ఉప్పెన రూ.100 కోట్ల చిత్రం: సుకుమార్‌

7 Feb, 2021 12:38 IST|Sakshi

‘‘ఉప్పెన’ చూసిన వెంటనే ప్రెస్‌మీట్‌ పెట్టి అందరికీ ఈ సినిమా గురించి చెప్పాలనిపించింది. ఈ సినిమా అంత బాగా నచ్చింది. అతిశయోక్తి కాదు.. ఇది దృశ్యకావ్యం’’ అన్నారు చిరంజీవి. వైష్ణవ్‌ తేజ్, కృతీ శెట్టి జంటగా విజయ్‌ సేతుపతి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు సన దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్లు నిర్మించాయి. ఈ నెల 12న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్‌ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ – ‘‘సంవత్సరం పాటు చీకట్లో ఉంది ఇండస్ట్రీ. థియేటర్స్‌ మూసేయాల్సిన పరిస్థితి. మబ్బు కమ్ముకున్నట్లు అనిపించింది. మళ్లీ శుభారంభం వచ్చింది. థియేటర్స్‌ ఓపెన్‌ అయ్యాయి. కానీ థియేటర్స్‌కి ప్రేక్షకులు వస్తారా? లేదా? అని మేం ఆలోచిస్తుంటే.. ప్రేక్షకులు థియేటర్స్‌కి వచ్చారు. సినిమాయే ప్రథమ వినోదం అని నిరూపించారు. ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు.

ఉప్పెన’ గురించి చెప్పాలంటే... ఈ కథ విన్నప్పుడు షాకయ్యాను. కరెక్షన్స్‌ చేయడానికి, ఇన్‌ఫుట్స్‌ ఇవ్వడానికి ఏమీ లే దు. ఈ కథ అంత బాగా చేశారు. ఎన్నో ప్రేమకథలు చూశాం. కానీ ఇందులో ఉన్న ఎమోషన్స్‌ మనల్ని కట్టిపడేస్తాయి. మైత్రీ వాళ్లకు ఇది మరో ‘రంగస్థలం’ అవుతుంది. బుచ్చిబాబు దర్శకత్వ ప్రతిభను మెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి. ఈ సినిమా తమిళ దర్శకుడు భారతీరాజాను గుర్తు చేసింది. మన మట్టికథలు, నేటివ్‌ కథలు రావాలి. ‘ఉప్పెన’ మన నేటివ్‌ కథ. విజయ్‌ సేతుపతి విలక్షణ నటుడు. హీరోగానే కాదు... పాత్ర బావుంటే ఏ పాత్రైనా చేస్తాడు. మొదటి సినిమాలోనే కృతి బాగా చేసింది. కచ్చితంగా సూపర్‌స్టార్‌ అవుతుంది. వైష్ణవ్‌ మా అందరికీ గర్వకారణం. అంత బాగా చేశాడు. బుచ్చిబాబు తనలోని నటనను రాబట్టుకోవడమే కాకుండా, పరిశ్రమకు మంచి నటుడిని అందించారు. వైష్ణవ్‌ కళ్లల్లో కళ ఉంటుంది. ‘శంకర్‌ దాదా’లో చిన్న వేషం వేశాడు. అప్పుడే అనిపించింది.. వీడు మంచి యాక్టర్‌ అవుతాడని. మొదటి సినిమాకే ఇలాంటి సంస్థలో యాక్ట్‌ చేయడం వైష్ణవ్‌ అదృష్టం. ఈ సినిమాను పెద్ద రేంజ్‌కి తీసుకెళ్లింది దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం. తన పాటలతో సినిమాపై ప్రత్యేక ఆసక్తిని తీసుకొచ్చాడు దేవి. మైత్రీ మూవీస్‌ అందరికీ నచ్చిన నిర్మాణ సంస్థ. త్వరలోనే వాళ్ల బ్యానర్‌లో, బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. 

