్కరు. ఆయనకు మెగాస్టార్‌ అంటే ఎనలేని ప్రేమ. సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగాను అన్నయ్య(చిరంజీవి)అంటే చాలా ఇష్టమని అంటున్నాడు కృష్ణవంశీ. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి, ఆయన తనకు ఇచ్చిన బహుమతి గురించి చెప్పుకొచ్చాడు.

‘చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం. ఎంతో కష్టపడి ఆయన ఈ స్థాయికి వచ్చాడు. తోటి నటీనటులను గౌరవంగా చూసుకుంటాడు. కెరీర్‌ స్టార్టింగ్ నుంచి ఇప్పటికీ అలానే ఉన్నాడు. అందుకే ఆయన అంటే నాకు చాలా గౌరవం. పర్సనల్‌గాను ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. కష్టకాలంలో ‘గోవిందుడు అందరివాడేలే’సినిమాను ఇచ్చాడు. గతంలో మెగాస్టార్‌తో కలిసి ఓ యాడ్‌ చేశాను. డబ్బింగ్‌ సమయంలో ‘అన్నయ్యా.. మీకు బాగా నచ్చిన వ్యక్తికి మీ కారు గిఫ్ట్‌గా ఇస్తారా?’అని సరదాగా అడిగాను.

కొన్ని రోజుల తర్వాత ఇంటికి పిలిచి కారు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నానని చెప్పాడు. నేను వద్దని చెప్పాను. నాకు బహుమతులు తీసుకోవడం ఇష్టం ఉండదు.. ఒకవేళ ఇచ్చిన నా దగ్గర అవి ఎక్కువ కాలం ఉండవు’అని చెప్తే.. ‘అన్నయ్యా అని పిలుస్తున్నావు.. మరి ఈ అన్నయ్య గిఫ్ట్‌ ఇస్తే తీసుకోవా? అని అనడంతో మొహమాటంగానే తీసుకున్నాను. దానితో ఎన్నో సాహసాలు చేశా. ఓ సారి నందిగామ వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. అది చాలా పెద్ద యాక్సిడెంట్‌..కానీ నా ప్రాణానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. చిన్న చిన్న గాయాలతో బయపడ్డాను. అన్నయ్య ఇచ్చిన కారు వల్లే నేను ప్రాణాలతో బయటపడ్డాను’అని కృష్ణవంశి చెప్పుకొచ్చాడు. 

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘రంగ మార్తాండ’అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మరాఠీ సూపర్‌ హిట్‌ ‘నట సామ్రాట్‌’కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్‌లో విడుదల కానుంది. ప్రకాశ్‌ రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ‘అన్నం’చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. 
 

మరిన్ని వార్తలు