ఆక్సిజన్‌ కొరత, చైనాకు ఆర్డర్‌ పెట్టాం: చిరంజీవి

27 May, 2021 01:28 IST|Sakshi

రామ్‌చరణ్‌ ఈ ఏర్పాట్లను చూస్తున్నారు

ఈ కోవిడ్‌ సంక్షోభంలో ఆక్సిజన్‌ కొరత వల్ల పలువురు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ కొరత వల్ల ఏ ఒక్కరూ మరణించకూడదన్న ఉద్దేశంతో ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చూట్టారు ప్రముఖ హీరో చిరంజీవి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాల్లో ఆక్సిజన్‌ బ్యాంకుల ఏర్పాట్లు, వాటి కార్యకలాపాలను ఆచరణలో పెట్టారు. చిరంజీవి జిల్లా అభిమాన సంఘాల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ ఆక్సిజన్‌ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలకు ఆక్సిజన్‌ పంపిణీ జరిగింది. ఈ ఆక్సిజన్‌ బ్యాంకుల సమాచారాన్ని సులువుగా తెలుసుకునేందుకు వీలుగా ట్విట్టర్‌లో అకౌంట్‌ను ప్రారంభించారు.

చిరంజీవి మాట్లాడుతూ – ‘‘చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో ఈ ఆక్సిజన్‌ బ్యాంకుల ద్వారా నిరంతరాయంగా ఆక్సిజన్‌ పంపిణీ కొనసాగుతుంది. ఇక్కడ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల కొరత ఉండటం మూలాన చైనాకు ఆర్డర్‌ పెట్టాం. ప్రస్తుత పరిస్థితుల్లో చాలాచోట్ల ఆక్సిజన్‌ కొరత ఉంది. ముందుగా అత్యవసరం ఎక్కడ ఉందో అక్కడికి ఆక్సిజన్‌ సిలిండర్లు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఆక్సిజన్‌ సిలిండర్లు ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ ఉంటున్నాయన్నది తెలుసుకునేందుకు ట్రాకింగ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశాం. చిరంజీవి ఐ అండ్‌ బ్లడ్‌ బ్యాంకు కార్యాలయం నుంచి ఈ ఆక్సిజన్‌ బ్యాంకుల నిర్వహణపై పర్యవేక్షణ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్నిచోట్ల ఈ ఆక్సిజన్‌ బ్యాంకుల సేవలు సద్వినియోగం కావాలన్నదే మా సంకల్పం. రామ్‌చరణ్‌ ఈ ఏర్పాట్లను చూస్తున్నారు’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు