సినిమా అంటే దేవాలయం: రాజమౌళి

6 Jan, 2023 08:23 IST|Sakshi
న్యూయార్క్‌లో ఓ సెల్ఫీ

‘‘నా దృష్టిలో సినిమా అంటే ఓ దేవాలయం. చిన్నప్పుడు సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు పొందిన ఆనందం నాకిప్పటికీ గుర్తుంది’’ అని దర్శకుడు రాజమౌళి అన్నారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా గత ఏడాది విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికే ఈ చిత్రం పలు అవార్డులు అందుకుంది.  తాజాగా ఉత్తమ దర్శకుడిగా ‘న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌’ అవార్డును అందుకున్నారు రాజమౌళి.

ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ– ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకోవడం సంతోషంగా ఉంది. ప్రతి సీన్‌ని నేను ఓ ప్రేక్షకుడిలా ఊహించుకుని తీస్తాను. ప్రపంచంలోని భారతీయులను ఆకట్టుకోవడం కోసం సినిమాలు తీస్తుంటాను. కానీ, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’పై భారతీయులు ఎలాంటి ప్రేమను చూపించారో విదేశీయులు కూడా అలానే చూపించారు.

నా సినిమాలకు పని చేసే ముఖ్యమైన వ్యక్తులందరూ నా సొంత కుటుంబ సభ్యులే. నన్ను అత్యున్నత స్థానంలో నిలపడం కోసం వారు కష్టపడుతున్నారు. నేను ఎలాంటి విజయాలు అందుకున్నా నా కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్, తారక్‌ (ఎన్టీఆర్‌), చరణ్‌ (రామ్‌చరణ్‌)లకు, సినిమా ప్రేమికులకు థ్యాంక్స్‌’’ అన్నారు. కాగా ఈ వేడుకలో రాజమౌళి సతీమణి రమా, వదిన వల్లి, తనయుడు కార్తికేయ, కోడలు పూజ, నిర్మాత శోభు యార్లగడ్డ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు