Chiranjeevi: ఒకరి సినిమా పోవాలి మరొకరి సినిమా ఆడాలా? అది మా బ్లడ్‌లోనే లేదు

11 Jan, 2023 18:23 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. చాలాకాలం తర్వాత బాస్‌ ఊరమాస్‌ పాత్రలో కనిపించనున్నాడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే ఒకరోజు ముందే(జనవరి 12న) నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. దీంతో ఈ రెండు సినిమాల మధ్య పోటీ తారాస్థాయికి చేరింది. ఇప్పటికే సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ వార్‌ మొదలయ్యాయి. తమ అభిమాన హీరో సినిమా హిట్టవ్వాలని కోరుకోవడం మంచిదే కానీ అవతలి హీరో సినిమా పోవాలని శాపనార్థాలు పెడుతున్నారు. ఈ ధోరణిపై మెగాస్టార్‌ అసహనం వ్యక్తం చేశాడు.

సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ.. 'ఒకరి సినిమా పోవాలి, మరొకరి సినిమా ఆడాలనే ధోరణి చూస్తే బాధేస్తోంది. అలాంటి ధోరణి మా రక్తంలోనే లేదు. నా తనయుడు రామ్‌చరణ్‌ మొదట వీరసింహారెడ్డి చూస్తాడేమో! అమెరికాలో ఈ రెండు సినిమాల విషయంలో జరుగుతుంది చూస్తే బాధేస్తోంది. నేను రాజకీయాల్లో ఎవరినీ ఏ మాటా అనకపోవడం నాకు ప్లస్‌ అయింది. అప్పుడు నన్ను విమర్శించినవాళ్లు ఇప్పుడు రియలైజ్‌ అయ్యి నాతో మాట్లాడుతూ ఉంటారు.

ఇదివరకే చెప్పినట్లు నా రెండో ఇల్లు వైజాగ్‌. చాలా మందికి గోవానో మరేదో విడిదిగా ఉంటుంది. కానీ నాకు మాత్రం విడిది చేసే ఇల్లు వైజాగే. ఆంధ్రప్రదేశ్‌లో రూ. 25 రూపాయలు పెంచి స్పెషల్ షోలకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా స్పెషల్ షోలు వేసుకొనేందుకు అనుమతినిచ్చినందుకు థ్యాంక్స్‌' అని పేర్కొన్నాడు మెగాస్టార్‌.

చదవండి: రిపోర్టర్‌ బర్త్‌డే.. ఊహించని గిఫ్ట్‌ ఇచ్చిన తారక్‌

మరిన్ని వార్తలు