డైలాగ్‌ కింగ్‌కి మెగా వాయిస్‌

5 Jun, 2021 00:57 IST|Sakshi

మంచు మోహన్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం హీరో సూర్య సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. ఈ సినిమా టీజర్‌కు ప్రముఖ నటులు చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం విశేషం. ‘‘మన అంచనాలకు అందని ఒక వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను.. తన రూటే సెపరేటు.. తను ఎప్పుడు ఎక్కడ ఉంటాడో, ఎప్పుడు ఏ వేషంలో ఉంటాడో ఆ దేవుడికే ఎరుక..’’ అని మోహన్‌బాబు పాత్రను పరిచయం చేశారు చిరంజీవి. ఇంకా మోహన్‌బాబు చెప్పిన ‘నేను చీకట్లో ఉండే వెలుతుర్ని, వెలుతురులో ఉండే చీకటిని’, ‘నేను కసక్‌ అంటే మీరందరూ ఫసక్‌’ డైలాగ్స్‌తో టీజర్‌ సాగుతుంది.

ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ – ‘‘టీజర్‌కు చిరంజీవి అంకుల్‌ వాయిస్‌ ఓవర్‌ అయితే బాగుంటుందని విష్ణు అన్నాడు. చిరంజీవికి ఫోన్‌ చేసి అడిగితే, ‘వాయిస్‌ ఓవర్‌ మ్యాటర్‌ పంపు’ అన్నాడు. ‘ఆచార్య’ షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ నేను అడిగిన మూడు రోజులకే నాకు చెప్పకుండా తనే థియేటర్‌ బుక్‌ చేసి డబ్బింగ్‌ చెప్పి, పంపాలనుకున్నాడు. ఈ విషయం నాకు తెలిసి విష్ణుబాబును పంపాను. ‘నిన్ను (విష్ణును ఉద్దేశిస్తూ) ఎవరు రమ్మన్నారు. డబ్బింగ్‌ పూర్తి చేసి మీ నాన్నకు సర్‌ప్రైజ్‌ ఇద్దాం అనుకున్నాను’ అని విష్ణుతో చిరంజీవి అన్నాడు. నేను అడగ్గానే ఇంత గొప్పగా స్పందించినందుకు చిరంజీవికి ధన్యవాదాలు. అలాగే టీజర్‌ రిలీజ్‌ చేసిన సూర్యకు ధన్యవాదాలు. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌తో వస్తాం’’ అని అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు