అలాంటి కథలు నమ్మొద్దు

28 Aug, 2020 01:05 IST|Sakshi

‘‘చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రకథ నాదే’’ అంటూ ఓ రచయిత (రాజేష్‌ మండూరి) ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. అందులో ఎటువంటి నిజం లేదు అని ‘ఆచార్య’ చిత్రబృందం కొట్టిపారేసింది. దీనికి సంబంధించి చిత్రనిర్మాణ సంస్థల్లో ఒకటైన మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఓ లేఖను విడుదల చేసింది. అందులోని సారాంశం ఈ విధంగా...

‘‘ఆచార్య’ చిత్రం కాన్సెప్ట్, కథను ఒరిజినల్‌గా కొరటాల శివ తయారు చేశారు. ఈ కథ నాది అని ఎవ్వరు చెప్పినా అందులో ఎలాంటి నిజం లేదు. ఇటీవలే చిరంజీవిగారి పుట్టినరోజు సందర్భంగా మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశాం. దానికి చాలా మంచి స్పందన లభించింది. కానీ కొంతమంది రచయితలు ఈ కథ మాది అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అలాంటి కథలు నమ్మొద్దు. ‘ఆచార్య’ చిత్రకథ ఈ సినిమా చేస్తున్న చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఇంటర్నెట్‌లో వైరల్‌ అయ్యే కథలను ఆధారంగా కొరటాల శివ లాంటి దర్శకుడి మీద ఆరోపణలు చేయడం సరైనది కాదు’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా, మైత్రీ మూవీ మేకర్స్‌కే మండూరు రాజేష్‌ కథ చెప్పారట. ఈ నేపథ్యంలో ఆ నిర్మాణ సంస్థ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది.

‘‘ఆచార్య’ సినిమాపై రాజేష్‌ అనే వ్యక్తి చేసిన ఆరోపణలు అసత్యం. మేం అతని కథకు ‘అన్నయ్య’ అనే పేరు  పెట్టాలని దర్శకుడు కొరటాల శివకు తెలియజేశామని చెప్పడం అబద్ధం. మా సంస్థలో నూతన దర్శకులు భరత్‌ కమ్మతో ‘డియర్‌ కామ్రేడ్‌’, రితేష్‌ రానాతో ‘మత్తువదలరా’ సినిమాలు నిర్మించాం.  ప్రస్తుతం బుబ్చిబాబు సానాతో ‘ఉప్పెన’ వంటి సినిమా నిర్మించాం. రాజేష్‌ మాకు వినిపించిన కథ బాగుంటే అతనితో కూడా సినిమా నిర్మించేవాళ్లం. కానీ, కథ బాగాలేకపోవడంతో తిరస్కరించాం. సరిగ్గా లేని కథతో సినిమా తీయమని వేరేవాళ్లకు ఎందుకు చెబుతాం? కొరటాల శివ ప్రతిభ గురించి అందరికీ తెలుసు. తన సినిమాల్లో వాణిజ్య అంశాలతో పాటు సామాజిక ప్రయోజనం కూడా జోడించే కొరటాలగారిపై ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదు. రాజేష్‌ ఆరోపణలపై తగిన చర్యలు తీసుకుంటాం’’ అని ఆ ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని వార్తలు