అలా పిలిస్తే బాలుగారు కోప్పడ్డారు; చిరంజీవి ఎమోషనల్‌ ట్వీట్‌

4 Jun, 2021 16:17 IST|Sakshi

ఎస్పీ బాలుతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చిరంజీవి

ఎస్పీ వసంత ఆలపించిన పాటను షేర్‌ చేస్తూ నివాళి

SP Balasubrahmanyam: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 75వ జయంతి నేడు(జూన్‌ 04). ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు బాలుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అశ్రు నివాళులర్పిస్తున్నారు. బాలు జయంతి సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి ఓ ఎమోషనల్‌ వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అందులో బాలుతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని తెలుపుతూ  ఓ సంఘటనను వివరించారు.

‘ఓ సందర్భంలో నేను ‘ఎస్పీ బాలు గారూ’ అని సంబోధిస్తే.. ఆయన ఎంతో బాధ పడ్డారు. ఎప్పుడూ నోరారా అన్నయ్య అనేవాడివి ఇవాళ బాలు గారూ అంటూ మర్యాదగా పిలిచి నన్ను దూరం చేస్తున్నావా అంటూ చిరు కోపం ప్రదర్శించారు. మీ ఔన్నత్యం తెలిశాక మీలాంటి వారిని ఏకవచనంతో సంబోధించడం సరికాదనుకుంటున్నానని చెప్పడంతో, అలా పిలిచి నన్ను దూరం చెయ్యకయ్యా అన్నారు. కానీ, ఇవాళ మనందరికీ అన్యాయం చేసి ఆయన దూరమయ్యారు’ అంటూ చిరంజీవి ఎమోషనల్‌ అయ్యారు.

అంతేకాదు, ఎస్పీ బాలు సోదరి ఎస్పీ వసంత ఆలపించిన ఓ పాటను కూడా పొందుపరిచారు. ‘అనితర సాధ్యుడు, మహా గాయకుడు, ప్రియ సోదరుడైన బాలు గారికి  ఓ చెల్లి అశ్రు నీరాజనం..మనందరినీ శోక సముద్రంలో  ముంచి ఇంత  త్వరగా  వీడి వెళ్లిన  ఆ గాన గంధర్వుడి 75 వ  జన్మ దిన సంధర్బంగా ఈ స్మృత్యంజలి.. వినమ్ర  నివాళి ! ’ అంటూ చిరంజీవి ట్వీట్‌ చేశారు. 

చదవండి:
ఆమె.. అతడు ఒక యుగళగీతం

జీవితాన్ని ప్రేమించిన బాలుడు
 

మరిన్ని వార్తలు