Cine Celebrities On OTT: ఓటీటీలకు తారల గ్రీన్‌ సిగ్నల్‌.. ఏకధాటిగా వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు

26 Apr, 2022 07:36 IST|Sakshi

Cine Celebrities On OTT Digital Platform: కరోనా లాక్‌డౌన్‌లో ఓటీటీల హవా మొదలైంది. స్టార్స్‌ సైతం ఓటీటీలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. థియేటర్స్‌ రీ ఓపెన్‌ చేసిన తర్వాత కూడా ఓటీటీ ప్రాజెక్ట్స్‌కు చాలా మంది యాక్టర్స్‌ పచ్చ జెండా ఊపుతూనే ఉన్నారు. తాజాగా కొందరు బాలీవుడ్‌ తారలు యాక్టర్స్‌ ‘ఓటీటీ.. మేం రెడీ’ అంటూ డిజిటల్‌ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం.  

దర్శక ద్వయం రాజ్‌ అండ్‌ డీకే తీసిన ‘ది ఫ్యామిలీ మేన్‌ సీజన్‌ 1’ వెబ్‌ సిరీస్‌కి, దీనికి కొనసాగింపుగా వచ్చిన ‘ది ఫ్యామిలీమేన్‌ సీజన్‌ 2’కి మంచి ఆదరణ దక్కింది. దీంతో కొందరు బాలీవుడ్‌ తారలు ఈ డైరెక్టర్స్‌తో వెబ్‌సిరీస్‌ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాగా షాహిద్‌ కపూర్‌తో రాజ్‌ అండ్‌ డీకే ‘సన్నీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) అనే వెబ్‌ సిరీస్‌ చేశారు. రాశీ ఖన్నా, విజయ్‌ సేతుపతి ఇతర లీడ్‌ రోల్స్‌ చేశారు. షాహిద్‌కు ఓటీటీలో ఇదే తొలి ప్రాజెక్ట్‌. 

ఇకపోతే వరుణ్‌ ధావన్‌ ఓటీటీ ఎంట్రీ దాదాపు ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలోని ఓ వెబ్‌ సిరీస్‌లో వరుణ్‌ ధావన్, సమంత నటిస్తున్నారని కొన్నాళ్లుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వరుణ్‌ ధావన్‌ బర్త్‌ డే (ఏప్రిల్‌ 24)  సందర్భంగా రాజ్‌ అండ్‌ డీకే సోషల్‌ మీడియాలో వరుణ్, సమంతల ఫొటోను షేర్‌ చేసి ‘యాక్షన్‌ ప్యాక్డ్‌ ఇయర్‌’ అనే క్యాప్షన్‌ ఇచ్చారు. దీంతో వరుణ్‌ డిజిటల్‌ ఎంట్రీ దాదాపు ఖరారు అయిందని బీ టౌన్‌ టాక్‌. 

అదేవిధంగా రాజ్‌ అండ్‌ డీకే డైరెక్షన్‌లోనే దుల్కర్‌ సల్మాన్‌ కూడా డిజిటల్‌ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. 1990 బ్యాక్‌డ్రాప్‌లో క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన  ‘గన్స్‌ అండ్‌ గులాబ్స్‌’ వెబ్‌ సిరీస్‌లో దుల్కర్‌తోపాటు రాజ్‌కుమార్‌ రావు, ఆదర్శ్‌ గౌరవ్‌ లీడ్‌ రోల్స్‌ చేశారు. షూటింగ్‌ పూర్తయిన ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ డేట్‌పై త్వరలో ఓ క్లారిటీ రానుంది. ఇక గత ఏడాది ఆగస్టులో ఓటీటీలో రిలీజైన సిద్ధార్థ్‌ మల్హోత్రా ‘షేర్షా’ చిత్రానికి వ్యూయర్స్‌ నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో మరో ఓటీటీ ప్రాజెక్ట్‌కి సైన్‌ చేశారు సిద్ధార్థ్‌. రోహిత్‌ శెట్టి డైరెక్షన్‌లో ‘ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌’ పేరుతో తెరకెక్కుతోన్న వెబ్‌సిరీస్‌లో సిద్ధార్థ్‌ మల్హోత్రా ఓ లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. 

మరో బాలీవుడ్‌ యంగ్‌ హీరో ఆదిత్యారాయ్‌ కపూర్‌ సైతం ఓటీటీ బాటకే ఓటేశారు. బ్రిటీష్‌ పాపులర్‌ సిరీస్‌ ‘ది నైట్‌ మేనేజర్‌’ హిందీ అడాప్షన్‌ ఓటీటీ ప్రాజెక్ట్‌లో లీడ్‌ రోల్‌ చేస్తున్నారు ఆదిత్య. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్‌ షూటింగ్‌ మొదలైంది. ఇందులో అనిల్‌ కపూర్, శోభితా ధూళిపాళ్ల కూడా లీడ్‌ రోల్స్‌ చేస్తున్నారు. ‘ది నైట్‌ మేనేజర్‌’ హిందీ అడాప్షన్‌ ప్రాజెక్ట్‌లో హృతిక్‌ రోషన్‌ నటిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా ఫైనల్‌గా ఆదిత్యారాయ్‌ కపూర్‌ రంగంలోకి దిగారు. 

ఇక హీరోయిన్ల విషయానికి వస్తే..
‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’ అనే హాలీవుడ్‌ వెబ్‌ ఫిల్మ్‌ చేస్తున్నారు ఆలియా భట్‌. టామ్‌ హార్పర్‌ దర్శకత్వం వహించనున్న ఈ వెబ్‌ ఫిల్మ్‌లో ఇంగ్లీష్‌ యాక్టర్స్‌ గాల్‌ గాడోట్, జామీ డోర్నన్‌ ఇతర లీడ్‌ రోల్స్‌ చేస్తున్నారు.  హీరోయిన్‌ సోనాక్షీ సిన్హా కూడా ఓటీటీ ఫిల్మ్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.  ‘ది ఫాలెన్‌’గా వస్తున్న ఈ వెబ్‌ ఫిల్మ్‌కు రీమా కాగ్తీ దర్శకురాలు. ఈ ప్రాజెక్ట్‌లో సోనాక్షి పోలీసాఫీసర్‌గా కనిపిస్తారు. ఇక ఓటీటీ ప్రాజెక్ట్స్‌తోనే కెరీర్‌ను స్టార్ట్‌ చేసే సాహసం చేశారు స్టార్‌ కిడ్స్‌ అగస్త్య నంద (అమితాబ్‌ బచ్చన్‌ మనవడు), ఖుషీ కపూర్‌ (దివంగత నటి శ్రీదేవి, నిర్మాత బోనీకపూర్‌ల చిన్న కుమార్తె), సునైనా ఖాన్‌ (షారుక్‌ఖాన్‌ కుమార్తె). ‘ది ఆర్చీస్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌)గా తెరకెక్కుతోన్న ఈ వెబ్‌ ఫిల్మ్‌కు జోయా అక్తర్‌ దర్శకురాలు. ఆల్రెడీ ఊటీలో షూటింగ్‌ మొదలైంది. 

బాలీవుడ్‌లోని మరికొంతమంది యాక్టర్స్‌ ఓటీటీ బాటపడుతున్నారని లేటెస్ట్‌ టాక్‌. ఇక.. కొందరు సీనియర్‌ యాక్టర్స్‌లో అక్షయ్‌ కుమార్‌ ‘ది ఎండ్‌’ అనే భారీ ఓటీటీ ప్రాజెక్టుకి ఓకే చెప్పారు. కానీ వివిధ కారణాల వల్ల షూటింగ్‌ వాయిదా పడుతూ వస్తోంది. ‘సేక్రెడ్‌ గేమ్స్‌’తో సైఫ్‌ అలీఖాన్, ‘రుద్ర’తో అజయ్‌ దేవగన్‌ వంటి  సీనియర్స్‌ డిజిటల్‌ వ్యూయర్స్‌ ముందుకు వచ్చారు. సీనియర్‌ హీరోయిన్స్‌లో ‘ఆర్య’తో సుష్మితాసేన్, ‘మెంటల్‌హుడ్‌’తో కరిష్మా కపూర్, ‘ది ఫేమ్‌ గేమ్‌’తో మాధురీ దీక్షిత్‌ ఇప్పటికే డిజిటల్‌లోకి వచ్చేశారు. ‘ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌’తో శిల్పాశెట్టి, కరీనా కపూర్‌ (సుజోయ్‌ ఘోష్‌ దర్శకత్వంలోని సినిమా..), ‘చక్‌ ద ఎక్స్‌ప్రెస్‌’తో (మహిళా క్రికెటర్‌ జూలన్‌ గోస్వామి బయోపిక్‌) అనుష్కా శర్మ వంటివారు డిజిటల్‌ వ్యూయర్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయడానికి రెడీ అవుతున్నారు.         
 

మరిన్ని వార్తలు