ఐదు రోజులు ఐసీయూలో ఉన్నా.. నా ఫొటోకి దండ వేసి నేను లేనట్టు ప్రచారం చేశారు: విక్రమ్‌ 

29 Aug, 2022 09:46 IST|Sakshi

‘‘నా ‘శివపుత్రుడు, అపరిచితుడు’ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరించారు. నేను నటనకు ఆస్కారం ఉండే పాత్రలు చేసిన ప్రతిసారీ గొప్పగా ఆదరిస్తున్నారు. అలా తెలుగువారితో నాకు గొప్ప అనుబంధం ఉంది. ‘కోబ్రా’ చిత్రంలోనూ అద్భుతమైన నటన ఉంటుంది’’ అని హీరో విక్రమ్‌ అన్నారు. ఆర్‌.అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్, శ్రీనిధీ శెట్టి జంటగా నటించిన చిత్రం ‘కోబ్రా’. ఎస్‌ఎస్‌ లలిత్‌ కుమార్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్వీ ప్రసాద్‌ రిలీజ్‌ చేస్తున్నారు.

కాగా ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘కోబ్రా’ ప్రెస్‌మీట్‌లో విక్రమ్‌ మాట్లాడుతూ.. ‘‘మా నాన్న హెడ్‌మాస్టర్‌. ఆయన నటుడు కావాలని చెన్నై వచ్చారు. నేను మూడేళ్లకే ఓ సినిమాలో పాపగా యాక్ట్‌ చేశా. నాకు నటన అంటే పిచ్చి. ‘కోబ్రా’ కథ వినగానే వెంటనే సినిమా చేసేయాలనిపించింది. కోవిడ్‌ వల్ల సినిమా బాగా ఆలస్యం అయింది. రష్యాలో మైనస్‌ 40 డిగ్రీల చలిలో ఎంతో కష్టపడి షూటింగ్‌ చేశాం. ఈ చిత్రంలో దాదాపు పది పాత్రలు చేశాను. ఒక్కో పాత్ర మేకప్‌కి సుమారు ఐదు గంటలు పట్టేది.

‘కోబ్రా’ సైకాలాజికల్‌ థ్రిల్లర్, సైన్స్‌ ఫిక్షన్, ఎమోషనల్‌ డ్రామా. ఈ సినిమా చేయడం చాలెంజింగ్‌గా అనిపించింది. నాకు తెలిసింది నటనే. ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్త అనుభూతిని పంచాలని భిన్నంగా చేయడానికే ప్రయత్నిస్తా. ఇప్పటికీ తమిళ్‌లో టాప్‌ హీరోల్లో నేనూ ఒకణ్ణి. హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా ప్రేక్షకులు నన్ను ప్రేమిస్తుండటం గర్వంగా ఉంది. యూనివర్సల్‌ సబ్జెక్ట్‌తో రూపొందిన ‘కోబ్రా’ ని తిరుపతి ప్రసాద్‌గారు విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు.

ఎన్వీఆర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘కమల్‌ హాసన్‌గారి తర్వాత నట విశ్వరూపం చూపించే నటుడు విక్రమ్‌. ఆయన సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. ‘కోబ్రా’ చిత్రాన్ని కూడా బాగా ఆదరించాలి’’ అన్నారు. ‘‘నా మొదటి తమిళ చిత్రం ‘కోబ్రా’. తొలి సినిమాకే విక్రమ్‌గారితో నటించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నా’’ అన్నారు శ్రీనిధీ శెట్టి. ‘‘కోబ్రా’ లో ఇంటెన్స్‌, ఎమోషనల్‌ రోల్‌లో కనిపిస్తాను’’ అన్నారు నటి మృణాళినీ రవి. ‘‘కోబ్రా’ సినిమా నాకు చాలా స్పెషల్‌’’ అన్నారు నటి మీనాక్షి. 

‘ఇటీవల నా ఆరోగ్యంపై రకరకాల పుకార్లు వచ్చాయి. మరికొందరు నా ఫొటోకి పూల దండ వేసిన ఫ్రేమ్స్‌ పెట్టి నేను లేనంటూ ప్రచారం చేశారు. ఆ వార్తలు చూసిన తర్వాత బాధపడి ఐదు రోజులు ఐసీయూలో ఉన్నాను’ అన్నారు విక్రమ్‌.  

మరిన్ని వార్తలు