పెద్దగా కాదు ఒక బిడ్డగా చెబుతున్నా..అనవసరపు వ్యాఖ్యలు చేయొద్దు: చిరంజీవి

13 Jan, 2022 15:47 IST|Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ చాలా సంతృప్తికరంగా, ఆనందంగా జరిగిందని చిరంజీవి అన్నారు. ఈ పండుగ పూట ఒక సోదరుడుగా నన్ను ఆహ్వానించి విందు భోజనం పెట్టడం సంతోషంగా ఉందన్నారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో భేటీ అయినా చిరంజీవి.. అనంతరం మీడియాలో మాట్లాడుతూ.. పండగ పూట సీఎం జగన్‌తో ఆనందకర భేటీ జరిగిందని తెలిపారు. చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి బాధలను సీఎంకు వివరించానని చెప్పారు.

సినిమా టికెట్‌ ధరల విషయంపై కొన్ని రోజులుగా మీమాంసం ఉంది. అగమ్యగోచర పరిస్థితి ఏర్పడింది. ఏం జరుగుతుందోననే అసంతృప్తి ఒకవైపు.. ఇండస్ట్రీకి మేలు చేద్దామనేదే తమ ఉద్దేశం అని చెప్తున్న ప్రభుత్వం మరో వైపు. కొలిక్కిరాని ఈ సమస్య జఠిలమవుతున్న నేపథ్యంలో సీఎంగారు ప్రత్యేకంగా నన్ను రమ్మని ఆహ్వానించారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేముందు ఒక కోణంలో వినడం కాదు.. రెండో కోణంలోనూ వినాలని ఆయన అన్నారు. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకం, భరోసా ఎంతో బాధ్యతగా అనిపించింది. 

ఇండస్ట్రీ, ఎగ్జిబిటర్ల సాధక బాధలు సీఎంకు వివరించాను వివరించా. నేను చెప్పిన అన్ని విషయాలను సీఎం సానుకూలంగా ఆలకించారు. సినీ ఇండస్ట్రీ విషయంలో సీఎం జగన్ స్పందన సంతృప్తినిచ్చింది. పైకి కన్పించినంత గ్లామర్ గా సినీ ఫీల్డ్ ఉండదు. రెక్కాడితే కాని డొక్కాడని పేదలు ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్నారు. ధియేటర్ల యజమానులకూ అనేక బాధలు ఉన్నాయి. హాళ్లని మూసేస్తేనే బెటర్ అనే భావనకు కొందరు ధియేటర్ యజమానులు ఉన్నారు. ఈ సమస్యలన్నీ సీఎంకు వివరించాను. అన్ని రకాలుగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ చెప్పారు. టిక్కెట్ ధరలపై జారీ చేసిన జీవోను సీఎం పునః పరిశీలిస్తామన్నారు. ఐదో షో వేసుకునే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తామన్నారు. ఈ సమావేశం వివరాలను సినీ ఇండస్ట్రీలోని చిన్నా పెద్దలకు కూడా తెలియజేస్తాను. ఆ తర్వాత మరోసారి సీఎం జగన్ తో భేటీ అవుతా. వచ్చే సమావేశానికి అందర్నీ పిలిస్తే అందరం వస్తాం.. నన్నొక్కడినే పిలిస్తే నేనొక్కడినే వస్తాను. ఇండస్ట్రీ పెద్దగా కాదు ఒక బిడ్డగా చెబుతున్నా.. ఎవరూ ఆందోళన చెందొద్దు. అందరూ సంయమనంతో ఉండాలి. తొందరపడి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోరుతున్నా. త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నా’అన్నారు.

మరిన్ని వార్తలు