దోస్త్‌ మేరా దోస్త్‌: ఆమిర్‌ ఖాన్‌ కోసం చిరు.. కరణ్‌ కోసం జక్కన్న

31 Jul, 2022 08:41 IST|Sakshi

ఒక ఇండస్ట్రీలోని హీరోలు పక్క ఇండస్ట్రీ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో, అతిథి పాత్రల్లో నటిస్తున్న ట్రెండ్‌ను చూస్తున్నాం. అయితే ఇప్పుడు ‘దోస్త్‌ మేరా దోస్త్‌’ అంటూ సౌత్, నార్త్‌ హీరోలు సినిమాల రిలీజ్‌ విషయంలో ఒకరికొకరు సహాయపడుతున్నారు. సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఆ విశేషాలు చదవండి.

దాదాపు 45 ఏళ్ల  సినీ కెరీర్‌లో అగ్రహీరో చిరంజీవి ఓ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించింది లేదు. ఇప్పుడు ఆమిర్‌ ఖాన్‌ ‘లాల్‌సింగ్‌ చడ్డా’ సినిమా తెలుగు వెర్షన్‌ రిలీజ్‌ కోసం ఆ బాధ్యతను భుజాన వేసుకున్నారు చిరంజీవి. అంతేనా.. ప్రమోషన్స్‌లోనూ ఆమిర్‌తో కలిసి చురుగ్గా పాల్గొన్నారు. ఆమిర్‌ ఖాన్‌ హీరోగా అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘లాల్‌సింగ్‌ చడ్డా’. కరీనా కపూర్, నాగచైతన్య కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఆమిర్‌ ఖాన్‌ ఓ నిర్మాత. ఆస్కార్‌ విన్నింగ్‌ ఫిల్మ్‌ ‘ఫారెస్ట్‌ గంప్‌’కు హిందీ  రీమేక్‌గా రూపొందిన ఈ ‘లాల్‌సింగ్‌ చడ్డా’ చిత్రం ఆగస్టు 11న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది.

ఇక ప్రముఖ దర్శకుడు రాజమౌళి కూడా సమర్పకుడి బాధ్యతను తీసుకున్నారు. బాలీవుడ్‌ దర్శక–నిర్మాత కరణ్‌ జోహార్‌ అడిగిన మీదట ‘బ్రహ్మాస్త్ర’కు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు రాజమౌళి. రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్‌ జంటగా నాగార్జున, అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. మూడు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా తొలి భాగం ‘బ్రహ్మాస్త: శివ పార్ట్‌ 1’ ఈ ఏడాది సెప్టెంబరు 9న విడుదల కానుంది. ఈ సినిమాకు దక్షిణాది భాషల్లో సమర్పకులుగా రాజమౌళి ఉన్నారు. తెలుగులో ఈ చిత్రం ‘బ్రహ్మాస్త్రం: శివ పార్ట్‌ 1’గా రిలీజ్‌ కానుంది.

ఈ స్టార్సే కాదు.. ఇంతకుముందు కూడా కొందరు ప్రముఖులు వేరే భాషల చిత్రాలకు సమర్పకులుగా వ్యవహరించారు. ఆ జాబితాలో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించిన చిత్రం ‘1983’ ఒకటి. భారత క్రికెట్‌ జట్టు తొలిసారి ప్రపంచకప్‌ గెలుచుకున్న సంఘటనల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు రణ్‌వీర్‌ సింగ్‌ భార్య, ప్రముఖ నటి దీపికా పదుకోన్‌ ఓ నిర్మాత. ఈ సినిమా గత ఏడాది డిసెంబరు 24న విడుదలైంది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను నాగార్జున సమర్పించారు. ఇదే సినిమా తమిళ వెర్షన్‌కు సమర్పకుడిగా వ్యవహరించారు కమల్‌హాసన్‌.

పై విషయాలను బట్టి ఉత్తరాది సినిమాల రిలీజ్‌లకు  దక్షిణాది సినీ ప్రముఖులు సమర్పకులుగా హెల్ప్‌  చేస్తున్నారన్న విషయం అర్థం అవుతుంది. అయితే ఇదే సీన్‌ బాలీవుడ్‌లోనూ కనిపిస్తోంది. దక్షిణాది చిత్రాలకు రిలీజ్‌ సమయంలో బాలీవుడ్‌ సినీ ప్రముఖులు సమర్పకులుగా ఉంటున్నారు. ‘బాహుబలి’ సినిమాను హిందీ ఆడియన్స్‌కు కరణ్‌ జోహార్‌ సమర్పించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ నెల 28న విడుదలైన సుదీప్‌ ‘విక్రాంత్‌ రోణ’ సినిమాకు సల్మాన్‌ ఖాన్‌ ప్రెజెంటర్‌. బాలీవుడ్‌ దర్శక–నిర్మాత, నటుడు ఫర్హాన్‌ అక్తర్‌ ‘కేజీఎఫ్‌: చాఫ్టర్‌ 1’, ‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 2’    హిందీ వెర్షన్‌ సినిమాకు సమర్పకులుగా ఉన్నారు.  

కేవలం సమర్పకులుగానే కాదు... నిర్మాణ  రంగంలోనూ ఈ ట్రెండ్‌ కనిపిస్తోంది. సూర్య నటించిన తమిళ హిట్‌ ఫిల్మ్‌ ‘సూరరై పోట్రు’ హిందీలో రీమేక్‌ అవుతోంది. ఇందులో అక్షయ్‌ కుమార్‌ హీరో. ఈ సినిమాకు సహనిర్మాతగా ఉన్నారు సూర్య. ఇక విష్ణు విశాల్‌ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘మట్టి కుస్తీ’కి రవితేజ ఓ నిర్మాత కావడం విశేషం. తమిళంలో కమల్‌హాసన్‌ రీసెంట్‌గా నటించిన ‘విక్రమ్‌’ తెలుగు వెర్షన్‌ను హీరో నితిన్‌ సమర్పించారు. కన్నడంలో రక్షిత్‌ శెట్టి హీరోగా నటించిన ‘777 చార్లీ’ తెలుగు వెర్షన్‌ రిలీజ్‌కు హీరో రానా   సమర్పకులుగా ఉన్నారు. ఇక తమిళంలో విష్ణు విశాల్‌ నటించిన ‘ఎఫ్‌ఐఆర్‌’ తెలుగు వెర్షన్‌ రిలీజ్‌కు రవితేజ  సమర్పకులుగా ఉన్నారు.  

మరిన్ని వార్తలు