P C Sreeram-Thank You: లైన్‌ చెప్పి అడ్వాన్స్‌ ఇచ్చేస్తే సినిమా చేయను

22 Jul, 2022 01:09 IST|Sakshi

– పీసీ శ్రీరామ్‌

‘‘ఈ రోజుల్లో మానవ సంబంధాలకు చాలామంది విలువ ఇవ్వడం లేదు. కనీసం సహాయం చేసినవారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్‌ కూడా చెప్పడం లేదు. ఒకవేళ చెప్పినా మొక్కుబడిగా చెప్పినట్లు కనిపిస్తోంది. ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో ‘థ్యాంక్యూ’ లాంటి సినిమా రావడం ఆనందంగా ఉంది.

ఈ సినిమా చూసిన తర్వాత ‘థ్యాంక్యూ’ మాటకు ఎంత విలువ ఇవ్వాలో తెలుస్తుంది’’ అని ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్‌ అన్నారు. నాగచైతన్య హీరోగా విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్యూ’. రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్‌  కథానాయికలు. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా కెమెరామేన్‌ పీసీ శ్రీరామ్‌ చెప్పిన విశేషాలు..

► నేను ఓ సినిమా ఒప్పుకునే ముందు కథ మొత్తం వింటాను. ఆ కథ నా మనసుకి ఎమోషనల్‌గా నచ్చితేనే   సినిమా చేసేందుకు అంగీకరిస్తాను. అంతేకానీ స్టోరీ లైన్‌ చెప్పి అడ్వాన్స్‌ చేతిలో పెడితే సినిమా ఒప్పుకోను. కథ పూర్తిగా విన్నప్పుడే దర్శకుడి విజన్‌ ఏంటో తెలుస్తుంది. అప్పుడే ఆ కథని ఎలా చూపించాలో నాకు అర్థం అవుతుంది.

► ‘థ్యాంక్యూ’ అనే పదంలోనే పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ ఉన్నాయి. మన హృదయంలోని భావాలను స్వచ్ఛంగా వ్యక్తం చేయగలం. నా తల్లితండ్రులకు నేను ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను. ఎందుకంటే ఈ రోజు నేను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం వారే. నా వ్యక్తిగత, సినీ ప్రయాణంలో నేను థ్యాంక్స్‌ చెప్పాల్సినవారెందరో ఉన్నారు.. ఈ సినిమా చేశాక వారందరకీ థ్యాంక్స్‌ చెప్పాలనిపించింది.

► ప్రతి రంగంలో టెక్నాలజీలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తుంటాయి. అలాగే సినిమాటోగ్రఫీలోనూ సాంకేతిక పరంగా ఎన్నో మార్పులు వస్తున్నాయి. రోజురోజుకీ వందల రకాలుగా టెక్నాలజీ అప్‌డేట్‌ అవుతుంటుంది. ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా మన క్రియేటివ్‌ విజన్‌ని బట్టే అది తెరపై కనిపిస్తుంది. దర్శకుడు చెప్పిన కథని నా కోణంలో తెరపైన ఆవిష్కరించడానికే ప్రయత్నిస్తాను. నేను ఏ సినిమా చేసినా, నా వర్కే డామినేట్‌ చేస్తుందని అనుకోవడంలో నిజం లేదు. కథకి ఏం కావాలో అదే ఇస్తాను. ఎవరైనా అభద్రతా భావంలో ఉంటే నేను డామినేట్‌ చేస్తున్నట్టు అనిపిస్తుంది.

► డైరెక్షన్, సినిమాటోగ్రఫీ రెండూ వేర్వేరు. ఈ విభాగాల పని తీరు వేరుగా ఉంటుంది. దర్శకత్వం నా వృత్తి కాదు. అందుకే డైరెక్టర్‌ (తమిళ చిత్రాలు ‘మీరా, కురుది పునల్,  వానమ్‌ వసప్ప   డుమ్‌’కి దర్శకత్వం వహించారు) గా సక్సెస్‌ కాలేకపోయాను. భవిష్యత్తులో మెగాఫోన్‌ పట్టాలన్న ఆలోచన లేదు.  

మరిన్ని వార్తలు