లవ్‌ యు బుచ్చీ
సుకుమార్‌ మాట్లాడుతూ – ‘‘చిరంజీవిగారికి సినిమా అంటే ఎంతో ప్యాషన్‌. ఈ సినిమా కథను ఆరు గంటలు కూర్చొని చర్చించారు. ఆయన్ను మహావృక్షం అంటారు... అది ఎందుకో అర్థం అవుతోంది. మెగాఫ్యామిలీలో ఆయన జడ్జ్‌మెంట్‌ వల్లే చాలామంది హీరోలు రావడం జరిగిందని ‘ఉప్పెన’ సినిమా కథను డిస్కస్‌ చేసిన తర్వాత అర్థం అయ్యింది. ఆయన చెప్పిన కొన్ని కరెక్షన్స్‌తో ఇంత మంచి సినిమా వచ్చింది. వైష్ణవ్‌తేజ్‌ది మంచి ఎక్స్‌ప్రెసివ్‌ ఫేస్‌. వైష్ణవ్‌ మాట్లాడిన తీరు చూస్తుంటే భవిష్యత్‌లో మంచి పొలిటిషియన్‌ కూడా అవుతాడేమో. నా దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేసి, డైరెక్టర్స్‌ అయిన అందరికీ ఒకటి చెబుతుండేవాడిని. ఎవర్నీ కూడా నేను నా శిష్యులుగా చెప్పుకోలేను అని. ఎవరు వచ్చినా నాకు ఏదో ఒకటి నేర్పి వెళ్లిపోతున్నారు. బుచ్చిబాబుని మాత్రం శిష్యుడని చెప్పుకుంటాను. ఎందుకంటే  లెక్కలు చెప్పాను కాబట్టి. అదే నిజం అయ్యింది. తన తోటివారు ఉద్యోగులై బాగా సంపాదించుకుంటున్నారు. వీడు ఏమైపోతాడో అని వాళ్ల అమ్మగారు కంగారు పడుతుండేవారు. నేను ఆవిడను ఓదార్చేవాడిని. నాకు బుచ్చి ‘ఉప్పెన’ కథ చెప్పగానే నా రూమ్‌ అంతా గంభీరం అయిపోయింది. అంత అద్భుతంగా చెప్పాడు. అప్పుడే రవిగారికి ఫోన్‌ చేసి, ఇది చిన్న సినిమా కాదు. వందకోట్ల సినిమా అని చెప్పాను. నా దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాడని కాదు. వాడికి లెక్కలు చెప్పినందుకు గర్వపడుతున్నాను. లవ్‌ యూ బుచ్చి. బుచ్చిబాబు ఏం కావాలంటే అది జరిగింది సినిమాలో. దేవి ఇచ్చిన ఒక్కో సాంగ్‌ ఒక్కో ఆణిముత్యం. ‘నీ కన్ను నీలి సముద్రం’ పాట ‘ఫేస్‌ ఆఫ్‌ ది మూవీ’. నిర్మాతలు బడ్జెట్‌కు వెనకాడలేదు. అందుకే ఇది ఇంతమంచి సినిమా అయ్యింది’’ అన్నారు.

మా మావయ్యలకు రుణపడి ఉంటాం
వైష్ణవ్‌తేజ్‌ మాట్లాడుతూ– ‘‘మా అమ్మగారి గురించి మాట్లాడాలి. ఐ లవ్‌ యూ మా. నువ్వు చేసిన అన్ని త్యాగాలకు థ్యాంక్స్‌. నువ్వు లేకపోతే మేం (సాయిధరమ్‌తేజ్, వైష్ణవ్‌తేజ్‌) లేం. అలాగే మా ముగ్గురు మావయ్యలు మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్, నాగేంద్ర మావయ్యలు లేకపోతే నేను, మా అన్నయ్య (సాయిధరమ్‌తేజ్‌) లేం. మాకు ఏం కావాలన్నా చేసి పెడుతూ ఉండేవారు. నేను, మా అన్న మా ముగ్గురు మావయ్యలకు రుణపడి ఉంటాం. ఈ సినిమాకు కథే హీరో. నేను ఓ క్యారెక్టర్‌ చేసానంతే. మంచి కథను నా దగ్గరకు తెచ్చినందుకు బుచ్చిసార్‌కు థ్యాంక్స్‌. ఖర్చుకు వెనకాడకుండా నిర్మించిన నిర్మాతలకు, హీరోయిన్‌ కృతీశెట్టితో పాటు టీమ్‌ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. ఈ సినిమాకు సోల్‌ దేవిశ్రీ ప్రసాద్‌గారు. ఆయన పాటల వల్లే మాకు ఇంతమంచి గుర్తింపు. చంద్రబోస్, లిరిసిస్ట్‌ శ్రీమణిగార్లకు థ్యాంక్స్‌. సినిమాలో ఉప్పెనంత ప్రేమ, ఉప్పెనంత ఎమోషన్స్‌ ఉన్నాయి. అందరూ ఇంటికి తీసుకుని వెళ్తారని అనుకుంటున్నాను. ఈ సినిమా నాకు చాలా నేర్పించింది’’ అన్నారు.

బుచ్చిబాబు మాట్లాడుతూ – ‘‘సుక్కూ సార్‌... థ్యాంక్యూ. మీ వల్లే నేను దర్శకుడినయ్యాను. ఎలా రాశానో అలానే తీసే అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు థ్యాంక్స్‌. చిరంజీవిగారు ‘ఉప్పెన’ కథ విని మంచి సలహాలు ఇచ్చారు.  దేవిశ్రీ ప్రసాద్‌గారికి, మా టీమ్‌ అందరికీ ధన్యవాదాలు.  పవన్‌ కల్యాణ్‌లా పెద్ద స్టార్‌ అవుతాడు వైష్ణవ్‌’’ అన్నారు. ‘‘మొదటి సినిమాకే ఇలాంటి అవకాశం రావడం చాలా అదృష్టంగా అనిపిస్తుంది. వైష్ణవ్‌ బెస్ట్‌ కో స్టార్‌’’ అన్నారు కృతీ శెట్టి. విజయ్‌ సేతుపతి, కొరటాల శివ, దేవిశ్రీ ప్రసాద్, చంద్రబోస్, బాబీ, వెంకీ కుడుముల, శివ నిర్వాణ తదితరులు మాట్లాడారు. గోపీచంద్‌ మలినేని, హరీశ్‌ శంకర్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. (చదవండి: ఉప్పెన ట్రైలర్‌ వచ్చేసింది..)

(చదవండి: ‘ఉప్పెన’ మరో సాంగ్‌.. ఆకట్టుకుంటున్న మెలోడీ)

మరిన్ని వార్తలు