Cinema Bandi: సినిమా బండి మూవీ రివ్యూ

15 May, 2021 01:04 IST|Sakshi

రివ్యూ టైమ్‌

చిత్రం: ‘సినిమా బండి’; రచన: వసంత్‌; నిర్మాతలు: రాజ్‌ అండ్‌ డి.కె; దర్శకత్వం: ప్రవీణ్‌; సిన్మాను ప్రేమించని వాళ్ళు అరుదే. ‘‘మూడు పొద్దులూ భోజనంచేసేదానికే దుడ్లు లేని మనుషులు’’ అనుభవం, పరిజ్ఞానం లేకున్నా పల్లె అమాయకత్వంతో సిన్మా తీయాలని చూస్తే? ఇలాంటి ఘటనలు అనేక చోట్ల చూశాం. యూ ట్యూబ్‌లో వైరల్‌ చేశాం. హిందీ మొదలు కొన్ని భారతీయ భాషల్లో ఇలాంటి ప్రయత్నాలు గతంలోనే వచ్చినా, తెలుగుదనం నిండి ఉండడం ‘సినిమా బండి’కున్న ప్రత్యేకత.

కథేమిటంటే..: గొల్లపల్లిలో ఆటోడ్రైవర్‌ వీరబాబు (వికాస్‌ వశిష్ఠ). ఎవరో తన ఆటోలో మర్చిపోయిన కెమెరాతో తమ పల్లెకు పేరొచ్చేలా ఓ సినిమా తీయాలనుకుంటాడు. స్థానిక పెళ్ళిళ్ళ ఫోటోగ్రాఫర్‌ గణపతి (సందీప్‌ వారణాసి) సాయం తీసుకుంటాడు. సెలూన్‌ షాపు మరిడేశ్‌ (రాగ్‌ మయూర్‌)నూ, కూరలమ్మే మంగ (ఉమ)నూ హీరో, హీరోయిన్లుగా ఎంచుకుంటారు. కాస్ట్యూమ్స్‌ కంటిన్యుటీ దగ్గర నుంచి క్లోజప్, లాంగ్‌ షాట్ల తేడా కూడా తెలియని ఆటోడ్రైవరే డైరెక్టర్‌ అవతారమెత్తుతాడు. అతనికి ఎదురైన కష్టనష్టాలు, ఆ ఊరి జనం స్పందనతో సినిమా నడుస్తుంది.

ఎలా చేశారంటే..: ఇలాంటి ఓ ఉత్తరాది గ్రామీణ జీవితం ఏళ్ళక్రితమే ‘సూపర్‌మెన్‌ ఆఫ్‌ మాలేగా(వ్‌’ పేరిట డాక్యుమెంటరీగా వచ్చింది. ఇదీ అలాంటి ఇతివృత్తమే. అందుకే కొన్నిసార్లు ఇది సినిమాగా కన్నా సహజత్వం ఎక్కువైన డాక్యు –డ్రామాగా అనిపిస్తుంది. కానీ, పాత్రల్లోని అమాయకత్వం, సహజ నటన, డైలాగ్స్‌ గంటన్నర పైచిలుకు కూర్చొని చూసేలా చేస్తాయి. ప్రధాన పాత్రధారి వికాస్‌ను పక్కన పెడితే, అత్యధికులకు ఇదే తొలి చిత్రం. షార్ట్‌ ఫిల్ముల్లో నటించినవాళ్ళే కాబట్టి, కెమేరా కొత్త లేదు. కెమేరామన్‌ గణపతిగా చేసిన సందీప్‌ వారణాసి మొదలు కూరగాయలమ్ముతూ హీరోయిన్‌గా నటించడానికి ముందుకొచ్చే మంగ పాత్రధారిణి ఉమ దాకా అందరూ సహజంగా నటించారు. సినిమా లాభాలతో, ఊరిని బాగు చేయాలనుకొనే ఆటోడ్రైవర్, అతని భార్య (గంగోత్రిగా సిరివెన్నెల)ను చూస్తే, ముచ్చటైన ఓ గ్రామీణ జంటను చూసినట్టనిపిస్తుంది. ఆ కెమిస్ట్రీని తెరపై తేవడంలో దర్శకుడూ బాగా సక్సెస్‌.

ఎలా తీశారంటే..: బాలీవుడ్‌లో పదేళ్ళ పైగా పనిచేస్తూ, తమదైన మార్కు వేసిన మన తెలుగుబిడ్డలు – ‘ఫ్యామిలీ మ్యాన్‌’ సిరీస్‌ ఫేమ్‌ రాజ్‌ అండ్‌ డి.కె! వారే ఈ చిన్న దేశవాళీ భారతీయ చిత్రాన్ని ప్రవీణ్‌ కాండ్రేగుల దర్శకత్వంలో నిర్మించారు. దర్శకుడు ముందుగా ఇదే కథను ఓ షార్ట్‌ ఫిల్మ్‌ ఫక్కీలో పైలట్‌ వెర్షన్‌లా తీసి నిర్మాతలకు చూపారు. ఆ తారాగణమే వెండితెరకూ ఎక్కింది. ఆంధ్రా – కర్ణాటక సరిహద్దులో జరిగే కథకు ఆ రకమైన యాసతో వసంత్‌ మరింగంటి డైలాగ్స్‌ బాగున్నాయి. నటీనటులూ బాగా చేశారు. సింక్‌ సౌండ్‌లో ఈ చిత్రాన్ని తీశారు.

అయితే, రాసుకున్న విధానం నుంచి, తీసిన తీరు దాకా కొన్నిచోట్ల షార్ట్‌ ఫిల్మ్‌కి ఎక్కువ... సినిమాకు తక్కువ అనిపిస్తుంది. సినిమా మీద అపరిమిత ఇష్టం కానీ, తెరపై కథ చెప్పాలనే కోరిక కానీ ఆటోడ్రైవర్‌లో ఆది నుంచి ఉన్నట్టు కథలో ఎక్కడా కనిపించదు. అతను ఉన్నట్టుండి సినిమా రూపకల్పన వైపు రావడం అతికినట్టు అనిపించదు. అలాగే, కెమేరా పోగొట్టుకున్న వారి కథను ఎఫెక్టివ్‌ గా స్క్రిప్టులో మిళితం చేయలేకపోయారు. హాస్య సంఘటనలు కొన్ని బాగున్నా అనవసరపు సీన్లు, నిదానంగా సాగే కథనం ఇబ్బంది పెడతాయి. ‘ఎవ్రీ వన్‌ ఈజ్‌ ఎ ఫిల్మ్‌ మేకర్‌ ఎట్‌ హార్ట్‌’ అని చెప్పదలుచున్న విషయం బాగున్నా, మరిన్ని భావోద్వేగ సంఘటనలుంటే బాగుండేది. ఆ లోటుపాట్లని అంగీకరిస్తూనే, ఓటీటీ ఫీల్‌ గుడ్‌ కాలక్షేపంగా, ఈ దేశవాళీ దర్శక – రచయితల తొలియత్నాన్ని అభినందించవచ్చు.
         
బలాలు:
► దేశవాళీ భారతీయ చిత్రం కావడం
► ఇతివృత్తం, హాస్య సంఘటనలు
► పాత్రల్లోని సహజత్వం, అమాయకత్వం
► డైలాగులు, దర్శకత్వం

బలహీనతలు:
► స్లో నేరేషన్‌
► పరిమిత నిర్మాణ విలువలు
► అపరిచిత ముఖాలు
► భావోద్వేగాలు పెద్దగా లేకపోవడం

కొసమెరుపు: ఆకర్షించే అమాయకత్వం, సహజత్వం కోసం... గంటన్నర జర్నీ!

– రెంటాల జయదేవ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు