జీవితంలో సినిమా ఒక భాగం: నిర్మాత నిరంజన్‌ రెడ్డి

21 Jul, 2021 21:49 IST|Sakshi

‘టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశంలోనే ప్రేక్షకులు సినిమాలను థియేటర్స్‌లో చూసేందుకు వస్తున్నారు. అలాంటిది సినిమాను అమితంగా ప్రేమించే మన తెలుగు ప్రేక్షకులు థియేటర్స్‌ రీ ఓపెన్‌ అయితే తప్పక వస్తారనే నమ్మకం ఉంది. ఓటీటీ ఆఫర్లు వచ్చినా మా బ్యానర్‌లోని సినిమాలను థియేటర్స్‌లోనే విడుదల చేస్తున్నాం’అని అన్నారు ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మాత కె. నిరంజన్‌ రెడ్డి.

గురువారం (జూలై 22)న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా తన భవిష్యత్‌ కార్యాచరణ, విడుదలకు సిద్ధంగా ఉన్న తమ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘మా తల్లిదండ్రుల స్వస్థలం తెలంగాణలోని నల్గొండ జిల్లా. కానీ నేను పుట్టి, పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. ఇంజినీరింగ్‌ తర్వాత యూఎస్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసి రెండేళ్ళు ఉద్యోగం చేశాను. ఆ నెక్ట్స్‌ ఓ ఐటీ కంపెనీని స్టార్ట్‌ చేశా. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనూ రాణిస్తున్నాను. మనందరి జీవితాల్లో సినిమా అనేది ఒక భాగం. సో.. సినిమాలపై ఆసక్తి, కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే ‘ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌’ నిర్మాణ సంస్థను ప్రారంభించాను.

టైమ్‌ వేల్యూని మేం బాగా ఫాలో అవుతాం. దాదాపు 200మంది కొత్త సాంకేతిక నిపుణులు మమ్మల్ని సంప్రదించారు. మా బ్యానర్‌లో రూపొందిన ‘హౌస్‌ అరెస్ట్‌’ సినిమాను థియేటర్స్‌ రీ ఓపెన్‌ చేసిన వెంటనే విడుదల చేస్తాం. రెండు వారాల తర్వాత మా మరో చిత్రం ‘బాయ్‌ ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌’ ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నాం. ఇక ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘హను మాన్‌’ఓ సూపర్‌ హీరో ఫిల్మ్‌. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రం ఉంటుంది. భవిష్యత్‌లో ఓటీటీ రంగంలోకే కాదు.. ఎగ్జిబిటర్‌గా కూడా రావాలని ప్లాన్‌ చేస్తున్నాం. మా టీమ్‌ సభ్యులు చైతన్య, ఆశిన్‌ రెడ్డి బాగా కష్టపడుతున్నారు’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు