అనుష్క అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తానంటూ రూ.51 లక్షలు మోసం!

25 Jan, 2023 14:50 IST|Sakshi

ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పలానా  హీరో, హీరోయిన్‌ అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తానని, సినిమాల్లో నటించే అవకాశాలు ఇప్పిస్తామంటూ పలువురు కేటుగాళ్లు లక్షల్లో డబ్బులు తీసుకొని మోసానికి పాల్పడుతున్నారు. తాజాగా స్టార్‌ హీరోయిన్‌ అనుష్క, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పేరు చెప్పి రూ.51లక్షలు మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

అనుష్క, మణిశర్మలతో అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తానంటూ మేనేజర్‌ ఎల్లారెడ్డి.. విశ్వకర్మ క్రియేషన్స్ అధినేత, వర్ధమాన నిర్మాత లక్ష్మన్ చారీ నుంచి రూ. 51 లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. అనుష్కతో సినిమా డేట్స్‌ అంటూ  నిర్మాతను పలు మార్లు బెంగళూరు తీసుకెళ్ళిన ఎల్లారెడ్డి.. మొదటగా రూ.26 లక్షలు వసూలు, తర్వాత మణిశర్మ పేరు చెప్పి మరికొన్ని డబ్బులు.. మొత్తంగా రూ.51 లక్షలు వసూలు చేసి అపాయింట్‌మెంట్‌ ఇప్పించలేదు. 

ఎల్లారెడ్డి చేతిలో మోసపోయానని గుర్తించిన లక్ష్మణాచారి..  ఫిలిం ఛాంబర్ ని ఆశ్రయించాడు. దీంతో మొదట డబ్బు వెనక్కి ఇస్తా అని చెప్పిన మేనేజర్, తరువాత తిరగపడ్డాడు.డబ్బులు అడిగితే ఇంట్లోని ఆడవాళ్లతో కేసులు పెట్టిస్తాని బెదిరించాడు. చివరకు చేసేదేమి లేక బాధితుడు  బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

మరిన్ని వార్తలు