ఇండస్ట్రీకి కొత్తతరం రావాలి

13 Nov, 2021 05:46 IST|Sakshi
వీరేష్, మణిశర్మ, వర్షా విశ్వనాథ్, చిరంజీవి, రాజీవ్, కిట్టు నల్లూరి, కోటి

– చిరంజీవి

Megastar Chiranjeevi: ‘‘కొత్తవాళ్లు ఇండస్ట్రీకి వస్తానంటే గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్తాను. ఇండస్ట్రీలో జయాపజయాలు సహజం. వాటిని పక్కన పెట్టి కష్టాన్ని నమ్ముకొని సిన్సియర్‌గా పని చేస్తే కచ్చితంగా అద్భుతమైన విజయాలను సాధిస్తారు. అలా నేను కూడా కష్టపడుతూ రావడం వలనే ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది’’ అని అన్నారు చిరంజీవి. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్‌ సాలూరి హీరోగా, ప్రముఖ నటి వాణీ విశ్వనాథ్‌ కుమార్తె వర్షా విశ్వనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘11:11’. ఈ చిత్రంలో సదన్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ కీలక పాత్రధారులు.

కిట్టు నల్లూరి దర్శకత్వంలో టైగర్‌ హిల్స్‌ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్‌ పతాకాలపై గాజుల వీరేష్‌ (బళ్లారి) నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసిన చిరంజీవి మాట్లాడుతూ –‘‘80, 90 దశకంలో హిట్లర్, రిక్షావోడు.. ఇలా నాకు 12 సినిమాల వరకు చేశారు రాజ్‌–కోటి. సుమారు 60 పాటలంటే నాకు 90 శాతం సూపర్‌ డూపర్‌ హిట్స్‌ ఇచ్చారు. ఇంత మంచి హిట్‌ సాంగ్స్‌ ఇచ్చిన కోటిగారి ఋణం తీర్చుకోలేకపోయాననే బాధ ఉండేది. కానీ ఈ రోజు కోటిగారి కొడుకు రాజీవ్‌ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.

లెజెండరీ సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వర రావుగారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, తండ్రికి తగ్గ తనయుడిగా రెండు దశాబ్దాల పాటు అద్భుతమైన సంగీతాన్ని కోటిగారు ప్రేక్షకులకు అందించారు. తన  ఇద్దరు కొడుకులలో ఒకరిని సంగీత దర్శకుడిగా మరొకరిని నటుడుగా  పరిచయం చేసి ఇండస్ట్రీలో ఇరువైపులా ఉండేలా ప్లాన్‌ చేసుకున్నారు. కోటి తనయుడు రాజీవ్, రాజ్‌గారి అబ్బాయి సాగర్‌లకు ఈ సినిమా మంచి బ్రేక్‌ ఇవ్వాలి. ఈ సినిమా విజయం సాధించి చిత్రయూనిట్‌ అందరికీ పేరు తీసుకురావాలి’’ అన్నారు. ‘‘చిరంజీవిగారి ఆశీర్వాదాలు అందడం నా కొడుకు అదృష్టం’’ అన్నారు కోటి. ‘‘ఫస్ట్‌లుక్‌ను మెగాస్టార్‌ చిరంజీవి  విడుదల చేయడం ఆనందంగా ఉంది. మణిశర్మగారి సంగీతం ఓ ప్రధాన ఆకర్షణ ’’ అన్నారు దర్శకుడు కిట్టు నల్లూరి. ‘‘చిరంజీవి గారు నాకు స్ఫూర్తి’’ అన్నారు రాజీవ్‌ . ‘‘కష్టపడితే ఏదైనా సాధించగలం అనే దానికి చిరంజీవిగారు నిదర్శనం’’ అన్నారు వీరేశ్‌. ఈ కార్యక్రమంలో వర్షా విశ్వనాథ్, నటుడు రోహిత్, నటుడు సదన్, సినిమాటోగ్రాఫర్‌ ఈశ్వర్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు