కోబ్రాపై భారీ అంచనాలు.. కాలేజీ యాజమాన్యానికి సెలవు కోసం విద్యార్థుల లేఖ

31 Aug, 2022 08:52 IST|Sakshi

విక్రమ్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కోబ్రా. కేజీఎఫ్‌ ఫేమ్‌ శ్రీనిధి శెట్టి నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని అజయ్‌ జ్ఞానమూర్తి దర్శకత్వంలో 7 స్క్రీన్‌ పతాకంపై ఎస్‌ఎస్‌ లలిత్‌ కుమార్‌ భారీ ఎత్తున నిర్మించారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని భారీ అంచనాల మధ్య వినాయక చవితి రోజు బుధవారం తెరపైకి వచ్చింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌ ప్రేక్షకుల్లో ఇప్పటికే విశేష ఆదరణ పొందాయి.

సస్పెన్‌ థ్రిల్లర్‌ యాక్షన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో విక్రమ్‌ ఏడు విభిన్న రూపాల్లో కనిపించడం విశేషం. ఆయన నటించిన చిత్రం థియేటర్లో విడుదలై మూడేళ్లు అయ్యింది. వెరసి కోబ్రా చిత్రంపై ఇటు చిత్ర పరిశ్రమతో పాటు అభిమానుల్లోనూ చాలా ఆసక్తి నెలకొంది. దీంతో ఆ అంచనాలను పూర్తి చేయడానికి చిత్ర బృందంతో సిద్ధమయ్యారు. అందులో భాగంగా తమిళనాడులోని చెన్నై, మదురై, తిరుచ్చి, కోవై వంటి ప్రధాన నగరాల్లో చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాలను నిర్వహించారు. సినీ ప్రేక్షకులు ఆయన బృందానికి బ్రహ్మరథం పట్టారనే చెప్పవచ్చు.

తమిళనాడులోనే కాకుండా ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ విడుదలైంది. విక్రం హైదరాబాద్, కొచ్చి, బెంగళూరు నగరాల్లోనూ ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ఇంతకుముందు ఎప్పుడూ విక్రమ్‌ ఈ విధంగా తన చిత్రాల కోసం శ్రమించిన దాఖలాలు లేవు. మొత్తం మీద కోబ్రా చిత్రంపై అంచనాలను భారీగా పెంచేశారు. ఎంతగా అంటే కోబ్రా చిత్రాన్ని చూడడానికి కళాశాల విద్యార్థులు కళాశాల యాజమాన్యాన్ని సెలవు అడిగేంతగా. తిరుచ్చిలోని సెయింట్‌ జోసెఫ్‌ కళాశాల విద్యార్థులు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌కు ఒక లేఖను రాశారు. అందులో కోబ్రా చిత్రాన్ని విడుదల అయిన తొలి రోజు చూడటానికి టిక్కెట్లు లభించలేదని, దీంతో ఒకటో తేదీ సినిమా చూసేందుకు సెలవు ఇవ్వాలని పేర్కొన్నారు. ఆ రోజు తాము కళాశాలకు రాకపోతే తమ తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయరాదని విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు