కత్రీనా కైఫ్‌-రణ్‌వీర్‌ సింగ్‌ మధ్య పోటీ.. ఎవరు గెలుస్తారో ?

27 Nov, 2021 16:51 IST|Sakshi

Katrina Kaif And Ranveer Singh: కొవిడ్‌ కారణంగా చాలా నెలలు థియేటర్లన్ని మూసివేశారు. నెలల తరబడి వినోదం పంచేందుకు సినిమాలు ఎదురుచూస్తున్నాయి. ఎప్పుడెప్పుడూ విడుదలై ప్రేక్షకులు ముందుకు వెళ్దామా అని తహతహలాడాయి. ఇక ఆ సమయం వచ్చేసింది. ఇప్పుడు పరిస్థితులు కొంతమేర మెరుగుపడ్డాయి. ఇటీవల పలు సినిమాలు థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని కూడా దక్కించుకున్నాయి. అందుకే వచ్చే సంవత్సరమైనా ప్రేక్షకుల ముందుకు వెళ‍్దామని సిద్ధంగా ఉన్నాయి. అందులో ప్రధానంగా రెండు క్రేజీ సినిమాలు ఉన్నాయి. అవి వాటి రిలీజ్‌ డేట్‌ను ప్రకటించాయి. 

బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్న 'సర్కస్‌', కత్రీనా కైఫ్‌ 'ఫోన్‌ భూత్‌' సినిమాలు ఒకేరోజు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ రెండు చిత్రాలను వచ్చే ఏడాది జూలై 15న రిలీజ్‌ చేయనున్నారు మూవీ మేకర్స్‌. అక్షయ్‌ కుమార్‌ హీరోగా 'సూర్యవంశీ' తెరకెక్కించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు రోహిత్‌ శెట్టి. ఇప్పుడు ఆయన రణ్‌వీర్‌ సింగ్‌తో రూపొందిస్త్నున చిత్రమే 'సర్కస్‌'. ప్రముఖ రచయిత షేక్‌స్పియర్‌ నాటకం 'ది కామెడీ ఎర్రర్స్‌' పుస్తకం ఆధారంగా కథ సాగుతుందని సమాచారం. పూజా హెగ్డే, జాక్వెలైన్‌ ఫెర్నాండేజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షెడ్యూల్‌ డిసెంబర్‌ 1 నుంచి ఊటీలో ప్రారంభం కానుంది. 

గుర్మీత్‌ సింగ్‌ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం 'ఫోన్ భూత్'. ఈ సినిమా హార్రర్‌ కామెడీ తరహాలో సాగనుంది. ఇందులో సిద్ధాంత్‌ ఛతుర్వేది, రితేష్‌ సిద్వానీ నటిస్తున్నారు. రణ్‌వీర్ సింగ్‌ 'సర్కస్‌', కత్రీనా కైఫ్‌ 'ఫోన్‌ భూత్‌' రెండూ కామెడీ నేపథ్యంలోనే రానున్నాయి. ఈ రెండింట్లో ఏ చిత్రాన్ని బాక్సాఫీస్‌ వరించనుందో చూడాలి. 

మరిన్ని వార్తలు