తాళాలు తెరవాలి.. ఉద్యోగాలు కాపాడాలి

16 Sep, 2020 03:57 IST|Sakshi

తెర మీద బొమ్మ ఆడేప్పుడు మాత్రమే సినిమా హాలు చీకటిగా మారుతుంది. ఆరు నెలలుగా దేశవ్యాప్తంగా థియేటర్స్‌ను చీకటి ఆవహించింది. మార్చి నెలలో థియేటర్స్‌కు తాళం పడింది. థియేటర్‌ బిజినెస్‌కు గండి పడింది. అప్పటినుంచి థియేటర్స్‌లో ఒక్క బొమ్మా పడ్లేదు. దీన్ని నమ్ముకున్న చాలామందికి జీతాలు పడ్లేదు. చీకట్లో మగ్గిపోయింది చాలు తాళాలు తెరవనివ్వండి అంటోంది థియేటర్స్‌ యాజమాన్యం. సినిమా థియేటర్స్‌ ఓపెన్‌ చేయండి. దీని చుట్టూ ఉన్న ఉపాధిని కాపాడండి అంటున్నారు. ఎందుకు తెరవాలో చెబుతున్నాయి ‘మల్టీప్లెక్స్‌ అసోసియేషను'. ఆ వివరాలు.

లాక్‌డౌన్‌ పూర్తయ్యాక దశలవారీగా అన్‌లాక్‌ ప్రారంభం అయింది. ఒక్కో అన్‌లాక్‌లో ‘ఈసారి థియేటర్స్‌ ఓపెన్‌ అవుతాయి’ అని ఆశపడ్డ ప్రతిసారీ నిరాశే ఎదురయింది థియేటర్స్‌ నిర్వాహకులకు. సెప్టెంబర్‌ నెల అన్‌లాక్‌ 4.0లో థియేటర్ల తాళాలు తెరవడానికి అనుమతి పక్కా అనుకున్నారు. అయితే నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ‘థియేటర్స్‌లో ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తాం. ప్రేక్షకుడికి ఎలాంటి భద్రత కల్పిస్తాం’ అనే విషయాలతో కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఓ లేఖ అందించింది ‘మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌’. ఆగస్ట్‌ చివరి వారంలో ‘సపోర్ట్‌ థియేటర్స్‌ – సేవ్‌ సినిమా’ అంటూ సోషల్‌ మీడియాలో ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేశారు. తాజాగా మరోసారి థియేటర్స్‌ను తెరవాలంటూ ప్రభుత్వాన్ని కోరింది మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా. ఈసారి ‘అన్‌లాక్‌ సినిమాస్‌ – సేవ్‌ జాబ్స్‌’ అంటూ వినతిపత్రాన్ని అందించారు. థియేటర్స్‌ బిజినెస్‌ చూస్తున్న నష్టాలు, పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించింది మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌. ఆ వివరాలు

► దేశానికి సినిమాలు సాఫ్ట్‌ పవర్‌. ఇప్పటికీ సినిమాయే మన దేశంలో ఎక్కువమందికి ప్రాధమిక వినోదం. మన దేశంలో సుమారు 10,000 సినిమా స్క్రీన్లు ఉన్నాయి. థియేటర్స్‌ బిజినెస్‌ సుమారు 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. పరోక్షంగా ఇంకొన్ని లక్షల మందికి ఉపాధి ఇస్తోంది. లాక్‌డౌన్‌ వల్ల సినిమా థియేటర్స్‌నే ముందు మూసేశారు. అన్నింటికంటే ఆలస్యంగా తెరవనున్నారు. 
► మాల్స్, ఎయిర్‌లైన్స్, రైల్వేస్, జిమ్స్, బార్స్, మెట్రో వంటివి తెరిచారు.. సినిమా హాళ్లు జనాన్ని కంట్రోల్‌ చేసే సామర్థ్యం ఉన్నవి. పరిశుభ్రత పాటించగలిగే ఆస్కారం ఉన్నవి. భౌతిక ధూరం పాటించగల వీలున్నవి. అయినా ఎందుకు తెరవడానికి అనుమతించడంలేదు?
► మిగతావాటిలో ఎంతమంది అయినా వెళ్తుంటారు. కానీ సినిమా హాళ్లలో టికెట్‌ కొనుక్కుని వచ్చే వాళ్లు మాత్రమే ఉంటారు. 
► ఎక్కువ జనాభా ఒకేచోట చేరకుండా షో టైమింగ్స్‌ అన్నీ మార్చుకోగలం. 
► అందరికీ దూరం దూరంగా వేచి చూసే స్థలం ఉంటుంది. 
► సినిమా థియేటర్స్‌ది ప్రొఫెషనల్‌ బిజినెస్‌. కాబట్టి ప్రభుత్వం ఆదేశించే జాగ్రత్తలన్నీ తీసుకోవడం జరుగుతుంది. 
► చైనా, కొరియా, ఫ్రాన్స్, జపాన్‌ వంటి 85 దేశాలు థియేటర్స్‌ను అన్ని జాగ్రత్తలతో తిరిగి ఓపెన్‌ చేశాయి. థియేటర్స్‌కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య కూడా ఆశాజనకంగా ఉంది. 
► లాక్‌డౌన్‌ నుంచి నెలకు 1500 కోట్లు నష్టాన్ని చూశాం. ఇప్పటికే దాదాపు 9వేల కోట్ల రూపాయిలు నష్టపోయాం. ఈ నష్టాన్ని అర్థం చేసుకొని ప్రభుత్వం వీలైనంత త్వరగా సినిమా థియేటర్స్‌ తెరవాలనే నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. 

సినీ ప్రముఖుల సపోర్ట్‌
థియేటర్స్‌ తెరవాలన్న విన్నపానికి పలువురు సినిమా ప్రముఖులు మద్దతు పలుకుతున్నారు. బాలీవుడ్‌ దర్శకులు శేఖర్‌ కపూర్, అనురాగ్‌ కశ్యప్, అనుభవ్‌ సిన్హా, కరణ్‌ జోహార్, నటులు మనోజ్‌ బాజ్‌పాయ్‌ వంటి వారు తమ ట్వీటర్‌ ద్వారా ‘అన్‌లాక్‌ సినిమాస్‌ – సేవ్‌ జాబ్స్‌’ అంటూ ట్వీట్‌ చేశారు. 

దసరాకి థియేటర్లు తెరవాలి
థియేటర్లు తెరవడానికి ఆమోదించాలి. ప్రేక్షకులు వస్తారా? లేదా? అనేది తర్వాతి విషయం. ముందు తెరవడానికి అనుమతించాలి. హోటల్స్‌నే తీసుకుందాం. ఈ కోవిడ్‌ టైమ్‌లో ఎవరు వస్తారు? అనుకున్నారు. హోటల్స్‌ తెరుచుకున్నాయి. ముందు తక్కువ సంఖ్యలోనే వచ్చారు. మెల్లి మెల్లిగా జనాలు పెరుగుతున్నారు. థియేటర్లు కూడా అంతే. ముందు తక్కువమంది వచ్చినా తర్వాత పెరుగుతారు. దసరాకి థియేటర్లు తెరిస్తే సంక్రాంతి వచ్చేసరికి ప్రేక్షకులు పెరుగుతారు. ‘స్టెబిలైజ్‌’ (స్థిరీకరణ) అవుతాయి. ఏ వ్యాపారం కూడా ఒకే రోజులో నిలదొక్కుకోదు. టైమ్‌ పడుతుంది. థియేటర్లు కూడా అంతే. ఇప్పుడు ఓపెన్‌ చేస్తే ఓ మూడు నాలుగు నెలల్లో స్టెబిౖలైజ్‌ అవుతాయి. పైగా మేం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాం. మల్టీప్లెక్స్‌లో చాలా స్క్రీన్లు ఉంటాయి. అన్ని షోలకూ ఒకేసారి ఇంటర్వెల్‌ కాకుండా వేరే టైమింగ్స్‌ నిర్ణయిస్తాం. అలాగే మొత్తం ఐదు షోలంటే కొంత కాలం ఒక షో తగ్గించి, నాలుగు షోలే ఆడిస్తాం. థియేటర్లోని చెడు గాలిని ‘ఎగ్జాస్టర్‌ ఫ్యాన్స్‌’ బయటకు లాగేస్తాయి. అయితే ఇప్పుడు మరో అధునాతమైన మిషన్‌ రాబోతోంది. వచ్చే వారం టెస్ట్‌ చేయబోతున్నాం. అది చెడు గాలిని పూర్తిగా బయటకు లాగేస్తుంది. ఇలా ప్రేక్షకుల సేఫ్టీ కోసం మేం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటాం. థియేటర్లు ఓపెన్‌ చేయడానికి అనుమతించాలని కోరుతున్నాం. – పంపిణీదారుడు, ఏషియన్‌ సినిమాస్‌ అధినేత సునీల్‌ నారంగ్‌

వ్యాపారం ఆగకూడదు
థియేటర్లు తెరవాలని కొందరు మల్టీప్లెక్స్‌ అధినేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నిజానికి వాళ్లంత యాక్టివ్‌గా నేను లేను. కానీ థియేటర్లు తెరవడానికి అనుమతించాలి. ఏ వ్యాపారమూ ఆగకూడదు. ఎవరి వ్యాపారం వాళ్లు చేసుకోవాలి. థియేటర్లు మూసి ఉంచడం సమస్యకు పరిష్కారం కాదన్నది నా అభిప్రాయం. పైగా థియేటర్ల అధినేతలుగా ప్రేక్షకుల క్షేమం విషయంలో మాకు చాలా బాధ్యత ఉంటుంది. జాగ్రత్తగా శానిటైజేషన్‌ చేయించడం,  ప్రతి స్క్రీన్‌కి వేరు వేరు టైమ్‌లో ఇంటర్వెల్‌ ఇవ్వడం.. ఇలా మా జాగ్రత్తలు మేం తీసుకుంటాం. ప్రేక్షకులు రారనే సందేహం అక్కర్లేదు. ముందు తక్కువమందే వచ్చినా తర్వాత తర్వాత పెరుగుతారనే నమ్మకం ఉంది. – నిర్మాత, ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌ అధినేత రమేష్‌ప్రసాద్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా