కరోనా సెకండ్‌ వేవ్‌ చాలా తీవ్రంగా ఉంది, జాగ్రత్త: చిరంజీవి

14 May, 2021 19:52 IST|Sakshi

హైదరాబాద్‌: ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ దేశ వ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ప్రతీ రోజు లక్షల్లో కోవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. మునుపటి కంటే ఈ సారి దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉండటంతో సామాన్య ప్రజల నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు మహమ్మారికి బలైపోతున్నారు. ఇక కేసులు కూడా అధికంగా నమోదవుతుండటంతో బాధితులందరికి సమయానికి వైద్యం అందించలేక ఆస్పత్రులు, ప్రభుత్వాలు సైతం ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో స్వీయ నియంత్రణ ఒక్కటే దీనికి పరిష్కారమంటూ ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలతో పాటు సినీ ప్రముఖులు కూడా అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి సైతం కరోనా పట్ల జాగ్రతగా ఉండాలని, స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇంట్లోనే ఉండాలని  అభిమానులను, ప్రజలను అభ్యర్థిస్తూ ఆయన వీడియో ద్వారా సందేశం ఇచ్చారు. 

ఈ మేరకు ఆయన ‘కరోనా సెకండ్‌ వేవ్‌ చాలా తీవ్రంగా ఉంది. రోజు ఎంతో మంది ఈ కరోనా బారిన పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. మన మిత్రుల్లోనే కొందరిని కోల్పోతున్నామంటే గుండె తరుక్కుపోతుంది. ఈ తప్పని పరిస్థితుల్లోనే మన తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ పెట్టారు. కనీసం ఇప్పుడైన అలక్ష్యం చేయకుండా మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తప్పనిసరి అయితే తప్ప బయటకు రాకండి. ఒకవేళ తప్పదనుకుంటే డబుల్‌ మాస్క్‌లు ధరించండి. లాక్‌డౌన్‌లో కూడా వ్యాక్సినేష‌న్ సాగుతోంది. రిజిస్ట్రేష‌న్ చేసుకుని అంద‌రూ వ్యాక్సిన్‌ వేయించుకోండి. ఆ త‌ర్వాత క‌రోనా పాజిటివ్ వ‌చ్చినా ప్ర‌భావం త‌క్కువ‌ ఉంటుంది. ఒకవేళ కోవిడ్ పాజిటివ్ వ‌చ్చినా ప్యానిక్‌ అవ్వకండి.

ఎందుకంటే వైర‌స్ కంటే కూడా మ‌న భ‌యమే మ‌న‌ల్ని ముందుగా చంపేస్తోంది. క‌రోనా పాజిటివ్ అని తెలియగానే మీ భాగస్వామితో సహా ఐసోలేష‌న్‌కు వెళ్లండి. మిమ్మ‌ల్ని మీరు వేరు చేసుకోండి. డాక్టర్‌ను సంప్రదించండి. మందులు వాడండి. ఊపిరి స‌మ‌స్య త‌లెత్తితే వెంట‌నే ఆస్ప‌త్రిలో చేరండి. క‌రోనాకు చికిత్స పొందిన తర్వాత నెల‌రోజుల్లో మీ శరీరంలో యాంటీబాడీస్ త‌యార‌వుతాయి. మీరు ప్లాస్మా దానం చేస్తే ఒక్కొక్క‌రు మ‌రో ఇద్ద‌రిని కాపాడిన వారు అవుతారు. ఈ విప‌త్తు స‌మ‌యంలో వీలైనంత మందికి ఈ విష‌యం చెప్పండి. మ‌న‌ల్ని మ‌నం కాపాడుకుంటే దేశాన్ని ర‌క్షించిన వాళ్లం అవుతాం. అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని సుర‌క్షితంగా ఉండండి’ అంటూ చిరంజీవి సూచించారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు