టాలీవుడ్‌, బాలీవుడ్‌ల మధ్య క్లాష్‌ తప్పదా..

25 Feb, 2021 00:10 IST|Sakshi

కోవిడ్‌ వల్ల సినిమా షూటింగ్‌ షెడ్యూల్స్, రిలీజ్‌ డేట్స్‌ అన్నీ తారుమారు అయిపోయాయి. విడుదల కావాల్సిన సినిమాల సంఖ్య అలా పెరిగిపోయింది. దీంతో రిలీజ్‌ డేట్స్‌ బుక్‌ చేసుకోవడం కీలకమైంది. ఎంత ముందు బుక్‌ చేసుకున్నా క్లాష్‌ అనివార్యంలా కనిపిస్తోంది. సౌత్‌లో తెరకెక్కుతున్న పలు భారీ సినిమాలన్నింటినీ ప్యాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేస్తున్నారు. దీంతో సౌత్‌లో తెరకెక్కుతున్న ప్యాన్‌ ఇండియా సినిమాలు, హిందీ సినిమాల రిలీజ్‌ డేట్‌ విషయంలో క్లాష్‌ ఏర్పడుతోంది. ఇప్పటి వరకూ ప్రకటించిన చిత్రాల్లో సౌత్‌ వర్సెస్‌ నార్త్‌ క్లాష్‌ వివరాలు. 

ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న మన సౌత్‌ సినిమాలకు క్లాష్‌ వల్ల ఏదైనా మైనస్‌ ఉంటుందా? థియేటర్స్‌ విషయంలో ఏదైనా ఇబ్బంది ఏర్పడుతుందా? నార్త్‌ ఆడియన్స్‌ కంటెంట్‌కి ప్రాధాన్యత ఇచ్చి ఏ సినిమా బావుంటే అది చూస్తారా? లేక హిందీ సినిమాలకే ఓటు వేస్తారా? క్లాష్‌ అంటే బిజినెస్‌ని షేర్‌ చేసుకున్నట్టే. మరి బిజినెస్‌ని షేర్‌ చేసుకుంటారా? లేక కలిసి కూర్చుని మాట్లాడుకుని, ఒకేసారి కాకుండా డేట్స్‌ని మార్చుకుంటారా చూడాలి.  

ఆర్‌ఆర్‌ఆర్‌ వర్సెస్‌ మైదాన్‌ 
‘బాహుబలి’ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను దసరా స్పెషల్‌గా అక్టోబర్‌ 13న విడుదల చేసున్నట్టు ఇటీవలే ప్రకటించారు. దసరా వీకెండ్‌కి హిందీలో అజయ్‌ దేవగణ్‌ నటించిన స్పోర్ట్స్‌ డ్రామా ‘మైదాన్‌’ కూడా విడుదల కాబోతోంది. బోనీ కపూర్‌ ఈ సినిమా నిర్మాత. అక్టోబర్‌ 15న మైదాన్‌ రిలీజ్‌. ‘‘కోవిడ్‌ వల్ల ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మా సినిమా రిలీజ్‌ డేట్‌ ఇచ్చిన తర్వాత కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వాళ్లు రిలీజ్‌ డేట్‌ ఇవ్వడం సరైనదిగా అనిపించడంలేదు’ అని బోనీకపూర్‌ బాలీవుడ్‌ మీడియాతో పేర్కొన్నారు. విశేషం ఏంటంటే.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో అజయ్‌ దేవగణ్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. 

రాధే శ్యామ్‌ వర్సెస్‌ గంగూబాయి
ప్రభాస్‌ పీరియాడికల్‌ లవ్‌స్టోరీ చిత్రం ‘రాధేశ్యామ్‌’. పూజా హెగ్డే కథానాయిక. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జూలై 30న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు అదే తేదీకి ఆలియా భట్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గంగూబాయి కతియావాడి’ని రిలీజ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. ‘పద్మావత్‌’ చిత్రం తర్వాత సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. ఇందులో వేశ్య పాత్రలో నటించారు ఆలియా. 

పుష్ప వర్సెస్‌ అటాక్‌ 
అల్లు అర్జున్‌ తొలి ప్యాన్‌ ఇండియన్‌ చిత్రం ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఇండిపెండెన్స్‌ వీక్‌కి ఆగస్ట్‌ 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. హిందీ సినిమాల్లో ఇండిపెండెన్స్‌ వీక్‌ కూడా కీలకమైనదే. ఈ ఇండిపెండెన్స్‌ డే వీక్‌కు వస్తున్నట్టు జాన్‌ అబ్రహామ్‌ ప్రకటించారు. తన తాజా చిత్రం ‘అటాక్‌’ని ఆగస్ట్‌ 13న విడుదల చేస్తున్నట్టు తెలిపారు. 

మేజర్‌ వర్సెస్‌ షేర్‌షా
ముంబై తాజ్‌ అటాక్స్‌లో మరణించిన మేజర్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్‌’. కథను అందించి, టైటిల్‌ రోల్‌ చేశారు అడివి శేష్‌. శశి కిరణ్‌ తిక్క దర్శకుడు. ఈ సినిమా జూన్‌ 2న విడుదల కానుంది. అదే రోజున సిద్ధార్థ్‌ మల్హోత్రా నటించిన ‘షేర్‌షా’ రిలీజ్‌ కానుంది. ఆర్మీ కెప్టెన్‌ విక్రమ్‌ బాత్రా జీవితం ఆధారంగా ఈ సినిమాను తీశారు. తమిళ దర్శకుడు విష్ణువర్ధన్‌ హిందీలో చేసిన తొలి చిత్రమిది. కరణ్‌ జోహార్‌ నిర్మించారు. మేజర్, షేర్‌షా.. రెండూ బయోగ్రఫీ జానర్‌ కావడం విశేషం. 

లైగర్‌ వర్సెస్‌ భూత్‌ పోలీస్‌
పూరి జగన్నాథ్‌ – విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్న ప్యాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. కరణ్‌ జోహార్, చార్మీ, పూరి జగన్నాథ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా సెప్టెంబర్‌ 9న విడుదల కానుంది. సైఫ్‌ అలీ ఖాన్, అర్జున్‌ కపూర్‌ హీరోలుగా తెరకెక్కుతున్న హారర్‌ కామెడీ చిత్రం ‘భూత్‌ పోలీస్‌’. ఈ సినిమా సెప్టెంబర్‌ 10న థియేటర్స్‌లోకి రానుంది. 

మరిన్ని వార్తలు